11.02.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అంతః వాహక శరీరం ద్వారా సేవ.

ఒక్క సెకనులో ఎంత దూరం వెళ్ళగలరు? లెక్కించగలరా? మరణించిన తర్వాత ఆత్మ ఒక సెకండులో ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అదేవిధంగా మీరు కూడా అంతః వాహక శరీరం ద్వారా; అసలు అంత వాహక శరీరం అని అంటున్నారు, దాని భావార్థం ఏమిటి? అంతః వాహక శరీరం ద్వారా చాలా చోట్ల విహరించినట్లుగా మీ గురించి చెప్తారు కదా! దాని యొక్క అర్ధం ఏమిటి? ఈ మహిమ కేవలం దివ్యదృష్టి గల వారి గురించి కాదు, మీ అందరిదీ కూడా. ప్రజలు అయితే అంతః వాహక శరీరం గురించి వాళ్ళ అర్థాలు వారు చెప్తారు. కానీ యదార్ధ అర్ధం ఏమిటంటే అంతిమ సమయంలో మీకు కర్మాతీత స్థితి ఉంటుంది, అది మీకు వాహనం అవుతుంది. విహరించాలంటే ఏదొక వాహనం కావాలి, దాని ద్వారా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు. అలాగే కర్మాతీత స్థితి తయారైపోతే ఆ స్థితి ద్వారా ఒక్క సెకండులో ఎక్కడెక్కడికో చేరుకోగలరు. అందువలనే అంతః వాహక శరీరం అని చెప్తారు. వాస్తవానికి ఇది అంతిమ స్థితికి మహిమ. ఆ సమయంలో మీరు ఈ స్థూల రూపం యొక్క భ్రాంతికి అతీతంగా ఉంటారు, అందువలనే దీనిని సూక్ష్మ శరీరం అని కూడా అంటారు. ఎగిరే గుఱ్ఱం అని మహిమ ఉంది కదా! ఈ సమయంలోని మీ అందరి అనుభవం యొక్క విషయాలు కథల రూపంగా తయారు చేశారు. ఇక్కడికి చేరుకో అని ఆజ్ఞాపించగానే ఒక్క సెకనులో అక్కడికి చేరిపోతుంది. ఇలా మీరు అనుభవం చేసుకుంటున్నారా? ఈనాడు విజ్ఞానం వారు వేగాన్ని తీవ్రం చేయటంలో బిజీగా ఉన్నారు. ఎంత వీలైతే అంత సమయం తక్కువ, సఫలత ఎక్కువ రావాలని పురుషార్ధం చేస్తున్నారు. అదేవిధంగా మీ యొక్క పురుషార్థం కూడా ప్రతీ విషయంలో వేగం పుంజుకున్న విధంగా జరుగుతుందా? ఎంతెంతగా ఎవరి వేగం పెరుగుతుందో అంతగానే మీ అంతిమ స్థితికి సమీపంగా రాగలరు. వేగంతో స్థితి వరకు చేరుకుంటారు. మీ వేగంతో మీ స్థితిని పరిశీలించుకోవచ్చు.

ఇప్పుడు అందరూ శివరాత్రి మహా పర్వదినాన్ని జరుపుకునేటందుకు ప్లాను తయారు చేస్తున్నారు. మరయితే నవీనంగా ఏమి ఆలోచించారు? (జెండాలు ఎగురవేస్తాం) మీ మీ సేవాకేంద్రాల్లో జెండాలు ఎగురవేయండి. కానీ ప్రతీ ఆత్మ యొక్క హృదయంలో బాబా ప్రత్యక్షతా జెండాను ఎగురవేయండి. అది ఎప్పుడవుతుందంటే శక్తి స్వరూపం యొక్క ప్రత్యక్షత జరిగినప్పుడు. శక్తి స్వరూపం ద్వారానే సర్వశక్తివంతుడిని ప్రత్యక్షం చేయగలరు. శక్తి స్వరూపం అనగా సంహారి మరియు అలంకారి. వేదిక పైకి వచ్చే ముందు మీ స్థితిని చక్కగా తయారు చేసుకుని ఆ తర్వాత వేదిక పైకి రండి. దీని ద్వారా ప్రజలకు మీ ఆంతరంగిక స్థితి సాక్షాత్కారం అవ్వాలి. ఇతర తయారీలు ఎలా అయితే చేసారో అదేవిధంగా మీ తయారి కూడా చూసుకోండి - అలంకారియై వేదికపైకి వస్తున్నానా? లైట్ హౌస్, మైట్ హౌస్ రెండు స్వరూపాలు ప్రత్యక్షంగా కనిపించాలి. రెండింటి స్వరూపంగా అయినప్పుడు మార్గదర్శిగా కాగలరు. బాబా అనే మీ మాటలో ఎంత స్నేహం మరియు శక్తి ఉండాలంటే ఆ మాట జ్ఞాన అంజనం (కాటుక) వలె పని చేయాలి. అనాధలను సనాధలుగా తయారు చేయాలి. ఈ ఒక్క మాటలో ఇంత శక్తిని నింపండి. వేదిక పైకి వచ్చినప్పుడు స్థితి ఎలా ఉండాలంటే, ఒకవైపు దయతో, మరోవైపు కళ్యాణ భావనతో, మూడవ వైపు అతి స్నేహంతో కూడిన మాటలు, నాల్గవ వైపు మీ స్వరూపంలో శక్తిశాలి స్థితి యొక్క మెరుపు ఉండాలి. మీ స్మృతి మరియు స్థితిని ఆవిధంగా శక్తిశాలిగా తయారు చేసుకుని చాలా సమయం నుండి పిలుస్తున్న భక్తులకు మీ ద్వారా బాబాను సాక్షాత్కరింప చేయటానికి వచ్చాను అని భావించండి. ఈ రకంగా మీ ఆత్మిక రూపం, ఆత్మిక దృష్టి, కళ్యాణకారి వృత్తి ద్వారా బాబాని ప్రత్యక్షం చేయగలరు. అర్థమైందా! ఏమి చేయాలో. కేవలం ఉపన్యాసాన్ని తయారు చేసుకోవటమే కాదు. ఆ ఉపన్యాసాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఆ ఉపన్యాసం ద్వారా ధ్వనికి అతీతం అయ్యే స్థితిని వారికి అనుభవం చేయించండి. ఉపన్యాసం యొక్క తయారీ ఎక్కువ చేస్తున్నారు. కానీ ఆత్మిక ఆకర్షణా స్వరూపం యొక్క స్పృతిలో ఉండే తయారీపై తక్కువ శ్రద్ధ పెడుతున్నారు. అందువలన ఈసారి ఈ తయారీ ఎక్కువ చేయాలి. ప్రతి ఒక్కరి హృదయంపై బాబాతో సంబంధం యొక్క స్నేహాన్ని ముద్రించాలి. మంచిది. మధువనం వారు ఏమి సేవ చేస్తారు? మధువనం వారికి విశేషంగా ఆరోజు అవ్యక్తవతనం రమ్మని బాప్ దాదా ఆహ్వానిస్తున్నారు. వతనానికి వచ్చి అక్కడి నుండి అన్ని వైపుల జరిగే సేవ చూడవచ్చు. సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు ఈ రెండు గంటలు విశేషంగా విహరింపచేస్తారు. అన్ని స్థానాలకు విహరింపచేయటానికి సందేశీలను ఎలాగైతే తీసుకువెళ్తారో, అదేవిధంగా మధువనం వారిని ఇక్కడ కూర్చుని ఉండగానే విహరింప చేసి అన్ని స్థానాలలో జరిగే సేవలను చూపిస్తారు. అందువలన మధువనం వారు ఆరోజు స్వయాన్ని ఈ స్థూల దేహం నుండి అతీతంగా అవ్యక్త వతనవాసిగా భావించి కూర్చుంటే రోజంతటిలో అనేక అనుభవాలు చేసుకుంటారు. ఏమి అనుభవం చేసుకున్నారో తర్వాత చెప్పాలి మీరు. ఆరోజు మీరు కొంచెం పురుషార్ధం చేసినా కానీ సహజంగానే అమూల్య భిన్న భిన్న అనుభవాలు చేసుకునే వరదానాన్ని పొందుతారు. అర్థమైందా! సాయంత్రం 7 గంటల నుండి 9గంటల వరకు విశేష స్మృతి కార్యక్రమం పెట్టుకోండి. అసలైతే రోజంతా రమ్మని ఆహ్వానిస్తున్నారు. కానీ విశేష విహార సమయం ఇది. ఆ సమయంలో ప్రతీ ఒక్కరు శక్తిననుసరించి అనుభవం చేసుకోగలరు. మధువనం వారు విశేష స్నేహిలు, అందువలన విశేష ఆహ్వానం. కేవలం బుద్ది ద్వారా మీ యొక్క ఈ దేహ భ్రాంతికి అతీతమై కూర్చోండి, ఇక ఆ తర్వాత డ్రామాలో ఏది అనుభవం అవ్వాలని ఉందో అది అవుతుంది. సందేశీలకు అయితే సాక్షాత్కారం అనేది సాధారణ విషయం, కానీ బుద్ధి ద్వారా కూడా ఈవిధంగా అనుభవం చేసుకోగలరు. కళ్ళతో చూసినంత స్పష్టంగా అనుభవం చేసుకోగలరు. మంచిది.