ఓంశాంతి. పిల్లలు భక్తులు పాడే ఈ పాటను విన్నారు. ఇప్పుడు మీరిలా అనరు. ఎందుకంటే మనకు అత్యంత ఉన్నతమైన తండ్రి లభించారని మీకు తెలుసు, వారొక్కరే అత్యంత ఉన్నతమైనవారు. ఈ సమయంలో ఉన్న మనుష్యులందరూ నీచాతి నీచంగా ఉన్నారు. అత్యంత ఉన్నతమైన మనుష్యులుగా భారతదేశములో ఈ దేవీదేవతలే ఉండేవారు. వారిని సర్వగుణసంపన్నులు..... అని మహిమ చేస్తారు. అయితే, ఈ దేవతలను అంత ఉన్నతంగా తయారుచేసిన వారెవరో ఈ మనుష్యులకు తెలియదు. ఇప్పుడైతే పూర్తిగా పతితులై ఉన్నారు. తండ్రి అత్యంత ఉన్నతులు. సాధు-సత్పురుషులందరూ వారి కొరకు సాధన చేస్తారు. అటువంటి సాధువుల వెనుక మనుష్యులు అర్ధకల్పము తిరిగారు. ఇప్పుడా తండ్రి వచ్చారని, మనము వారి వద్దకు వెళ్తామని మీకు తెలుసు. వారు మనకు శ్రీమతము ఇచ్చి శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా, సదా సుఖవంతులుగా చేస్తారు. రావణుని మతముపై మీరు ఎంత తుచ్ఛ బుద్ధి కలవారిగా అయ్యారు! మీరిప్పుడు ఇంకెవ్వరి మతమును అనుసరించకండి. పతితపావనుడైన నన్ను పిలిచారు, మళ్ళీ మిమ్ముల్ని ముంచేసేవారి వెనుక ఎందుకు పడతారు! ఒక్కరి మతమును వదిలి అనేక మంది వద్దకు వెళ్ళి ఎదురు దెబ్బలెందుకు తింటారు? చాలా మంది పిల్లలు జ్ఞానము కూడా వింటూ ఉంటారు, మళ్ళీ వెళ్ళి గంగా స్నానాలు కూడా చేస్తూ ఉంటారు, గురువుల వద్దకు కూడా వెళ్తారు..... తండ్రి చెప్తున్నారు, ఆ గంగ పతితపావని కానే కాదు. అయినా మీరు మనుష్యుల మతముననుసరించి స్నానము మొదలైనవి చేస్తారు, అప్పుడు తండ్రి అంటారు - అత్యంత ఉన్నతమైన తండ్రినైన నా మతముపై కూడా మీకు నమ్మకము లేదు. ఒకవైపు ఈశ్వరీయ మతము, రెండవవైపు ఆసురీ మతము, వారి పరిస్థితి ఎలా ఉంటుంది? రెండు వైపులా కాళ్ళు ఉంచితే మధ్యకు చీలిపోతారు. తండ్రిపై కూడా పూర్తి నిశ్చయముంచరు. బాబా మేము మీ వారము, మీ మతమును అనుసరించి మేము శ్రేష్ఠంగా అవుతాము అని కూడా అంటారు. మనము అత్యంత ఉన్నతమైన తండ్రి మతముపై మన అడుగు వేయాలి. శాంతిధామానికి, సుఖధామానికి యజమానులుగా తండ్రినే చేస్తారు. తండ్రి చెప్తున్నారు - ఎవరి శరీరములో నేను ప్రవేశించానో అతను 12 మంది గురువులను ఆశ్రయించారు, అయినా తమోప్రధానంగానే అయ్యారు, ఏమాత్రము లాభము లేదు. ఇప్పుడు తండ్రి లభించినందుకు అందరినీ వదిలేశారు. అత్యంత ఉన్నతమైన తండ్రి లభించారు, తండ్రి చెప్తున్నారు - చెడు వినకు, చెడు చూడకు..... కానీ మనుష్యులు పూర్తిగా పతితంగా, తమోప్రధాన బుద్ధి కలవారిగా ఉన్నారు. ఇక్కడ కూడా శ్రీమతమును అనుసరించని వారు చాలామంది ఉన్నారు. శక్తి లేదు. మాయ ఎదురు దెబ్బలు తినిపిస్తూ ఉంటుంది ఎందుకంటే రావణుడు శత్రువు, రాముడు మిత్రుడు. కొంతమంది రాముడని అంటారు, కొంతమంది శివుడని అంటారు. వారి అసలు పేరు శివబాబా, నేను పునర్జన్మలలోకి రాను. డ్రామాలో నా పేరు శివుడనే పెట్టబడింది. ఒక వస్తువుకు 10 పేర్లుంచినందుకు మనుష్యులు తికమకపడ్డారు, ఎవరికి ఏం తోస్తే ఆ పేరు పెట్టేశారు. నా అసలు పేరు శివుడు. నేను ఈ శరీరములో ప్రవేశిస్తాను. నేను కృష్ణుడు మొదలైనవారిలో రాను. విష్ణువు సూక్ష్మవతనంలో ఉంటారని వారు భావిస్తారు. వాస్తవానికి విష్ణువుది ప్రవృత్తి మార్గం యొక్క యుగల్ రూపము. వాస్తవానికి 4 భుజాలు ఎవ్వరికీ ఉండవు. 4 భుజాలంటే ప్రవృత్తి మార్గము, 2 భుజాలంటే నివృత్తి మార్గము. తండ్రి ప్రవృత్తి మార్గ ధర్మమును స్థాపన చేశారు. సన్యాసులు నివృత్తి మార్గములోని వారు. ప్రవృత్తి మార్గములోని వారే తిరిగి పావనము నుండి పతితంగా అవుతారు, అందుకే సృష్టికి ఆధారమివ్వడానికి పవిత్రంగా అయ్యే పాత్ర సన్యాసులది. వారు కూడా లక్షల, కోట్ల సంఖ్యలో ఉన్నారు. మేళా జరిగినప్పుడు చాలా మంది వస్తారు, వారు అన్నము వండుకోరు, వారిని గృహస్థులు పోషిస్తారు. కర్మ సన్యాసము చేశారు, మరి భోజనము ఎక్కడ నుండి వస్తుంది? కనుక గృహస్థుల వద్ద తింటారు. గృహస్థులు, ఆ సన్యాసులకు తినిపించడం కూడా దానమని భావిస్తారు. ఇతను కూడా పూజారిగా, పతితంగా ఉండేవారు, ఇప్పుడు శ్రీమతమును అనుసరించి పావనంగా అవుతున్నారు. తండ్రి నుండి వారసత్వము తీసుకునే పురుషార్థము చేస్తున్నారు, అప్పుడు తండ్రిని ఫాలో చేయండి అని అంటారు. మాయ ప్రతి విషయములో వెంటాడి ఓడిస్తుంది. దేహాభిమానముతోనే మనుష్యులు తప్పులు చేస్తారు. భలే పేదవారుగాని, ధనవంతులు కాని దేహాభిమానము తొలగిపోతే కదా. దేహాభిమానము తొలగిపోవడమే చాలా కష్టము. తండ్రి చెప్తున్నారు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించి దేహముతో పాత్రను అభినయించండి. మీరు దేహాభిమానములోకి ఎందుకు వస్తారు! డ్రామానుసారముగా దేహాభిమానములోకి కూడా రావల్సిందే. ఈ సమయంలో పక్కా దేహాభిమానీ గా అయి ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, మీరు ఆత్మలు. అన్ని పనులు చేసేది ఆత్మనే. ఆత్మ శరీరము నుండి వేరైపోతే, శరీరాన్ని కోసినా ఏమైనా శబ్దం వస్తుందా ? ఏ శబ్దమూ రాదు. నా శరీరానికి దుఃఖము ఇవ్వ వద్దని ఆత్మనే చెప్తుంది. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేయండి. దేహాభిమానాన్ని వదిలేయండి.
పిల్లలైన మీరు ఎంత దేహీ అభిమానులుగా అవుతారో, అంత ఆరోగ్యంగా, నిరోగిగా అవుతూ ఉంటారు. యోగబలము ద్వారానే మీరు 21 జన్మలు నిరోగులుగా అవుతారు, ఎంతగా అవుతారో అంత ఉన్నత పదవి కూడా లభిస్తుంది. శిక్షల నుండి రక్షింపబడతారు. లేకుంటే శిక్షలు చాలా తినాల్సి ఉంటుంది. కనుక ఎంత దేహీ అభిమానులుగా అవ్వాలి. చాలా మంది భాగ్యములో ఈ జ్ఞానము లేనే లేదు. ఎంతవరకు మీ కులములోకి రారో అనగా బ్రహ్మాముఖవంశావళిగా అవ్వరో, బ్రాహ్మణులుగా అవ్వరో, అంతవరకు దేవతలుగా ఎలా అవుతారు ? భలే చాలా మంది వస్తారు, బాబా, బాబా అని వ్రాస్తుంటారు, అంటుంటారు, కాని కేవలం పేరుకు మాత్రమే. ఒకటి-రెండు లెటర్లు వ్రాస్తారు. తర్వాత మాయమైపోతారు. వారు కూడా సత్యయుగములోకి వస్తారు. కాని ప్రజలలోకి వస్తారు. ప్రజలైతే చాలా మంది అవుతారు కదా. ముందు-ముందు చాలా దుఃఖము కలిగినప్పుడు, చాలా మంది పరుగెత్తుకొని వస్తారు. భగవంతుడు వచ్చారనే శబ్దము వ్యాపిస్తుంది. మీ సేవాకేంద్రాలు కూడా చాలా తెరవబడతాయి. పిల్లలైన మీలో లోపమేమిటంటే దేహీ అభిమానులుగా అవ్వరు. ఇప్పుడింకా దేహాభిమానము చాలా ఉంది. చివర్లో ఏ మాత్రము దేహాభిమానమున్నా పదవి కూడా తగ్గిపోతుంది. అక్కడకు వచ్చి దాస-దాసీలుగా అవుతారు, దాస-దాసీలలో కూడా నంబరు వారుగా అనేక మంది ఉంటారు. రాజులకు దాస-దాసీలు కట్నముగా లభిస్తారు. ధనవంతులకు లభించరు. రాధ ఎంతమంది దాసీలను కట్నంగా తీసుకెళ్తుందో పిల్లలు చూశారు. ముందు-ముందు మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. తేలికైన దాసీలుగా అవ్వడం కంటే షావుకారు ప్రజలుగా అవ్వడం మంచిది. దాసి అనే పదము మంచిది కాదు. దాని కంటే ప్రజలలో షావుకారుగా అవ్వడం మంచిది. తండ్రి వారిగా అయినందుకు మాయ చాలా బాగా గౌరవిస్తుంది. రుస్తుంతో (బలవంతునితో) రుస్తుంగా అయి యుద్ధము చేస్తుంది. దేహాభిమానము వచ్చేస్తుంది. శివబాబా నుండి కూడా ముఖము తిప్పేసుకుంటారు. తండ్రిని స్మృతి చేయడమే వదిలేస్తారు. అరే! తినడానికి తీరిక ఉంది కానీ, ఇటువంటి బాబా, ఎవరైతే విశ్వానికి యజమానులుగా చేస్తారో, వారిని స్మృతి చేసేందుకు తీరిక లేదా? మంచి-మంచి పిల్లలు శివబాబాను మర్చిపోయి, దేహాభిమానములోకి వచ్చేస్తారు. లేదంటే ఇటువంటి తండ్రి, ఎవరైతే ప్రాణదానము చేస్తున్నారో, వారిని స్మృతి చేసి ఉత్తరాలయితే వ్రాయాలి. కాని ఇక్కడ మాయ ఒక్కసారిగా ముక్కుతో పట్టుకొని ఎలా ఎగిరేస్తుందంటే చెప్పలేము. అడుగడుగునా శ్రీమతముననుసరిస్తే ఒక్కొక్క అడుగులో పదమాలున్నాయి. మీరు లెక్కించలేనంత ధనవంతులుగా అవుతారు. అక్కడ ధనమును లెక్కించరు. ధనము, సంపద, పొలము-వ్యవసాయము అన్నీ లభిస్తాయి. అక్కడ రాగి, ఇనుము, ఇత్తడి మొదలైనవి ఉండవు. బంగారు నాణెములే ఉంటాయి. ఇల్లులు కూడా బంగారంతోనే కడ్తారు. ఇక లేనిదేముంటుంది! ఇక్కడ ఇది భ్రష్టాచార రాజ్యము, యథా రాజా-రాణి తథా ప్రజ. సత్యయుగములో యథా రాజా-రాణి తథా ప్రజ అందరూ శ్రేష్ఠాచారులుగా ఉంటారు. కాని మనుష్యుల బుద్ధిలో ఈ విషయాలు కూర్చోవు. తమోప్రధానంగా ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు కూడా ఇలాగే ఉండేవారు. ఇతను కూడా అలాగే ఉండేవారు. ఇప్పుడు నేను వచ్చి దేవతలుగా చేస్తానని చెప్పినా, అలా అవ్వరు. పరస్పరము కొట్లాడుకుంటూ, గొడవపడుతూ ఉంటారు. నేను చాలా బాగున్నాను, ఇలా ఉన్నాను..... అని అంటారు. మనము నరకములో పడి ఉన్నామని, రౌరవ నరకములో పడి ఉన్నామని ఎవరికీ అర్థము కాదు. ఇది కూడా నంబరువారు పురుషార్థానుసారముగా పిల్లలైన మీకు తెలుసు. మనుష్యులు పూర్తి నరకములో పడి ఉన్నారు - రాత్రింబవళ్ళు చింతిస్తూనే ఉంటారు. జ్ఞాన మార్గములో ఎవరైతే తమ సమానంగా తయారుచేసే సేవ చేయలేరో, నీది, నాది అనే చింతలలోనే ఉంటారో, వారిని జబ్బు చేసినవారు, రోగులని అంటారు. తండ్రిని తప్ప ఇతరులెవ్వరిని స్మృతి చేసినా వ్యభిచారులుగా అయినట్లు కదా. తండ్రి చెప్తున్నారు, ఇతరులెవ్వరి మతమునూ వినకండి, కేవలం నా మతమును మాత్రమే వినండి. నన్ను స్మృతి చేయండి. దేవతలను స్మృతి చేసినా మేలు కలుగుతుంది, మనుష్యులను స్మృతి చేసినందున ఏ లాభమూ ఉండదు. ఇక్కడైతే తండ్రి చెప్తున్నారు, మీరు మీ తలనైనా ఎందుకు వంచుతారు! మీరు ఈ బాబా వద్దకు వచ్చినప్పుడు కూడా శివబాబాను స్మృతి చేసి రండి. శివబాబాను స్మృతి చేయకుంటే పాపము చేసినట్లవుతుంది. బాబా అంటారు - మొదట పవిత్రంగా అవుతామని ప్రతిజ్ఞ చేయండి. శివబాబాను స్మృతి చేయండి. చాలా పత్యం ఉంది. చాలా కష్టంగా ఎవరో కొంతమంది మాత్రమే అర్థము చేసుకుంటారు. అర్థము చేసుకునేంత బుద్ధి లేదు. తండ్రితో ఎలా నడుచుకోవాలో, ఇందులో చాలా కష్టపడాలి. మాలలోని మణిగా అవ్వడం - పిన్నమ్మ ఇల్లు కాదు (సులభము కాదు). ముఖ్యమైనది తండ్రిని స్మృతి చేయడం. మీరు తండ్రిని స్మృతి చేయలేరు. తండ్రి సేవ, తండ్రి స్మృతి ఎంతగా చేయాలి. బాబా ప్రతి రోజూ లెక్క తీయండని చెప్తారు. ఏ పిల్లలకైతే తమ కళ్యాణము చేసుకోవాలనే ఆలోచన ఉంటుందో, వారు అన్ని రకాలుగా పూర్తిగా పత్యం చేస్తారు. వారి ఆహార-పానీయాలు చాలా సాత్వికంగా ఉంటాయి.
బాబా పిల్లల కళ్యాణము కొరకు ఎంతగా అర్థం చేయిస్తూ ఉంటారు. అన్ని విధములైన పత్యము ఉండాలి. మా ఆహార-పానీయాలు అలా అయితే లేవు కదా? అని చెక్ చేసుకోవాలి. లోభిగా అయితే లేను కదా? ఎప్పటివరకైతే కర్మాతీత స్థితి తయారవ్వదో, అప్పటివరకు మాయ తప్పుడు పనులు చేయిస్తూ ఉంటుంది. ఆ స్థితికి ఇంకా సమయం పడుతుంది, తర్వాత తెలుస్తుంది - ఇప్పుడైతే వినాశనము ఎదురుగా ఉంది అని. అగ్ని బాగా వ్యాపించేసింది. బాంబులు ఎలా పడతాయో మీరు చూస్తారు. భారతదేశములో అయితే రక్తపు నదులు ప్రవహిస్తాయి. ఇతర చోట్ల బాంబులతో ఒకరినొకరు సమాప్తం చేసుకుంటారు. ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి. అన్నిటికంటే ఎక్కువ కష్టాలు భారతదేశములోనే ఉంటుంది. మీపై మీరు చాలా దృష్టి పెట్టుకోవాలి, నేను ఏమి సర్వీసు చేస్తున్నాను? ఎంతమందిని తమ సమానంగా నరుని నుండి నారాయణునిగా తయారుచేస్తున్నాను? కొంతమంది భక్తిలో చాలా చిక్కుకొని ఉంటే, ఈ చిన్న పిల్లలేం చదివిస్తారని వారు భావిస్తారు. వీరిని చదివించేవారు స్వయంగా తండ్రి (భగవంతుడు) అని వారికి అర్థము కాదు. కొంచెం చదువుకున్నా, ధనమున్నా కొట్లాడడం ప్రారంభిస్తారు. గౌరవమే పోగొట్టుకుంటారు. సద్గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత స్థానమును పొందలేరు. అక్కడకు వెళ్ళి చాలా చిన్న పదవి పొందుతారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. 'నీది-నాది' అనే చింతలను వదిలి తమ సమానంగా తయారుచేసే సేవ చేయాలి. ఒక్క తండ్రి నుండే వినాలి, వారినే స్మృతి చేయాలి, వ్యభిచారిగా అవ్వకూడదు.
2. మీ కళ్యాణము కొరకు ఆహార-పానీయాల విషయంలో చాలా పత్యముండాలి - ఏ వస్తువు పట్ల లోభముంచకూడదు. మాయ నాతో ఎటువంటి తప్పుడు పనులు చేయించడం లేదు కదా అని అటెన్షన్ ఉండాలి.