25.06.1970
ఉదయం మురళి ఓం శాంతి
అవ్యక్త్-బాప్దాదా మధుబన్
వ్యక్తం మరియు అవ్యక్త వతనం యొక్క భాషలో తేడా.
వ్యక్తంలో ఉంటూ అవ్యక్తవతనం యొక్క భాష తెలుసుకోగలరా? అవ్యక్తవతనం యొక్క భాష ఎలా
ఉంటుంది? ఎప్పుడైనా అవ్యక్తవతనం యొక్క భాష విన్నారా? ఇప్పుడైతే అవ్యక్తుడు
వ్యక్తలోక నివాసుల కొరకు వ్యక్తాన్ని ఆధారంగా తీసుకుని వ్యక్తదేశ పద్ధతిలో
మాట్లాడుతున్నారు. అక్కడ అవ్యక్త వతనంలో ఒక సెకనులో చాలా రహస్యాలు
స్పష్టమవుతాయి. ఇక్కడ మీ ప్రపంచంలో చాలా మాట్లాడిన తర్వాత స్పష్టం అవుతాయి. ఇది
వ్యక్త భాష. అవ్యక్త బాప్ దాదా యొక్క సైగల ద్వారా ఈరోజు ఏమి చూస్తున్నారో అర్థం
చేసుకోగలరా? విజ్ఞానం ద్వారా ఎక్కడెక్కడి మాటలు, ఎక్కడెక్కడి దృశ్యాలను
గ్రహిస్తున్నారు. అలాగే మీరు అవ్యక్త స్థితి ఆధారంగా ఎదుటి విషయాలని
గ్రహించలేరా? బాప్ దాదా మూడు విషయాలు చూస్తున్నారు. అవి ఏమిటి? బాప్ దాదా ఈరోజు
ఇదే చూస్తున్నారు - ఎంత వరకు పరిశీలకులుగా (చెకర్) అయ్యారు మరియు దానితో పాటు
ఎంతవరకు నిర్మాణం చేసేవారిగా (మేకర్) అయ్యారని. ఎవరు ఎంత పరిశీలకులు అవుతారో
అంత తయారయ్యే వారిగా కాగలరు. ఈ సమయంలో మీరు నియమ రూపకర్తలు(లా మేకర్స్) మరియు
క్రొత్త ప్రపంచ నిర్మాతలు (మేకర్స్) కూడా మరియు శాంతిదూతలు కూడా. నిర్మాతలతో
పాటు పరిశీలకులుగా కూడా అవ్వాలి. విశేషంగా ఏమి పరిశీలించుకోవాలి? బాబా పేరు
పైకి వచ్చే సేవ ఇప్పుడు మిగిలి ఉంది. కౌరవ పరిశీలకులు ఏమి పరిశీలిస్తారు? కల్తీ
మరియు మోసం. ఆ సేవయే ఇప్పుడు మిగిలి ఉంది. కల్తీ చేసేవారి దగ్గరికి మరియు మోసం
చేసేవారి దగ్గరకి సర్వశక్తివంతుని ప్రభుత్వ పరిశీలకులుగా అయ్యి వెళ్ళాలి. కౌరవ
ప్రభుత్వం యొక్క పరిశీలకులు లేదా ఇన్స్ పెక్టర్లు ఎవరి దగ్గరికైనా
వెళ్ళినప్పుడు వారు తమ రహస్యం చెప్పరు. అలాగే పాండవ గవర్నమెంట్ యొక్క అధికారంతో
పరిశీలకులై వెళ్ళండి. వారు మిమ్మల్ని చూడటంతోనే తమ కల్తీ మరియు మోసం గురించి
భయపడతారు మరియు తలవంచుతారు. ఇప్పుడు ఇదే సేవ మిగిలి ఉంది. దీని ద్వారా పేరు
పైకి వస్తుంది. ఒకరైనా తలవంచితే అనేకుల తల స్వతహాగానే వంగుతుంది. పాండవ
గవర్నమెంట్ యొక్క అధికారి అయ్యి వెళ్ళాలి మరియు సవాలు చేయండి. ఇప్పుడు
అర్థమయిందా! స్వయంలో మరియు సేవలో కూడా పరిశీలకులు అవ్వాలి. ఎవరు ఎంత
పరిశీలకులుగా మరియు నిర్మాతలుగా అవుతారో వారే పరిపాలకులుగా అవుతారు. ఎంతవరకు
పరిశీలకులుగా అయ్యారు. ఎంత వరకు నిర్మాతలుగా అయ్యారు, ఎంత వరకు పరిపాలకులుగా
అయ్యారు అని చూస్తున్నారు. ఈ మూడు విషయాలను ఒకొక్కరిలో చూస్తున్నారు. ఎప్పుడైతే
ఈ మూడు స్థితులలో మీరు స్థితులవుతారో అప్పుడిక చిన్న చిన్న విషయాలలో సమయం
వ్యర్థంగా వెళ్ళదు. ఇతరుల కల్తీని, మోసాన్ని పరిశీలన చేసే మీ దగ్గర కల్తీ, మోసం
ఉంటుందా?
మేము
ఈ మూడు స్థితులలో ఎంత వరకు స్థితులవుతున్నాము అని చూసుకోవాలి. పరిపాలకులు
ఎవరికీ ఆధీనం కారు. కనుక మాయకి ఎలా ఆధీనం అవుతారు? అధికారాన్ని మర్చిపోవటం వలన
అధికారిగా భావించడం లేదు. అధికారిగా భావించని కారణంగా ఆధీనం అవుతున్నారు. ఎంత
మిమ్మల్ని మీరు అధికారిగా భావిస్తారో అంత ఉదారచిత్తగా తప్పక అవుతారు. ఎంత ఎవరు
ఉదారచిత్ అవుతారో అంత అనేకులకి ఉదాహరణ స్వరూపంగా అవుతారు. ఉదారచిత్ అవ్వడానికి
అధికారిగా అవ్వాలి. అధికారి అంటే అధికారం సదా ఙ్ఞాపకం ఉండాలి. అప్పుడు ఉదాహరణ
స్వరూపం అవుతారు. ఎలా అయితే బాప్ దాదా ఉదాహరణ రూపం అయ్యారో అలాగే మీరు కూడా
అనేకులకి ఉదాహరణ రూపం అవుతారు. ఉదారచిత్ గా ఉండేవారు ఉదాహరణ కూడా అవుతారు మరియు
అనేకులని సహజంగానే ఉద్దరిస్తారు. .
ఎప్పుడైనా ఎవరిలో అయినా మాయ ప్రవేశిస్తే మొదట ఏ రూపంలో వస్తుంది? (ప్రతి ఒక్కరు
తమ తమ ఆలోచనలు చెప్పారు). మొదట మాయ రకరకాల రూపాల ద్వారా సోమరితనాన్ని
తీసుకువస్తుంది. దేహాభిమానంలో కూడా మొదట సోమరితనం యొక్క రూపాన్ని ధారణ
చేస్తుంది. ఆ సమయంలో శ్రీమతం ద్వారా పరిశీలన చేసుకునే విషయంలో నిర్లక్ష్యము
చేస్తారు. ఆ తర్వాత దేహాభిమానం పెరిగిపోతుంది. మిగిలిన అన్ని విషయాలలో రకరకాల
రూపాలుగా మొదట సోమరితనం వస్తుంది. సోమరితనం, బద్దకం, ఉదాసీనత రూపంలో సంబంధం
నుండి దూరం చేస్తుంది. సాకార సంబంధం నుండి లేదా బుద్ధి యొక్క సంబంధం నుండి లేదా
సహయోగం తీసుకునే సంబంధం నుండి దూరం చేస్తుంది. ఈ నిర్లక్ష్యం తర్వాత మరలా ఏ
విరాఠ రూపాన్ని ధరిస్తుంది? ప్రత్యక్ష రూపంలో దేహ అహంకారంలోకి వచ్చేస్తారు.
మొదట 6వ వికారం నుంచి ప్రారంభం అవుతుంది. జ్ఞానీ ఆత్మలైన పిల్లలకి చివరి నెంబర్
అంటే సోమరితనం రూపంలో ప్రారంభం అవుతుంది. ఆ సోమరితనంలో ఎలాంటి సంకల్పాలు
వస్తాయి? వర్తమానంలో ఈ రూపం ద్వారానే మాయ ప్రవేశిస్తుంది. దీనిపై చాలా ధ్యాస
ఉంచాలి. ఈ 6వ వికారం రూపంలో మాయ రకరకాలుగా రావడానికి ప్రయత్నం చేస్తుంది.
సోమరితనానికి కూడా రకరకాల రూపాలు ఉన్నాయి. శారీరక, మానసిక రెండు రూపాలలో కూడా
మాయ వస్తుంది. ఇప్పుడు కాకపోతే మరోసారి చేద్దాం అని కొందరు ఆలోచిస్తారు. తొందర
ఏముంది అంటారు. ఇలా చాలా రాయల్ రూపంలో మాయ వస్తుంది. మరి కొందరు ఈ పురుషార్థ
జీవితంలో అవ్యక్తస్థితి 6-8 గంటలు ఎలా ఉంటుంది అని కూడా అనుకుంటారు. ఇలా
అంతిమంలో జరుగుతుంది అనుకుంటారు. ఇది కూడా సోమరితనం యొక్క రాయల్ సూక్ష్మ రూపం.
తర్వాత చేస్తాను, ఆలోచిస్తాను, చూస్తాను.... ఇవన్నీ సోమరితనం యొక్క సంకల్పాలు.
ఇప్పుడు ఈ విషయంలో పరిశీలకులు అవ్వండి - ఎవరినీ కూడా మాయ రాయల్ రూపంలో వెనుకకి
తీసుకువెళ్ళటం లేదు కదా? కుటుంబాన్ని పాలన చేసుకోవాలి, కానీ కుటుంబంలో ఉంటూ
వైరాగ్య వృత్తిలో ఉండాలి అనేది మర్చిపోతున్నారు. సగం విషయం జ్ఞాపకం ఉంటుంది,
మిగతా సగం విషయాన్ని వదిలేస్తున్నారు. చాలా సూక్ష్మ సంకల్పాల రూపంలో మొదట
సోమరితనం ప్రవేశిస్తుంది. ఆ తర్వాత మరలా పెద్ద రూపం తీసుకుంటుంది. ఆ సమయంలోనే
దానిని తొలగించేస్తే ఎక్కువ ఎదుర్కోవలసిన అవసరం ఉండదు. ఇప్పుడు ఇది
పరిశీలించుకోవాలి - తీవ్రపురుషార్ధిగా అయ్యే హైజంప్ చేయడంలో ఏ రూపంలో మాయ
సోమరిగా చేస్తుంది అని. మాయ యొక్క బయటిరూపాన్ని పరిశీలిస్తున్నారు, కానీ ఈ
రూపాన్ని పరిశీలించాలి. కొంతమంది
అనుకుంటున్నారు, నిర్ణయింపబడిన సీట్లు తక్కువ, బాగా పురుషార్ధం చేసే ఇతరులను
చూసి ఇంత ముందుకి మేము వెళ్ళలేం, ఇంతే చాలు అనుకుంటున్నారు. ఇది కూడా సోమరితనం
యొక్క రూపం. ఈ అన్ని విషయాలలో మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకోవాలి. అప్పుడే లా
మేకర్స్ (నియమ రూపకర్తలు) లేక శాంతిదూతలుగా అవుతారు. లేక కొత్త ప్రపంచ
నిర్మాతలుగా అవుతారు. మొదట స్వయమే కొత్తగా తయారు కాకపోతే కొత్త ప్రపంచ
నిర్మాతలుగా ఎలా అవుతారు? మొదట స్వయాన్ని తయారు చేసుకోవాలి కదా! పురుషార్థంలో
తీవ్రత తీసుకువచ్చే పద్దతి తెలుసు. అయినా మరలా దానిలో ఎందుకు ఉండటం లేదు.
ఎప్పటి వరకు అయితే మీకు మీరు ప్రతిజ్ఞ చేసుకోరో అప్పటివరకు పరిపక్వత రాదు.
ఎప్పటివరకు అయితే ఇక్కడ నిర్ణయం చేసుకోరో అప్పటి వరకు అక్కడ సీట్లు నిర్ణయం
కావు. కనుక పురుషార్ధంలో తీవ్రత ఎప్పుడు తీసుకువస్తారు? (ఇప్పటి నుండే)
మ్యూజియం లేదా ప్రదర్శినిలో స్లోగన్ చెప్తారు కదా - "ఇప్పుడు లేకున్నా
మరెప్పుడు లేదు". ఇది మీ కోసం కూడా స్మృతి ఉంచుకోండి. ఎప్పుడో చేస్తాము అని
ఆలోచించకండి. ఇప్పుడే తయారయ్యి చూపిస్తాము. ఎంత ప్రతిజ్ఞ చేస్తారో అంత పరిపక్వత
లేదా ధైర్యం వస్తాయి. మరియు సహయోగం కూడా లభిస్తుంది. మీరు పాతవారు అందువలన
మిమ్మల్ని ఎదురుగా పెట్టుకుని చెప్తున్నాను. ఎదురుగా ఏ వస్తువుని
పెట్టుకుంటారు? ఇష్టమైన వస్తువులను పెట్టుకుంటారు. స్నేహీలకు ఎప్పుడు సంకోచం
రాదు. ఒకొక్కరు అటువంటి స్నేహీ ఆత్మలు కదా!
అందరు
అనుకుంటున్నారు - బాబా పెద్ద ధ్వనితో (గట్టిగా) ఎందుకు మాట్లాడరు? - ఎందుకంటే
అవ్యక్తరూపం యొక్క చాలా కాల సంస్కారంతో వ్యక్తంలోకి వస్తున్నారు. అందువలన
గట్టిగా మాట్లాడటం ఇష్టం అనిపించదు. మీరు కూడా నెమ్మది నెమ్మదిగా, మాటలకి
అతీతంగా సైగల ద్వారా కార్యవ్యవహారాలను నడిపించాలి. ఈ అభ్యాసం చేయాలి అర్థమైందా!
బాప్ దాదా బుద్ధి యొక్క వ్యాయామం చేయించడానికి వస్తున్నారు. దీని ద్వారా
పరిశీలన మరియు దూరదేశీ అయ్యే లక్షణాలు ప్రత్యక్ష రూపంలో రావాలి. ఎందుకంటే
మున్ముందు ఇలాంటి సేవ జరుగుతుంది - దానిలో దూరదేశీ బుద్ధి మరియు నిర్ణయశక్తి
చాలా కావాలి. అందువలన ఈ వ్యాయామం చేయిస్తున్నారు. దీని ద్వారా శక్తిశాలిగా
అయిపోతారు. వ్యాయామం ద్వారా శరీరం కూడా బలంగా అవుతుంది. అదేవిధంగా బుద్ధి యొక్క
వ్యాయామం ద్వారా బుద్ది శక్తిశాలిగా అవుతుంది. ఎంతెంత మీ సీట్లు నిర్ణయం
చేసుకుంటారో సమయం కూడా నిర్ణయం అవుతుంది. అప్పుడు మీ కుటుంబ కార్యం కూడా
నిర్ణయం చేసుకోగలరు. రెండు లాభాలు ఉంటాయి. బుద్ది ఎంత నిశ్చలంగా ఉంటుందో
కార్యక్రమాలన్నీ కూడా నిర్ణయమై ఉంటాయి. కార్యక్రమం నిర్ణయం అయితే ఉన్నతి కూడా
నిర్ణయం అవుతుంది. ఉన్నతి చలిస్తే ప్రోగ్రామ్ కూడా చలిస్తుంది. ఇప్పుడు
నిర్ణయించటం నేర్చుకోండి. ఇప్పుడు సంపూర్ణం అయ్యి ఇతరులని సంపూర్ణం చేయటం
మిగిలి ఉంది. ఎవరు తయారవుతారో వారు ఉదాహరణ అవుతారు. ఇతరులను తయారుచేసే ఉదాహరణగా
అవ్వాలి. ఈ కార్యం కొరకే వ్యక్తదేశంలో ఉండాలి. మంచిది.