22.01.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


హృదయ సింహాసనాధికారి ఆత్మ యొక్క గుర్తులు.

ఈనాటి ఈ సంఘటనను ఏ సంఘటన అని అంటారు? ఈ సంఘటనకు ఏ పేరు పెట్టాలి? ఈ సంఘటన బ్రహ్మాబాబా యొక్క భుజాలు. అందువలన ఈ సంఘటనను బాప్ దాదా యొక్క సహాయకారి, నమ్మకధారి, బాప్ దాదా యొక్క హృదయ సింహాసనాధికారి, మాస్టర్ సర్వశక్తివంతులు అని అంటారు. ఇప్పుడు అర్ధమైందా? ఈ అనేక టైటిల్స్ అన్నీ నెంబర్‌వారీ పురుషార్ధం అనుసారంగా లభిస్తాయి. ఎవరైతే హృదయ సింహాసనాధికారిగా ఉంటారో, వారి గుర్తు ఏమిటి? టీచర్లు ఉన్నారు కనుక ప్రశ్నోత్తరాలు అడుగుతున్నారు. సింహాసనాధికారుల గుర్తు ఏమిటి? సింహాసనాధికారుల గుర్తు ఏమిటంటే ఎప్పుడైనా ఎవరైనా సింహాసనంపై కూర్చున్నప్పుడు వారికి తిలకం మరియు కిరీటం రెండూ ఉంటాయి. ఈ రెండు సింహాసనాధికారులకు గుర్తు. అదేవిధంగా హృదయ సింహాసనంపై విరాజమానమై ఉన్న ఆత్మ యొక్క గుర్తు కూడా ఇదే. వారి యొక్క మస్తకంలో సదా అవినాశి ఆత్మిక స్థితి అనే తిలకం దూరం నుండే మెరుస్తూ కనిపిస్తుంది. సర్వాత్మల కళ్యాణం యొక్క శుభ భావన వారి నయనాల్లో మరియు వారి ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖం ద్వారా ఇవన్నీ స్పష్టంగా కనిపించడమే వారికి గుర్తు. 3. వారి సంకల్పము, మాట మరియు కర్మ బాబా సమానంగా ఉంటాయి. 4. వారు ఏ ఆత్మలకైతే సేవ చేస్తారో ఆ ఆత్మల్లో స్నేహం, సహయోగం మరియు శక్తి మూడు గుణాలను ధారణ చేయించే శక్తి వారిలో ఉంటుంది. ఈ నాలుగు విషయాలు వారికి గుర్తు. ఇప్పుడు మీరు మీ ఫలితాన్ని పరిశీలించుకోండి - ఈ నాలుగు గుర్తులు నాలో ఎంతవరకు కనిపిస్తున్నాయి? ఎవరు ఏవిధంగా ఉంటారో, ఆవిధంగానే ఇతరులను తమ సమానంగా తయారుచేస్తారు. ఈరోజు సంఘటనలో టీచర్స్ ఉన్నారు. అందువలనే చెబుతున్నాను. ఎవరికైతే మీరు సేవ చేశారో లేదా చేస్తున్నారో, వారిలో ఈ విషయాలన్నీ నింపాలి. ఇప్పటి వరకు ఫలితం ఏమిటి? ప్రతి ఒక్కరు తమ ఫలితాన్ని తాము చూసుకుంటున్నారు. ఎక్కువ మందిలో ఏమి ఫలితం కనిపిస్తుంది? కొందరిలో స్నేహం యొక్క విశేషత ఉంది, కొందరిలో సహయోగం యొక్క కానీ శక్తి రూపం యొక్క ధారణ తక్కువగా ఉంది. దీనికి ఏమి గుర్తు కనిపిస్తుందో తెలుసా? శక్తి తక్కువగా ఉన్నదానికి గుర్తు ఏమిటి? పరిశీలనా శక్తి తక్కువగా ఉన్నదానికి గుర్తు ఏది? ఒక విషయం చెప్పాను - సేవలో సఫలత రాదు. వారికి స్పష్టమైన గుర్తు రెండు మాటల్లో చెప్పాలంటే - వారికి ప్రతి విషయంలో ఎందుకు, ఏమిటి, ఎలా.. ఇలా చాలా ప్రశ్నార్ధకాలు ఉంటాయి. డ్రామా అని బిందువు పెట్టడం వారికి చాలా కష్టమనిపిస్తుంది. అందువలన ఎందుకు, ఏమిటి, ఎలా అనే అలజడిలో వారుంటారు. రెండవ విషయం - వారు ఎప్పుడూ సమీప ఆత్మగా తయారుచేయలేరు. ఆత్మలను బాబా సంబంధంలోకి తీసుకురాగలరు, కానీ సమీప సంబంధంలోకి తీసుకురాలేరు. అర్థమైందా? బ్రాహ్మణకులం యొక్క మర్యాదలు ఏవైతే ఉన్నాయో ఆ మర్యాదలన్నింటి స్వరూపంగా ఇతరులను తయారుచేయలేరు. ఎందుకంటే స్వయంలోనే శక్తి తక్కువగా ఉన్న కారణంగా ఇతరులలో కూడా అంత శక్తిని అనగా సర్వ మర్యాదలను పాలన చేసే శక్తిని వారు తీసుకురాలేరు. ఏదొక మర్యాద రేఖను వారు ఉల్లంఘన చేస్తూ ఉంటారు. అన్ని అర్ధం చేసుకుంటారు, అర్ధం చేసుకోడంలో లోపం ఉండదు. మర్యాదలు గురించి పూర్తిగా తెలుసు. కానీ ఆ మర్యాదల్లో నడిచే శక్తి తక్కువగా ఉంటుంది. అందువలన ఎవరికైతే వారు సేవ చేస్తారో వారిలో కూడా శక్తి తక్కువగా ఉంటుంది. కనుక హైజంప్ చేయలేరు. సంస్కారాలను తొలగించుకోవడంలో చాలా సమయం వ్యర్ధం చేస్తారు. ఇప్పుడు ఈ విషయాల ఆధారంగా మీ స్వరూపాన్ని పరిశీలించుకోండి. ఒక వృక్షం యొక్క అన్ని విషయాలపై ధ్యాస పెట్టినప్పుడే దాని ద్వారా పెద్ద ఫలం లేదా మధుర ఫలం లభిస్తుంది. భూమిని పెల్లగించటం, విత్తనం వేయడం, నీరు పెట్టడం అన్నింటిపై ధ్యాస పెట్టాలి. అదేవిధంగా ఆత్మలను శ్రేష్ట ఫలంగా తయారు చేసేటందుకు సంస్కారాలను తొలగించే శక్తి కావాలి, ఇదే భూమిని పెల్లగించడం. దాంతో పాటు మధ్యమధ్యలో కొన్నింటిని వేయాల్సి ఉంటుంది. అనగా వారిని స్నేహిగా తయారుచేయాలి, సహయోగిగా తయారుచేయాలి మరియు శక్తి స్వరూపంగా కూడా తయారుచేయాలి. ఒకవేళ ఈ అన్నింటిలో ఒక్కటైనా లోపంగా ఉంటే ఏమి జరుగుతుంది? మొదట్లో చెప్పినట్టుగా హృదయ సింహాసనాధికారిగా అవ్వలేరు. అందువలన టీచర్స్ ఒక్కొక్కరి గురించి ఇంత ధ్యాస పెట్టాలి.

మీరు లక్ష్యం గురించి చెప్పేటప్పుడు ఏమి చెబుతారు? దేవతగా తయారవ్వాలి... ఇదే లక్ష్యం అని చెబుతారు కదా? మరి దేవతల మహిమ ఏమిటి? సర్వ గుణ సంపన్నులు. కనుక ఈ లక్ష్యం పెట్టుకోవాలి కదా! ఒక్కొక్క ఆత్మలో సర్వ గుణాలను నింపే ప్రయత్నం చేయాలి. టీచర్స్ అయిన మీరు ప్రతి ఒక్కరి గురించి ఎంతగా శ్రమించాలంటే ఏ ఆత్మ కూడా నా నిమిత్త టీచర్ ఈ విషయంపై మాకు ధ్యాస ఇప్పించలేదు అని ఫిర్యాదు చేయకూడదు. చేయడం లేదా చేయక పోవడం అనేది వారి అదృష్టం. కానీ మీరు మాత్రం అందరి గురించి శ్రమించాలి. ఇప్పటి వరకు ఫలితం చూస్తే కొన్ని ఫిర్యాదులు ఇప్పటికి అందుతున్నాయి. ఇది సేవ యొక్క లోపం. అందువలనే చెప్పాను - అన్ని విషయాలను వారిలో నింపడం ద్వారా వారు యోగ్య ఫలంగా తయారవుతారు. ఎవరైనా గొప్ప వ్యక్తి ముందు ఎలాంటి ఫలాన్ని పెడతారు? పెద్దగా ఉండాలి. మరియు బాగుండాలి. సాకారంగా కూడా ఏదైనా వస్తువు తెచ్చేటప్పుడు ఏమి చూసేవారు? అదేవిధంగా ఇప్పుడు బాప్ దాదా ముందు కూడా ఇలాంటి ఫలాన్ని తయారుచేసినప్పుడే ఎదురుగా పెట్టగలరు. అందువలన ఈ ధ్యాస పెట్టుకోండి. ఎవరు ఎంతగా గుణ సంపన్నం అవుతారో అంతగానే ఇతరులలో కూడా వాటిని నింపగలరు. ప్రతి రచయిత యొక్క ముఖం రచనలో కనిపిస్తుంది. సేవ అనేది మీకు ఒక దర్పణం, ఈ దర్పణం ద్వారా మీ ఆంతరంగిక స్థితిని చూసుకోవచ్చు. అది ముఖం చూసుకునే అద్దం, ఇది నడవడికను చూసుకునే అద్దం. ప్రతీ ఒక్కరికీ స్వయం యొక్క సాక్షాత్కారం స్పష్టంగా అవుతుందా? అవ్వాలి. ఒకవేళ ఇప్పటి వరకు స్పష్టంగా సాక్షాత్కారం కానట్లయితే స్వయాన్ని సంపూర్ణంగా ఎలా తయారు చేసుకోగలరు? మీ బలహీనతలు మీకు తెలిసినప్పుడే మీరు శక్తిని నింపుగోలరు. అందువలన స్వయం యొక్క సాక్షాత్కారంలో స్పష్టీకరణ లేనట్లయితే నిమిత్తంగా ఉన్న అక్కయ్యల సహాయం తీసుకోండి, మీ స్పష్ట సాక్షాత్కారం చేసుకునే ప్రయత్నం తప్పక చేయండి. ఇది బాప్ దాదా యొక్క పని కాదు. బాప్ దాదా యొక్క పని - సూచన ఇవ్వటం.

టీచర్స్ యొక్క ఫీచర్స్ ఏవిధంగా ఉండాలి? టీచర్స్ తమ ఫరిస్తా స్థితి యొక్క ముఖ కవళికల ద్వారా సేవ చేయాలి. ఇది మా స్వభావం అనే మాట ఇప్పటి వరకు టీచర్లు నుండి వినిపించకూడదు. ఇలా అనడం శక్తిహీనతకు గుర్తు. పురుషార్ధం అనే మాట సరైన అర్ధంతో ఉపయోగించడం లేదు. పురుషార్ధం అనే మాటను పురుషార్ధం నుండి తప్పించుకునేటందుకు సాధనంగా చేసుకుంటున్నారు. అందువలన మీ మాటలే మీ రచన ద్వారా మీ ఎదురుగా వస్తున్నాయి. అందువలన అర్థం చేసుకోండి. నూతిలో అరిస్తే అది తిరిగి మీ దగ్గరకే చేరుతుంది. అంత ధ్యాస మీ యొక్క సంకల్పాలపై పెట్టుకోవాలి. అక్కడక్కడి నుండి ఈ సమాచారం వస్తుంది. ఏ సమాచారం? ఈరోజుల్లో విద్యార్థులు వినడం లేదు. శ్రమిస్తున్నారు కాని ముందుకు వెళ్లడం లేదు. ఎక్కడి వారు అక్కడే నిలుచుని ఉంటున్నారు. ఈ ఫలితం ఎందుకు వస్తుంది. ఇది కూడా మీ స్థితికి ఫలితం. ఎందుకంటే విద్యార్థులు కూడా నడుస్తూ.. నడుస్తూ.. నిమిత్తమైన టీచర్ల యొక్క బలహీనతలను పరిశీలించి వాటిని ఆసరాగా తీసుకుంటున్నారు. మంచిది.