17.04.1969        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బ్రాహ్మణుల ముఖ్య సంస్కారం - సర్వస్వత్యాగి

 మీ అందరి సంఘటనను విశేషంగా ఎందుకు పిలిపించారు? సంఘటన కొరకు ముఖ్యంగా నాలుగు విషయాలు అవసరం - 1. పరస్పరం ఒకరిపై ఒకరికి స్నేహం 2. సమీప సంబంధం 3. సేవ యొక్క బాధ్యత మరియు 4. జ్ఞాన, యోగ ధారణ యొక్క ప్రత్యక్షత. ఈ నాలుగు విషయాలలో తయారయ్యారా? ఒకరికొకరు స్నేహిగా ఎలా అవ్వాలి? స్నేహి అవ్వటానికి సాధనం ఏమిటి? ఇక్కడ ఒకరికొకరు దూరం అయిపోతున్నారు. దానికి కారణం ఏమిటంటే ఒకరికొకరి సంస్కారాలు, సంకల్పాలు కలవడం లేదు. అందరి సంస్కారాలు, సంకల్పాలు ఒకటి ఎలా అవుతాయి? (ఎవరి సంస్కారాలు వారికి ఉంటాయి) సంగమయుగీ బ్రాహ్మణుల ముఖ్య సంస్కారం ఏమిటి? సాకార బ్రహ్మాబాబాలో ముఖ్య సంస్కారం ఏమి ఉండేది? బ్రహ్మ యొక్క సంస్కారాలే బ్రాహ్మణుల సంస్కారాలు. బ్రహ్మలో అయితే ఆ సంస్కారాన్ని సంపూర్ణ రూపంలో చూశారు. కానీ బ్రాహ్మణులలో యోగం మరియు శక్తిననుసరించి ఉంటుంది. బాబా ముఖ్య సంస్కారం - సర్వస్వత్యాగి. తమ యొక్క సర్వస్వాన్ని త్యాగం చేసేసారు. సర్వస్వత్యాగి అవ్వటం ద్వారానే సర్వగుణాలు వచ్చేస్తాయి. నిరహంకారానికి గుర్తుయే సర్వస్వత్యాగి. ఇతరుల అవగుణాలు చూడకపోవటం కూడా త్యాగమే. త్యాగం యొక్క అభ్యాసం ఉంటే దీనిని కూడా త్యాగం చేయగలరు. సర్వస్వత్యాగి అంటే దేహాభిమానాన్ని కూడా త్యాగం చేస్తారు. కనుక బ్రాహ్మణుల ముఖ్య సంస్కారం - సర్వస్వత్యాగం. ఈ త్యాగం ద్వారా ముఖ్యంగా ఏ గుణం వస్తుంది? సరళత మరియు సహనశీలత. ఎవరిలో సరళత, సహనశీలత ఉంటాయో వారు తప్పకుండా ఇతరులను ఆకర్షిస్తారు. మరియు పరస్పరం స్నేహి అవుతారు. సరళత లేకపోతే స్నేహిగా కూడా కాలేరు పరస్పరం స్నేహి అవ్వాలంటే పద్దతి - దేహసహితంగా సర్వస్వత్యాగి అవ్వాలి. ఈ సర్వస్వ త్యాగం ద్వారా సరళత, సహనశీలత స్వతహాగానే వస్తాయి. ఇదే సర్వస్వత్యాగికి గుర్తు. సరళత మరియు సహనశీలత గుణాలను సాకార బ్రహ్మాబాబాలో చూశారు కదా! ఎంత జ్ఞాన స్వరూపమో అంత సరళ స్వభావం ఉండేది. చిన్న పిల్లలతో చిన్న పిల్లల సంస్కారం, వృద్ధులతో వృద్ధుల సంస్కారం.

మీ అందరి నడవడిక ద్వారా బాబా మరియు దాదా యొక్క చిత్రం కనిపించాలి. ఈ విధమైన నడవడిక ఉండాలి. చెప్పటం ద్వారా కాదు, నడవడిక ద్వారా చిత్రం కనిపించాలి. ఇప్పుడు మీలో ఈ విధమైన నడవడిక ఉందా? మీ నడవడిక ద్వారా బాబా యొక్క చిత్రం కనిపిస్తుందా? కనిపిస్తుంది కానీ అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ స్థితిలో స్థితులై సేవ చేస్తారో అప్పుడు మాట ద్వారా, ముఖం ద్వారా వీరికి జ్ఞానం ఇచ్చేవారు చాలా ఉన్నతమైనవారు అని భావిస్తారు. నడవడిక ద్వారా బాప్ దాదా యొక్క చిత్రం అప్పుడప్పుడు కనిపిస్తుంది. మీరు కూడా ఒక కెమెరా. మీ కెమెరాలో బాప్ దాదా యొక్క చిత్రం ముద్రించబడి ఉంది. దానిని అప్పుడప్పుడు మాత్రమే చూపిస్తున్నారు. ఎందువలన? సదా ఆ చిత్రాన్ని నడవడిక ద్వారా ఎందుకు చూపించటం లేదు? (పురుషార్ధంలో ఉన్నాం) ఈ పురుషార్థం అనే మాట కూడా ఎంత వరకు నడుస్తుంది? ఎంత సమయం ఇప్పుడు పురుషార్ధం చేస్తారు? మేము పురుషార్థులం అని అంతిమం వరకు అలా చెప్తూనే ఉంటారా? ఎలా అయితే ఇప్పుడు చెప్తున్నారో అలా అంతిమం వరకు చెప్తారా? పురుషార్థం అనే మాట ఇప్పుడు మారిపోవాలి. పురుషార్థం అంతిమం వరకు ఉంటుంది కాని ఆ పురుషార్థం ఇప్పుడు చెప్తున్న విధంగా ఉండకూడదు. పురుషార్ధం అంటే ఒకసారి చేసిన పొరపాటు మరలా చేయకూడదు అని అర్థం. ఇలాంటి పురుషార్ధం చేస్తున్నారా? పురుషార్ధం యొక్క అర్థాన్ని ప్రత్యక్షంలోకి తీసుకురావాలి. పొరపాటుని మాటిమాటికి చేస్తే దానిని పురుషార్థం అని ఎలా అంటారు? పురుషార్ధం యొక్క లక్ష్యం ఏదైతే ఉందో అటువంటి పురుషార్ధిగా అయ్యే పురుషార్ధం చేయాలి. ఇలాంటి పురుషార్థం యొక్క మాట తొలగించాలి. పురుషార్ధి అవ్వడానికి కూడా పురుషార్ధం చేయాలి. ఇలా ఉండకూడదు. ఒకరికొకరు స్నేహిగా ఎలా కాగలరు? కేవలం ఉత్తరాలు వ్రాసుకోవటం, సంఘటనగా కలుసుకోవటం వీటి ద్వారా స్నేహి అవ్వరు. ఇది స్టూల విషయం కానీ ఎప్పుడైతే సంస్కారాలు మరియు సంకల్పాలు కలుపుకుంటారో అప్పుడే స్నేహి అవుతారు. దాని పద్దతి కూడా చెప్పాను. (సర్వస్వత్యాగి) సర్వస్వత్యాగికి గుర్తు ఏమిటి? (సరళత, సహనశీలత). ఈ విషయాలు ధారణ చేసినప్పుడే స్నేహి అవుతారు. సరళత రావడానికి కేవలం ఒక విషయం తప్పనిసరిగా వర్తమాన సమయంలో ధ్యాస ఉండాలి.

వర్తమాన సమయంలో స్థితి అనేది పొగడ్త ఆధారంగా ఉంటుంది. గౌరవం మరియు నింద... రెండు మాటలు కదా! వర్తమాన సమయంలో చూస్తే స్తుతి ఆధారముగా స్థితి ఉంటుంది. అంటే కర్మ చేస్తూ దాని ఫలం యొక్క కోరిక లేదా లోభం ఉంటుంది. కర్తవ్య ఫలం యొక్క కోరిక ఎక్కువ పెట్టుకుంటున్నారు. స్తుతి లభించకపోతే స్థితి కూడా ఉండటం లేదు. స్తుతి ఉంటే స్థితి కూడా ఉంటుంది. ఒకవేళ నింద వస్తే స్థితి కూడా సమాప్తి అయిపోతుంది. తమ స్థితిని వదిలేస్తున్నారు మరియు తమ యోగ్యతను వదిలేస్తున్నారు. మాకు గౌరవం కావాలని ఎప్పుడు ఆలోచించకూడదు. గౌరవం ఆధారంగా స్థితి ఉంచుకోకూడదు. గౌరవం ఆధారంగా స్థితి ఉంచుకుంటే అలజడి అవుతారు. అనన్య పిల్లల ప్రభావం రోజు రోజుకి స్వతహాగానే వస్తుంది. కానీ ప్రభావంలో స్వయమే ప్రభావితం కాకూడదు. ఇక్కడే ఫలం స్వీకరిస్తే భవిష్య ఫలాన్ని సమాప్తి చేసుకుంటారు. ఎంత గుప్త పురుషార్థి, ఎంత గుప్త సహాయకారి అవుతారో అంతగానే గుప్తపదవి పొందుతారు. ఇతరులు ఎంత మహిమ చేసినా కాని వారి మహిమ ప్రభావంలో స్వయం ప్రభావితం కాకూడదు. ఏ కార్యం అయినా చేయాలంటే సంగమంలో ఉండి నిర్ణయం చేయాలి. ఎందుకంటే మీరు సంగమయుగీలు కదా. అందువలన ఏ విషయమైనా రెండు రకాలుగా ఉంటుంది. రెండురకాల సంగమంలో ఉండి నిర్ణయించాలి. ఆ వైపు ఎక్కువ ఉండకూడదు, ఈ వైపు ఎక్కువ ఉండకూడదు. సంగమంలో ఉండాలి. సంగమయుగీ బ్రాహ్మణులైన మీ కర్తవ్యంలో సంగమంలో ఉండటం లేదు. ఆ వైపు లేక ఈ వైపు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటున్నారు, మరియు సర్వీస్లో కూడా సహాయకారి అవుతున్నారు. రెండు వైపుల సంభాళించుకోవడానికి మధ్యలో ఉండాలి. రెండింటి మధ్య స్థితిలో ఉండాలి. సంగమంలో ఉంటే రెండింటిని మంచిగా చేయగలరు. మీ తినటం, త్రాగటం, ధరించటం అన్నీ మధ్యస్థంగానే ఉండాలి కదా! అదేవిధంగా మధ్య స్థితిలో స్థితులై రెండు వైపుల నిర్ణయం చేసుకుని నడవాలి. కొన్ని విషయాలలో ఈవైపు లేక ఆవైపు విశేషంగా ఉంటున్నారు. కానీ మధ్యలో ఉండాలి. మధ్య స్థితి అనేది బీజం అనగా బిందువు. ఎలా అయితే బీజం సూక్ష్మంగా ఉంటుందో అలాగే మధ్యస్థితి కూడా సూక్ష్మంగా ఉంటుంది. దానిలో నిలబడే ధైర్యం మరియు పద్ధతి కావాలి. ఈ లక్ష్యం కూడా ఇచ్చారు. అక్కడక్కడ యజమాని అయ్యి నడవాలి, అక్కడక్కడ పిల్లలై నడవాలి. ఎక్కడ యజమానియై నడవాలో అక్కడ పిల్లలుగా కాకూడదు. ఎక్కడ బాలక్ అవ్వాలో అక్కడ యజమానిగా కాకూడదు. ఇక్కడ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఈ పరిశీలన బాగా ఉండాలి. బాలక్ (పిల్లవాని) స్థితి మరియు మాలిక్ (యజమాని) స్తితి రెండూ పూర్తిగా ఉండాలి. అందువలనే సంగమంలో ఉండాలి అని చెప్పాను. కేవలం పిల్లలుగా కూడా కాకూడదు, కేవలం యజమానిగా కూడా కాకూడదు. రెండు గుణాలు ఉండటం ద్వారా అన్నింటినీ మంచిగా నడిపించగలరు. బాలక్ స్థితి అంటే నిస్సంకల్ప స్థితి. ఏ ఆజ్ఞ, సలహా లభించినా దాని ప్రకారం నడవాలి. యజమాని స్థితి అంటే మీ సలహా ఇవ్వటం. ఏ స్థానంలో యజమాని అవ్వాలో ఆ స్థానం మరియు విషయం చూడాలి. అన్ని స్థానాలలో యజమానిగా కాకూడదు. ఎక్కడ పిల్లలు అవ్వాలో అక్కడ ఒకవేళ యజమాని అయితే సంస్కారాల గొడవ వస్తుంది. అందువలన పరస్పరం ఒకరికొకరు సహాయకారి అవ్వడానికి రెండు విషయాలూ ధారణ చేయాలి. లేకపోతే సంస్కారాల గొడవ జరుగుతుంది. ఎక్కడ పిల్లలు అవ్వాలో అక్కడ యజమాని అవుతున్నారు. ఇద్దరు యజమానులు అవ్వటం వలన సంస్కారాల గొడవ వస్తుంది. యజమానిగా అవ్వాలి, పిల్లలుగా కూడా అవ్వాలి. సలహా ఇచ్చి యజమాని అయ్యారు. అది నిర్ణయం అయ్యే సమయంలో పిల్లవానిగా అయిపోవాలి.. మరలా యజమాని అవ్వాలి. ఏ సమయంలో బాలక్, ఏ సమయంలో యజమాని అవ్వాలి అనేది కూడా బుద్ధి ద్వారా నిర్ణయించుకోవాలి. ఏ సమయంలో ఏ స్వరూపం ధారణ చేయాలో ఆలోచించాలి. బహురూపిగా అవ్వాలి కదా! సదా ఒకే రూపం కాదు. ఎలాంటి సమయము అలాంటి రూపం ఉండాలి. వ్యతిరేకరూపంలో బహురూపిగా కాకూడదు. సరైన రూపంతో అవ్వాలి. మంచిది.