26.01.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


బాధ్యత తీసుకోవడం ద్వారా లాభాలు.

పిల్లలైన మీరు విశ్వాన్ని పరివర్తన చేసే విశ్వ ఆధారమూర్తులు మరియు విశ్వాన్ని ఉద్దరించేవారు కూడా. దాంతో పాటు విశ్వం ముందు ఉదాహరణగా తయారయ్యేవారు కూడా. ఎవరైతే ఆధారమూర్తులుంటారో వారిపైనే బాధ్యత అంతా ఉంటుంది. ఇప్పుడు మీరు వేసే ప్రతి ఒక్క అడుగు మీ వెనుక ఉన్న అనేకులు అడుగులు వేయడానికి బాధ్యత కలిగి ఉన్నారు. మొదట్లో సాకార రూపంలో తండ్రి అనుసరించడానికి ఎదురుగా ఉన్నారు, ఇప్పుడు మీరు నిమిత్తమూర్తులు. ఏ రూపంతో ఏవిధంగా ఎక్కడ అడుగులు వేస్తామో ఆవిధంగా మన వెనుక సర్వాత్మలు అనుసరిస్తారని భావించండి. ఇది బాధ్యత. సర్వుల ఉద్ధారమూర్తిగా అవ్వడం వలన సర్వాత్మల నుండి ఆశీర్వాదాలు లభిస్తాయి. వాటి వలన తేలికదనం వస్తుంది, అంతేకాదు సహాయం కూడా లభిస్తుంది అందువలన బాధ్యత తేలికగా అనిపిస్తుంది. కార్యం పెద్దది అయినా కానీ ఎవరో మాతో చేయిస్తున్నారు అని అనుభవం అవుతుంది. ఈ బాధ్యత మీ అలసటను పోగొట్టేది. తీరికగా ఉండడం మనసుకు ఇష్టం అనిపించదు. బాధ్యత అనేది స్థితిని తయారుచేయడంలో చాలా సహాయం చేస్తుంది. బాప్ దాదా మహారథీ పిల్లలను చూసినప్పుడు వారందరి యొక్క వర్తమాన స్వరూపం మరియు ఈ జన్మ యొక్క అంతిమ స్వరూపం మరియు తదుపరి జన్మ యొక్క భవిష్య స్వరూపం మూడూ ఎదురుగా వస్తాయి. మేము ఈవిధంగా కానున్నాము, మేము కిరీటధారులం, సింహాసనాధికారులుగా అవుతాము అని మీకు స్పష్టంగా అనుభూతి అవుతుందా? మున్ముందు ఇలా కూడా అనుభవం చేసుకుంటారు. ఎలాగైతే సాకార బాబా ప్రత్యక్షంగా అనుభవం చేసుకున్నారో అలా. బాబాకి కర్మాతీత స్థితి స్పష్టంగా ఉండేది మరియు భవిష్య స్వరూప స్మృతి కూడా స్పష్టంగా ఉండేది. భవిష్య సంస్కారాలు స్వరూపంలో ప్రత్యక్షంగా కనిపించేవి. అదేవిధంగా మీ అందరికీ కూడా ఈ శరీరాన్ని వదిలి ఆ శరీరాన్ని ధరించనున్నాము అని అనుభవం అవుతుంది. బుద్ధి బలం ద్వారా ఇంత స్పష్టంగా అనుభవం అవుతుంది. ఇప్పుడు రోజు రోజుకు మీ సేవ ద్వారా, మీ సహయోగి స్థితి ద్వారా, మరియు మీ యొక్క సంస్కారాలను తొలగించుకునే శక్తి ద్వారా, మీ యొక్క అంతిమ స్వరూపం మరియు భవిష్యత్తును తెలుసుకోగలరు. ఆదిలో చెప్పేవారు మున్ముందు దగ్గరవారు మరియు దూరం వారు కూడా స్పష్టంగా కనిపించే సమయం వస్తుందని. కానీ ఇప్పుడు ఆ సమయం నడుస్తూ ఉంది. దైవీ పరివారంలోని ఆత్మలు అర్ధం చేసుకోగలరు ఎవరెవరు సమీప రత్నాలో, ఎవరు ఎంత సమీపంలోకి రావాలో అంతగా పరిస్థితుల అనుసారంగా కూడా సమీపంగా వచ్చేస్తారు. ఎవరైనా దూరమవ్వాల్సి ఉంటే పరిస్థితులు కూడా మధ్యలో నిమిత్తమవుతాయి. వారు రావాలనుకున్నా కానీ రాలేరు. ఇవన్నీ భవిష్య సాక్షాత్కారం. ఇప్పుడు ప్రత్యక్ష సేవ జరుగుతూ ఉంది. మీ భవిష్యత్తుని తెలుసుకోవడం ఇప్పుడు కష్టమేమి కాదు.

ప్రతి ఒక్కరు స్వయం కోసం వ్యక్తిగతంగా కూడా ఏదోక విశేష కార్యక్రమం పెట్టుకోవాలి. ఎలా అయితే సేవ మొదలైన, ఇతర కార్యక్రమాల కోసం ప్లాన్ తయారుచేసుకుంటారో అలాగే ఉదయం నుండి మొదలుకుని రాత్రి వరకు మధ్యమధ్యలో ఎంత సమయం మరియు ఏ విధంగా స్మృతియాత్రపై ధ్యాసపెట్టాలో దానికొరకు కార్యక్రమం తయారుచేసుకోండి. ఈ డైరీ పెట్టుకోండి. అమృతవేళలోనే స్మృతి కోసం ప్లాన్ తయారుచేసుకోవాలి. మీరు స్థూల కార్యం మొదలైన వాటిలో బిజీగా ఉన్నా, కానీ దాంట్లో కూడా కొద్ది సమయం కొరకు బాబా సృతిలో ఉండే నియమంలో బందించబడి ఉండాలి. ఆ సమయంలో ఇతరులకు కూడా రెండు మూడు నిమిషాల కోసం స్మృతిని ఇప్పించండి. ఇప్పుడు మేము ఈ కార్యంలో ఉన్నాము. మీరు కూడా స్మృతిలో ఉండండి అని వారికి చెప్పండి. ముఖ్యమైన సమయాల్లో ట్రాఫికుని ఆపేస్తారు కదా! ఎవరికి ఎంత అత్యవసర పని ఉన్నా కానీ లేదా రోగిని ఆస్పత్రికి తీసుకు వెళ్ళవలసి ఉన్నా కానీ, ఆపేస్తారు కదా! అదేవిధంగా ఎంత వరకు చేయగలరో అంతవరకు మీ టైం టేబుల్ తయారుచేసుకోండి. అప్పుడు వీరు ఈ సమయంలో స్మృతి చేసుకుంటారని ఇతరులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు. ఏ పని ఉన్నా కానీ ఆ పని ముందు వెనుక కూడా రెండు లేదా నాలుగు నిమిషాలు బాబాను స్మృతి తప్పక చేయండి. దాని ద్వారా వాయుమండలంలో కూడా ప్రభావం అంతా ఉంటుంది. అందరూ ఒకరిని చూసి ఒకరు అనుసరిస్తారు. బుద్ధికి కూడా విశ్రాంతి లభిస్తుంది. శక్తి కూడా నిండుతుంది మరియు వాయుమండలానికి కూడా సహయోగం లభిస్తుంది. అప్పుడు ఒక అమూల్య స్థితి కనిపిస్తుంది. కొన్ని రోజులు మీరు పరస్పరంలో గుర్తు చేసుకునేవారు - శివబాబా స్మృతిలో ఉన్నారా అని. ఆవిధంగా ఎప్పుడైనా, ఎవరైనా వ్యక్త భావంలో ఎక్కువగా ఉండడం మీరు చూసినట్టయితే మీరు అవ్యక్త శాంతిరూపాన్ని ధారణ చేయండి. అప్పుడు వారికి చెప్పనవసరం లేకుండానే ఆ సైగతో వారు అర్థం చేసుకుంటారు. అప్పుడు వాతావరణం అవ్యక్తంగా ఉంటుంది. మీ అంతిమ స్థితి - సాక్షాత్కారమూర్తి, ఎంతెంత సాక్షాత్తు మూర్తిగా అవుతారో అంతగానే సాక్షాత్కార మూర్తిగా అవుతారు. ఎప్పుడైతే అందరూ సాక్షాత్తు మూర్తిగా అయిపోతారో అప్పుడు అందరి యొక్క సంస్కారాలు కూడా సాక్షాత్తు మూర్తి సమానంగా అయిపోతాయి. ఎంతెంత మిమ్మల్ని మీరు చార్జ్ చేసుకుంటుంటారో అంతంతగా ఇన్చార్జ్ కర్తవ్యాలను సఫలతా పూర్వకంగా చేయగలుగుతారు. స్వయాన్ని నిమిత్తంగా భావించి అడుగు ముందుకు వేయాలి. ఎందుకంటే విశ్వాత్మల దృష్టి అంతా మీపైనే ఉంది. ఏవిధంగా అయితే మీ ద్వారా ఈశ్వరీయ స్నేహం, శ్రేష్ట జ్ఞానం మరియు శ్రేష్ట చరిత్రల యొక్క సాక్షాత్కారం అవుతుందో అదేవిధంగా అవ్యక్త స్థితి కూడా అంత స్పష్టంగానే సాక్షాత్కారం అవ్వాలి. మీరు నడుస్తూ తిరుగుతూ కూడా ఫరిస్తా వలె అనుభవం చేసుకోవాలి. దాని కొరకు ప్లాన్ తయారుచేయండి. సాకార బాబా ఫరిస్తా స్థితిని అనుభవం చేసుకున్నారు కదా! ఎంతో పెద్ద బాధ్యత ఉన్నా కానీ ఆకారి మరియు నిరాకారి స్థితిని అనుభవం చేయిస్తూ ఉన్నారు. అలాగే మీకు కూడా అంతిమ స్థితి యొక్క స్వరూపం స్పష్టంగా కనిపించాలి. ఎవరు ఎంత అశాంతితో లేదా శాంతి లేక భయపడుతూ వచ్చినా కానీ మీ యొక్క ఒక దృష్టి, స్మృతి, వృత్తి యొక్క శక్తితో వారిని పూర్తిగా శాంతి చేసేయాలి. ఎవరు ఎంత వ్యక్త భావనలో ఉన్నా కానీ మీ ఎదురుగా రాగానే అవ్యక్త స్థితిని అనుభవం చేసుకోవాలి. మీ దృష్టి అనేది కిరణాల వలే పని చేయాలి. ఇప్పటి వరకు ఫలితం చూస్తే మాస్టర్ సూర్యుని సమానంగా జ్ఞానం యొక్క ప్రకాశాన్నిచ్చే కర్తవ్యంలో సఫలులు అయ్యారు. కానీ శక్తి కిరణాలతో ప్రతి ఆత్మ యొక్క సంస్కారాలనే కీటాణువులను నాశనం చేసే కర్తవ్యం చేయాలి. జ్ఞానం ఇవ్వడంలో పాస్ అయ్యారు. శక్తిని ఇచ్చే కర్తవ్యం ఇప్పుడు మిగిలి ఉంది. బాప్ దాదా దగ్గర నాలుగు జాబితాలున్నాయి. 1. సర్వీస్ బుల్(సేవాధారి) 2. సెన్సిబుల్ (తెలివైనవారు) 3. సక్సెస్ ఫుల్ (సఫలతామూర్తులు) 4. వేల్యుబుల్ (విలువైనవారు). సఫలతా మూర్తులుగా కూడా అందరూ అవ్వలేరు, విలువైనవారిగా కూడా అందరూ అవ్వలేరు. కొందరు తమ గుణాలతో, చరిత్రతో విలువైనవారిగా అవుతారు. కానీ సేవా ప్లానింగ్ లో సఫలులు కాలేరు. ప్రతి ఒక్కరికీ ఎవరి చార్టు వారికి తెలుసు. నా పేరు ఏ జాబితాలో ఉంటుంది అనేది చూసుకోండి. కొందరికైతే నాల్గింటిలో కూడా పేరు ఉంది. కొందరికి రెండింటిలో, కొందరికి మూడింటిలో, కొందరికి ఒక దానిలోనే పేరుంది. విలువైన వారి యొక్క ముఖ్య గుణం ఏమిటంటే వారు తమ సమయము, సంకల్పం, సేవ యొక్క విలువ ఉంచుకుంటారు. అందువలన వారి సంకల్పం, మాట లేదా వారి ద్వారా జరిగే సేవ వీటన్నింటికీ ఇతరులు కూడా చాలా విలువ ఇస్తారు. డ్రామానుసారం వారికి చాలా విలువ ఉంటుంది. అందరూ వారిని విలువైనవారిగా చూస్తారు. మరి సేవాధారులు మొదటి నెంబరా లేక తెలివైనవారు మొదటి నెంబరా? ఇద్దరిదీ ఎవరి విశేషత వారిది, తెలివైనవారిలో ప్లానింగ్ బుద్ది ఎక్కువ ఉంటుంది. కానీ ప్లాన్‌ను ప్రత్యక్షంలోకి తీసుకువచ్చే విశేషత తక్కువగా ఉంటుంది. ఎవరైతే సేవాధారులుంటారో వారు ప్లానులు తక్కువ వేస్తారు. కానీ ప్లానులు ప్రత్యక్షంలోకి తీసుకువచ్చే విశేష గుణం వారిలో ఉంటుంది. కొందరిలో తెలివి కూడా ఉంటుంది మరియు సేవ చేసే గుణం కూడా ఉంటుంది. ఈ స్థాపనా కర్తవ్యంలో రెండూ కూడా అవసరమే. వారి యొక్క సంకల్పం లేదా ప్లాను ద్వారా భవిష్యత్తు తయారవుతుంది. వారి కర్మ ద్వారా అధిక ప్రభావం ఉంటుంది. సఫలతా మూర్తులకు అవ్యక్త స్థితి ఆధారంగా పరిణామం వస్తుంది. కొందరు ప్లాను కూడా చేస్తారు, ప్రత్యక్షంగా చేస్తారు కూడా. కాని సఫలత తక్కువ వస్తుంది. సేవాధారిగా అవుతారు కానీ సఫలతామూర్తిగా అందరూ అవ్వలేరు. కొందరికి డ్రామానుసారం సఫలత యొక్క వరదానం ప్రాప్తిస్తుంది. అలాంటివారికి శ్రమ తక్కువ చేయాల్సి ఉంటుంది. వారికి సహజంగానే సఫలత లభిస్తుంది. డ్రామాలో ప్రతి ఒక్కరిది ఎవరి పాత్ర వారిది. టీచర్లు అంటే టీచరే. టీచర్లు సదా ఇది స్మృతిలో ఉంచుకోవాలి - నేను టీచరు అవ్వని పూర్వం విద్యార్థిని. నేను విద్యార్థిని అనే స్మృతి ఉండడం ద్వారా చదువు బుద్దిలో ఉంటుంది. ఎప్పుడైతే మీరు చదువుకుంటారో అప్పుడే ఇతరులను చదివించగలరు. విద్యార్థి జీవితం లేకపోతే ఇతరులను కూడా విద్యార్థిగా తయారుచేయలేరు. వాతావరణాన్ని మార్చేటందుకు సదా స్వయాన్ని నేను మాస్టర్ సూర్యున్ని అని భావించండి. సూర్యుని కర్తవ్యం ఏమిటి? 1. వెలుగు ఇవ్వడం, 2. మురికిని సమాప్తి చేయడం, సదా ఈ విధంగా భావించండి - నా నాడవడిక అనే కిరణాలతో ఈ రెండు కర్తవ్యాలు జరుగుతున్నాయా? సర్వాత్మలకు ప్రకాశం కూడా లభించాలి, సర్వాత్మల్లో ఉన్న మురికి కూడా సమాప్తం అయిపోవాలి. ప్రకాశం లభిస్తుంది కానీ మురికి సమాప్తం అవ్వడం లేదంటే నా కిరణాల్లో శక్తి లేదని భావించండి. ఎండ తీవ్రంగా లేకపోతే కీటాణువులు సమాప్తం అవ్వవు. అలాగే మీలో కూడా శక్తి తక్కువగా ఉంటే, జ్ఞానం అనే ప్రకాశాన్ని ఇవ్వగలరు. కానీ పాత సంస్కారం అనే కీటాణువులను సమాప్తం చేయలేదు. ఎంత శక్తి ఉంటే అంత త్వరగా అవి సమాప్తం అయిపోతాయి. శక్తి తక్కువగా ఉంటే సమయం కూడా చాలా పడుతుంది. కనుక శక్తివంతులుగా అవ్వాలి. నేను చదువుకోలేదు అని ఎవరూ భావించవద్దు. ఎందుకంటే సృష్టి జ్ఞానాన్ని చదువుకున్నారు మీరు. దీంట్లోనే అన్నీ వచ్చేస్తాయి.