18.03.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


విజయీగా అయ్యేటందుకు సంగ్రహ మరియు సంగ్రామ శక్తి అవసరం.

ఈరోజు విశేషంగా భట్టీలో ఉన్నవారి కోసం పిలిచారు. భట్టీలో ఉన్న వారు ఏమేమి ధారణలు చేశారో చూస్తున్నారు. ఈ రోజు ప్రతీ ఒక్కరి సాకార చిత్రం ద్వారా విశేషంగా రెండు విషయాలు చూస్తున్నారు. రెండు శక్తుల యొక్క ధారణను చూస్తున్నారు, ప్రతి ఒక్కరు శక్తిననుసరించి ధారణ చేశారు. ఏ రెండు శక్తులను చూస్తున్నారు? 1. సంగ్రహ శక్తి 2. సంగ్రామ శక్తి. సంగ్రహ శక్తి కూడా బాగా అవసరం. భట్టీలో లభించిన జ్ఞాన రత్నాలను బుద్ధిలో సంగ్రహించుకోవాలి. వీటిని సంగ్రహించుకోవటం ద్వారానే లోక సంగ్రాహం చేయగలరు. అందువలన సంగ్రహించే మరియు సంగ్రామం చేసే రెండు శక్తులు అవసరం. రెండు శక్తులను ధారణ చేశారా? రెండింటిలో ఏది లోపంగా ఉన్నా కానీ లోపం ఉన్న వారు ఎప్పుడూ విజయీగా కాలేరు. ఎవరిలో ఎంత సంగ్రహ శక్తి ఉంటుందో అంతగానే సంగ్రామం చేసే శక్తి కూడా ఉంటుంది. రెండు శక్తులను ధారణ చేసేటందుకే భట్టీకి వచ్చారు. మరయితే శక్తి స్వరూపంగా అయ్యారా? భట్టీ నుండి ఏ వరదానాన్ని ప్రాప్తింప చేసుకున్నారు? భక్తిమార్గంలో వరదానం ఇస్తారు కదా - పుత్రవాన్ భవ! ధనవాన్ భవ! కానీ ఈ భట్టీలో ఏ ముఖ్య వరదానం లభించింది? శిక్షకులుగా అయ్యారా లేక మాస్టర్ వరదాతగా కూడా అయ్యారా? ఒక వరదానం - శక్తివాన్ భవ, రెండవ వరదానం - సదా అవ్యక్త ఏకరస స్థితి భవ. ఈ రెండు వరదానాల్లో రెండు విషయాలు నిండి ఉన్నాయి. ఈ రెండు వరదానాలను ప్రాప్తించుకుని సంపత్తివంతులై మీ యొక్క ప్రత్యక్ష ఉదాహరణ చూపించేటందుకు వెళ్ళాలి. మా ఇంటికి వెళ్తున్నాము లేదా మా స్థానానికి వెళ్తున్నాము అని భావించకూడదు. ఏవైతే శక్తులు వరదానాలు తీసుకున్నారో వాటిని ప్రత్యక్షంలోకి తీసుకువచ్చేటందుకు విశ్వ వేదికపైకి వెళ్తున్నాను అని భావించాలి. వేదికపై పాత్రధారి ఏ ముఖ్య విషయాలపై ధ్యాస పెట్టాలి? పాత్రపై దృష్టి పెట్టాలి మరియు ఖచ్చితత్వం ఉండాలి. (అటెన్షన్ మరియు యాక్యురసీ) ఈ రెండు విషయాలు చాలా గుర్తుంటాయి. అదేవిధంగా ఇప్పుడు మీరు కూడా వేదికపై పాత్రను అభినయించి బాప్ దాదాను ప్రత్యక్షం చేసేటందుకు వెళ్తున్నారు. కనుక ఈ రెండు విషయాలు మీరు కూడా గుర్తుంచుకోవాలి. ప్రతీ సెకండు ప్రతీ సంకల్పంపై దృష్టి పెట్టాలి, మరియు ఖచితత్వం ఉండాలి. లేకపోతే బాప్ దాదాని ప్రత్యక్షం చేసే పాత్రను అభినయించలేరు. ఏమి చేయటానికి వెళ్తున్నారో, ఇప్పుడు అర్థమైందా? ఈ లక్ష్యం పెట్టుకుని వెళ్ళాలి. ఏ కర్మ చేస్తున్నా మొదట ఇది చూడండి - ఈ కర్మ ద్వారా బాప్ దాదా ప్రత్యక్షం అవుతారా? కేవలం వాణి ద్వారా ప్రత్యక్షం చేయాలనే ఏమీ లేదు. ప్రతీ సమయం ప్రతీ కర్మ ద్వారా కూడా ప్రత్యక్షం చేయాలి. సర్వాత్మల నోటి నుండి ఇదే మాట రావాలి - వీరు ఒకొక్కరు సాక్షాత్తు బాబా సమానులు... ఈవిధంగా ప్రత్యక్షం చేయండి. మీ యొక్క ప్రతీ కర్మ దర్పణంగా అవ్వాలి. ఆ దర్పణం ద్వారా బాప్ దాదా యొక్క గుణాలు మరియు కర్తవ్యం యొక్క దివ్య రూపం మరియు ఆత్మీయత సాక్షాత్కారమవ్వాలి. కానీ దర్పణంగా ఎవరు కాగలరు? కేవలం సంకల్పాలనే కాకుండా దేహాభిమానాన్ని కూడా అర్పణ చేసినవారు కాగలరు. దేహాభిమానాన్ని అర్పణ చేసిన వారి ప్రతీ కర్మ దర్పణంగా అవుతుంది. ఏ వస్తువుని అయినా అర్పిస్తే ఇక ఆ వస్తువు తమది కాదని భావిస్తారు. అదేవిధంగా ఈ దేహాభిమానాన్ని కూడా అర్పణ చేస్తే నాది అనేది తొలగిపోతుంది. అప్పుడు తగుల్పాటు కూడా తొలగిపోతుంది. ఆవిధంగా సమర్పణ అయ్యారా? అవిధంగా సమర్పణ అయ్యే వారి గుర్తు ఏమిటి? 1. సధా యోగయుక్తంగా ఉంటారు. 2. సదా బంధన ముక్తంగా ఉంటారు. ఎవరైతే యోగయుక్తంగా ఉంటారో వారు తప్పకుండా బందన్ముక్తులుగా ఉంటారు. కనుక సమర్పణ అనగా సదా యోగయుక్తం మరియు సర్వ బంధనముక్తం. మీలో ఈ గుర్తు సదా స్థిరంగా ఉండాలి. బంధనయుక్తులుగా ఉంటే యోగయుక్తులుగా పిలవబడలేరు. యోగయుక్తుల పరిశీలన ఏమిటంటే వారి యొక్క ప్రతి సంకల్పం ప్రతి కర్మ యోగయుక్తంగా ఉంటాయి. ఎందుకంటే ఏవైతే సర్వ రకాల యుక్తులు లభించాయో ఆ యుక్తుల ధారణ కారణంగా యుక్తియుక్తులుగా మరియు యోగయుక్తులుగా ఉంటారు. అర్ధమైందా! పరిశీలనకు గుర్తు ఏమిటో, దీని ద్వారా మీకు మీకే తెలుస్తుంది ఎంత వరకు చేరుకున్నారో. అందువలనే సంగ్రహ మరియు సంగ్రామ రెండు శక్తులను నింపుకుని వెళ్ళాలని చెప్పాను. ఏమి ఫలితం చూశారు? సర్టిఫికెట్ లభించిందా? 1. స్వయంతో స్వయానికి లభించే సర్టిఫికెట్ 2. సర్వులను సంతుష్టం చేసిన సర్టిఫికెట్ 3. సంపూర్ణ సమర్పణా సర్టిఫికెట్. సమర్పణ అనగా ఆబూకి వచ్చేసి కూర్చోవటం కాదు. సమర్పణ అవ్వటానికి కూడా సర్టిఫికెట్ తీసుకోవాలి. జ్ఞాన యుక్తులు ఏవైతే లభించాయో వాటిని సంగ్రహించుకునే శక్తి యొక్క సర్టిఫికెట్ కూడా తీసుకోవాలి. ఈ నాలుగు సర్టిఫికెట్లు మీ టీచర్ నుండి తీసుకుని వెళ్ళాలి. ఒక విషయంలో ఈ గ్రూపుకి 100 మార్కులు. అది ఏ విషయం ? పురుషార్థంలో భోళా అవ్వటంలో 100 మార్కులు. పురుషార్థంలో భోళాగా అవ్వటమే సోమరితనం. మరియొక విశేష గుణం కూడా ఉంది. అదేమిటంటే అందరికీ స్వ పరివర్తన చేసుకోవాలనే కోరిక తీవ్రంగా ఉంది. అందువలన బాప్ దాదా ఈ గ్రూపుని ఆశావంతుల గ్రూపు అని భావిస్తున్నారు. కానీ ఆశలు ఎప్పుడు పూర్తవుతాయంటే నమ్రచిత్ అయ్యి వడిచినప్పుడు. ఆశావంతుల లక్షణాలు ఉన్నాయి, కాని ఏవైతే లక్షణాలు ఉన్నాయో వాటిని ధారణ చేస్తూ నడవటం ద్వారా ప్రత్యక్ష ఉదాహరణగా కాగలరు. అర్థమైందా!

జ్ఞాన గీతాలు లేదా జ్ఞాన రహస్యాలు వినటంలో మంచిగా ఉన్నారు, కానీ ఇప్పుడు ఏమి చేయాలి? రహస్యయుక్తంగా అవ్వాలి. యోగం బాగుంది కానీ యోగయుక్తంగా అవ్వాలి. బంధన్ముక్తులుగా అవ్వాలనే కోరిక ఉంది కానీ మొదట దేహాభిమానం యొక్క బంధనను తెంచాలి. ఆ తర్వాత సర్వ బంధన్ముక్తులుగా స్వతహాగానే అయిపోతారు. అర్థమైందా! ఇప్పుడు ఇదే ప్రయత్నం చేయాలి. ఉదాహరణ మూర్తులుగా మరియు సుపుత్రులుగా అవ్వాలి. శక్తివంతులుగా మరియు ధనవంతులుగా అయ్యారా? ప్రతీ ఒక్కరు స్వయంతో ప్రతిజ్ఞ కూడా చేశారు. చేసిన ప్రతిజ్ఞను పూర్తి చేసేటందుకు శక్తిని కూడా తప్పక కూడబెట్టుకుంటారు. ఎంతగా సహించవలసి వచ్చినా కానీ, ఎదుర్కోవలసి వచ్చినా కానీ ప్రతిజ్ఞను పూర్తి చేయవలసిందే. ఇలాంటి ప్రతిజ్ఞ చేశారా? విశ్వంలోని ఆత్మలందరు కలిసి ప్రతిజ్ఞ నుండి తొలగించాలని ప్రయత్నించినా కానీ ప్రతిజ్ఞ నుండి తొలగిపోము మరియు ఎదుర్కుని సంపూర్జంగా అయ్యే చూపిస్తాము. ఇలాంటి ప్రతిజ్ఞ చేసేవారికి స్మృతి చిహ్నం తయారై ఉంది - అచలఘర్. మా స్మృతిచిహ్నం ఎలా ఉందో ఆవిధంగా మేము తయారయ్యి చూపించాలని సదా గుర్తుంచుకోవాలి. ఇది అయితే సహజం కదా! స్థూల గుర్తుని గుర్తుంచుకోవటం ద్వారా నషా మరియు గమ్యం గుర్తు ఉంటాయి. విశ్వమంతటి నుండి ఎన్నుకోబడిన విశేషాత్మలం మేము అని స్వయాన్ని తపక భావించాలి. ఎంత విశేష ఆత్మలో అంతగా వారి యొక్క ప్రతి కర్మలో విశేషత ఉంటుంది. విశేషాత్మలు కదా! తక్కువైనవారు కాదు మధువన నివాసీయులందరికి ప్రత్యక్షంగా విశేషాత్మలుగా మీరు కనిపించి మీ యొక్క ఈ గ్రూపు యొక్క పేరుని ప్రసిద్ధం చేయాలి. తక్కువ చెప్తాము కానీ ఎక్కువ చేసి చూపిస్తాము - ఈ లక్ష్యం పెట్టుకోవాలి. మీ గ్రూపులో ఈ విశేషత చూస్తాను, వేదికపై పాత్రను ఎలా అభినయించాలంటే అందరూ వన్స్ మోర్ (మరోసారి) అని అనాలి. అర్థమైందా! మీ నిమిత్త టీచరు మీ గ్రూపుని తరచుగా ఆహ్వానించాలి. ఇతర గ్రూపుల వారికి ఒక ఉదాహరణ అయ్యి చూపించాలి. ఎవరైనా మంచి కర్మ చేసి వెళ్తే వారు చాలాసార్లు గుర్తు వస్తూ ఉంటారు. ఈ గ్రూపు కూడా అలాంటి అద్భుతం చేసి చూపించాలి. మంచిది.