01.11.1970        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బాబా సమానంగా అయ్యేటందుకు యుక్తులు.

ఈరోజు ధైర్యవంతులైన పిల్లలకి బాబా యొక్క సహాయం లభిస్తుంది అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ చూస్తున్నారు. ఏదైతే మహిమ ఉందో దానిని సాకార రూపంలో చూస్తున్నారు. పిల్లలు ఒక అడుగు ముందుకి వేసి వచ్చారు. దానికి ఫలితంగా ఎన్ని వేలరెట్లు దూరం నుండి బాబా మీ ఎదురుగా వచ్చారు. మీరు ఎన్ని మైళ్ళ దూరం నుండి వచ్చారు? బాప్ దాదా ఎంత దూరం నుండి వచ్చారు? ఎక్కువ స్నేహం ఎవరికి? పిల్లలకా లేక బాబాకా? దీనిలో కూడా బాబా పిల్లలని ముందు పెడుతున్నారు. ఈ పాత ప్రపంచంలో ఇప్పుడు కూడా బాబా కంటే ఎక్కువ ఆకర్షించే వస్తువు ఏదైనా ఉందా? ఇది పాత ప్రపంచం. సర్వ సంబంధాలు, ధనం, సర్వ పదార్థాలు అల్పకాలికమైనవి, మరియు పైపైకి కనిపించేవి మాత్రమే అని తెలిసినప్పటికీ, ఎందుకు మోసపోతున్నారు? లిప్తంగా (ఆకర్షితం) ఎందుకు అవుతున్నారు? మీ గుప్త స్వరూపాన్ని మరియు బాబా యొక్క గుప్త స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. అప్పుడే బాబా యొక్క గుప్త కర్తవ్యాన్ని ప్రత్యక్షం చేయగలరు. మీ శక్తి స్వరూపం ప్రఖ్యాతి అవుతుంది. ఇప్పుడు గుప్తంగా ఉంది. కేవలం ఒక మాటను స్మృతి ఉంచుకుంటే మీ గుప్త రూపాన్ని ప్రత్యక్షంలోకి తీసుకురాగలరు. ఆ మాట ఏమిటి? అంతరం అనే మాట. అంతరం అనే మాటలో రెండు రహస్యాలు వస్తాయి. అంతరం అంటే తేడా అని అంటారు మరియు అంతర్ అంటే లోపల అని కూడా అంటారు. అంతర్ముఖి, అంతర్యామి అంటారు కదా! అంతర్ (తేడా) అనే మాటకి రెండు అర్థాలు వస్తాయి. అంతరం అనే మాట స్మృతి ఉంటే 1. ప్రతి విషయం శ్రేష్టమా, కాదా అనే బేధం చూస్తారు. 2. అంతరిక స్థితిలో ఉండటం ద్వారా లేక అంతర్ స్వరూపంలో స్థితులవ్వటం ద్వారా మీ గుప్త స్వరూపం ప్రత్యక్షం అవుతుంది. ఒక మాటని స్మృతి ఉంచుకోవటం ద్వారా జీవితాన్ని మార్చుకోగలరు. ఇప్పుడు ఎలా అయితే సమయం వేగంగా వెళ్తుందో అలాగే ఇప్పుడు పాదం భూమిపై ఉండకూడదు. ఏ పాదం? బుద్ధి అనే పాదం. బుద్ధి ద్వారానే స్మృతియాత్ర చేస్తున్నారు కదా! ఫరిస్తాల పాదం భూమిపై ఆనదు అంటారు కదా! అంటే బుద్ధి అనే పాదం, భూమి అంటే ప్రకృతి యొక్క ఆకర్షణకి అతీతం అయిపోతే ఇక ఏదీ మిమ్మల్ని క్రిందకి తీసుకురాలేదు. ప్రకృతిని ఆధీనం చేసుకునేవారిగా అయిపోతారు, కానీ ప్రకృతికి అధీనం అవ్వరు. సైన్స్ వారు భూమి యొక్క ఆకర్షణకి అతీతంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు కదా! అదేవిధంగా శాంతిశక్తి ద్వారా ఈ ప్రకృతి యొక్క ఆకర్షణకి అతీతంగా, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆధారం తీసుకోవాలే కాని, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆధీనం కాకూడదు. ఇటువంటి స్థితి ఎంత వరకు తయారయ్యింది? ఇప్పుడు బాప్ దాదా వెంట తీసుకువెళ్ళడానికి సూక్ష్మవతనంలో తన కర్తవ్యం చేస్తున్నారు, కానీ అది కూడా ఎప్పటి వరకు? వెళ్ళవలసింది మీ ఇంటికే కదా! అందువలన ఇప్పుడు త్వరత్వరగా మిమ్మల్ని మీరు ఉన్నత స్థితిలో స్థితులు చేసుకునే ప్రయత్నం చేయండి. వెంట వెళ్ళాలి, వెంట ఉండాలి మరియు వెంట రాజ్యం చేయాలి కదా! ఎప్పుడు వెంట ఉండగలరు? సమానంగా అవ్వటం ద్వారా వెంట ఉండగలరు. సమానంగా కాకపోతే వెంట ఎలా ఉంటారు? ఇప్పుడు వెంట ఎగరాలి, వెంట ఉండాలి. ఇది స్మృతిలో ఉంచుకుంటే త్వరగా మిమ్మల్ని మీరు సమానంగా చేసుకోగలరు. లేకపోతే కొంచెం దూరంగా ఉండిపోతారు. ప్రతిజ్ఞ ఉంది కదా - వెంట ఉంటాము, వెంట వెళ్తాము మరియు వెంటే రాజ్యం చేస్తాం. కేవలం రాజ్యం చేసే సమయంలో బాబా గుప్తం అయిపోతారు. సమానంగా అవ్వటం ద్వారా వెంట ఉంటారు. ఈ సమానత ఎలా తీసుకువస్తారు? సాకార బాబా సమానంగా అవ్వటం ద్వారా సమానతను తీసుకురాగలరు. ఇప్పుడు బాప్ దాదా అని అంటున్నారు కదా! వారివురిలో సమానత ఎలా వచ్చింది? సమర్పణ ద్వారా సెకనులో సమానత వచ్చింది. ఇలా సమర్పణ చేసే శక్తి ఉండాలి. సమర్పణ చేసేసినప్పుడు స్వయం యొక్క లేదా ఇతరుల యొక్క అధికారం సమాప్తి అయిపోతుంది. ఎవరికైనా, ఏదైనా వస్తువు ఇచ్చేస్తే ఇక మీ అధికారం లేదా ఇతరుల అధికారం సమాప్తి అయిపోతుంది కదా! ఒకవేళ ఇతరులు అధికారం చూపిస్తే ఇది నేను సమర్పణ చేసాను అంటారు కదా! ఇలా ప్రతి వస్తువు సర్వ సమర్పణ చేసిన తర్వాత మీ యొక్క లేదా ఇతరుల అధికారం ఎలా ఉంటుంది? ఎప్పటి వరకు మీ యొక్క లేదా ఇతరుల అధికారం ఉంటుందో అప్పుడు సర్వ సమర్పణలో లోపం ఉందని తెలుస్తుంది. అందువలనే సమానత రావటం లేదు. ఎవరైతే ఆలోచించి, ఆలోచించి సమర్పణ అవుతారో దాని ఫలితంగా ఇప్పుడు కూడా పురుషార్థంలో అదే ఆలోచన అంటే వ్యర్ధ సంకల్పం విఘ్న రూపంగా అవుతుంది. అర్ధమైందా! మంచిది.