09.04.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


అవ్యక్త స్థితిలో సర్వ గుణాల యొక్క అనుభవం.

ధ్వనికి అతీతమైన స్థితి ప్రియమనిపిస్తుందా లేక ధ్వనిలో ఉండే స్థితి ప్రియమనిపిస్తుందా? ఏ స్థితి ఎక్కువ ప్రియమనిపిస్తుంది? రెండు స్థితులు కలిసి ఉంటున్నాయా? ఈ అనుభవం ఉందా? ఈ అనుభవం చేసుకునే సమయంలో ఏ గుణం ప్రత్యక్ష రూపంలో కనిపిస్తుంది? (అతీతం మరియు అతి ప్రియం) ఈ స్థితి ఎలాంటిదంటే బీజంలో వృక్షం అంతా ఇమిడి ఉన్నట్లు ఈ అవ్యక్త స్థితిలో ఏవైతే సంగమయుగం యొక్క విశేష గుణాలను మహిమ చేస్తారో ఆ విశేష గుణాలన్ని ఆ సమయంలో అనుభవంలోకి వస్తాయి. ఎందుకంటే మాస్టర్ బీజరూపులు జ్ఞాన సాగరులు కూడా. కేవలం శాంతియే కాదు, శాంతితో పాటు జ్ఞానం, అతీంద్రియ సుఖము, ప్రేమ, ఆనందము, శక్తి... ఇలా అన్ని ముఖ్య గుణాల యొక్క అనుభవం అవుతుంది. కేవలం స్వయమే కాదు కానీ ఇతరాత్మలు కూడా ఇలాంటి స్థితిలో స్థితియై ఉన్న ఆత్మ యొక్క ముఖము ద్వారా ఈ గుణాలన్నింటినీ అనుభవం చేసుకుంటారు. సాకార స్వరూపంలో ఏమి అనుభవం చేసుకున్నారు? ఒకే సమయంలో సర్వ గుణాలు అనుభవం అయ్యేవి. ఎందుకంటే ఒక గుణంలో సర్వ గుణాలు ఇమిడి ఉన్నాయి. అజ్ఞానంలో ఒక వికారంతో సర్వ వికారాలకి లోతైన సంబంధం ఎలాగైతే ఉంటుందో అలాగే ఒక గుణంతో ముఖ్యమైన గుణాలన్నింటికీ లోతైన సంబంధం ఉంటుంది. ఎవరైనా కానీ నాది జ్ఞాన స్వరూప స్థితి అని అన్నారంటే జ్ఞాన స్వరూపంతో పాటు ఇతర గుణాలు కూడా దానిలో తప్పక నిండి ఉంటాయి. దీనినే ఒక్క మాటలో చెప్పాలంటే ఏ స్థితి అని అంటారు? మాస్టర్ సర్వశక్తివాన్. ఈ స్థితిలో సర్వశక్తులు ధారణ అవుతాయి. ఇలాంటి స్థితిని తయారు చేసుకోవటమే సమానత లేదా సంపూర్ణత యొక్క స్థితి. ఇలాంటి స్థితిలో స్థితులై సేవ చేస్తున్నారా? సేవ చేసే సమయంలో వేదిక పైకి వచ్చేటప్పుడు మొదట ఈ స్థితిలో స్థితులై ఆ తర్వాత స్థూల వేదిక పైకి రండి, దీని వలన ఏమి అనుభవం అవుతుంది? సంఘటన మధ్యలో ఉంటూ కూడా అలౌకిక ఆత్మగా కనిపిస్తారు. ఇప్పుడు సాధారణ స్వరూపంతో పాటు స్థితి కూడా సాధారణంగా కనిపిస్తుంది. కానీ సాధారణ రూపంలో ఉంటూ అసాధారణ స్థితి లేదా అలౌకిక స్థితిలో ఉండటం ద్వారా సంఘటన మధ్యలో ఉంటూ కూడా భగవత్ జనులుగా కనిపిస్తారు. మొట్టమొదట్లో కూడా ఇలాంటి స్థితి యొక్క నషా ఉండేది. సితారల సంఘటనలో కూడా కొన్ని విశేష సితారలు ఉంటాయి కదా! వాటి యొక్క మెరుపు, తళుకు దూరం నుండే అతీతంగా మరియు ప్రియంగా అనిపిస్తుంది. అదేవిధంగా సితారలైన మీరు కూడా సాధారణ ఆత్మల మధ్యలో ఒక విశేష ఆత్మగా కనిపించాలి. ఏదైనా అసాధారణ వస్తువు ఎదురుగా ఉంటే అందరి ధ్యాస అనుకోకుండానే అటు వైపు వెళ్తుంది. ఇలాంటి స్థితిలో స్థితులై వేదిక పైకి రండి. దీని ద్వారా ప్రజల దృష్టి స్వతహాగానే మీ వైపుకి రావాలి. స్టేజ్ సెక్రటరీ మీ పరిచయం ఇవ్వకుండానే మీ స్థితియే మిమ్మల్ని పరిచయం చేయాలి. వజ్రం మట్టిలో దాగి ఉన్నా కానీ తన పరిచయాన్ని తాను ఇవ్వదా? అదేవిధంగా సంగమయుగంలో వజ్రతుల్య జీవితం తన పరిచయాన్ని తానే ఇవ్వగలదు. ఇప్పటి వరకు ఫలితం ఏమిటో తెలుసా? ఇప్పటి వరకు ఎలాంటి తుల్యంగా అయ్యారు? ఉపన్యాసాలు ఏవైతే చెప్తున్నారో వాటి యొక్క ఫలితం ఏమి కనిపిస్తుంది? వర్తమాన సమయంలో మొదటి నెంబరు ప్రజలు కూడా తక్కువగా వస్తున్నారు, సాధారణ ప్రజలు ఎక్కువగా వస్తున్నారు. ఎందుకంటే సాధారణ రూపంతో పాటు స్థితి కూడా చాలా సమయం సాధారణంగా ఉంటుంది. ఇప్పుడు సాధారణ రూపంలో అసాధారణ స్థితి యొక్క అనుభవం స్వయం కూడా చేస్కోండి మరియు ఇతరులకు కూడా చేయించండి. బాహర్ముఖతలోకి వచ్చే సమయంలో అంతర్ముఖత యొక్క స్థితి కూడా వెనువెంట ఉంచుకోండి, కానీ ఇలా జరగటం లేదు. అయితే అంతర్ముఖి అయిపోతున్నారు, లేదా బాహర్ముఖి అయిపోతున్నారు. కానీ అంతర్ముఖులై తిరిగి బాహర్ముఖతలోకి రావాలి. ఈ అభ్యాసం కోసం మీపై వ్యక్తిగత ధ్యాస పెట్టుకోవలసిన అవసరం ఉంది. బాహర్ముఖత యొక్క ఆకర్షణ అంతర్ముఖత యొక్క స్థితి కంటే ఎక్కువగా ఉంది. దీనికి కారణం ఏమిటంటే సదా మీ యొక్క శ్రేష్ట స్వరూపం లేదా శ్రేష్ట నషాలో స్థితులై ఉండటం లేదు. అందువలన స్థితి శక్తివంతంగా ఉండటం లేదు. జ్ఞాన సాగరులతో పాటు శక్తివంతులై జ్ఞానాన్ని ఇవ్వండి. అప్పుడు అనేకాత్మలను అనుభవిగా తయారు చేయగలరు. ఇప్పుడు వినిపించేవారు ఎక్కువగా ఉన్నారు, అనుభవం చేయించేవారు తక్కువగా ఉన్నారు. వినిపించేవారు అనేకమంది ఉన్నారు, కానీ అనుభవం చేయించేవారు కేవలం మీరే. సేవ చేసే సమయంలో ఇదే లక్ష్యం పెట్టుకోండి - జ్ఞానదానంతో పాటు మీ యొక్క లేదా బాబా యొక్క గుణాలను దానం చేయాలి. గుణాల దానం అనేది మీరు తప్ప ఇతరులు ఎవ్వరూ చేయలేరు. అందువలన స్వయం సర్వ గుణాల యొక్క అనుభవీ స్వరూపంగా అయితే ఇతరులను కూడా అనుభవీగా తయారు చేయగలరు. కమలపుష్ప సమానంగా తయారయ్యారా? మీ జీవితానికే ఆ చిత్రం చూపించారు కదా! లేక ఎవరో మహారధీల జీవిత చిత్రమా? మా చిత్రమే ఇది, అని అంటారు కదా! చిత్రాన్ని ఎందుకు తయారు చేస్తారు? చరిత్ర ఉంటేనే చిత్రం తయారవుతుంది. అలాంటి చరిత్రవంతులు కనుక చిత్రం తయారు చేశారు. ఈ ఒక్క చిత్రాన్ని స్మృతిలో ఉంచుకుని ప్రతీ కర్మ చేయండి. అప్పుడు సదా సర్వ విషయాల్లో అలిప్తంగా అనగా అతీతంగా ఉంటారు. ఈ విధంగా అల్పకాలికంగానే ఉంటున్నారు. ఎలాంటి వాతావరణం అయినా కానీ, ఎలాంటి వాయుమండలం అయినా కానీ కేవలం ఈ ఒక్క చిత్రాన్ని గుర్తుంచుకున్నా చాలు వాయుమండలం నుండి అతీతంగా ఉంటారు. ఇప్పుడు అక్కడక్కడ వాయుమండలం యొక్క ప్రభావం పడుతుంది. లక్ష్యం చాలా ఉన్నతమైనది, మేము పంచతత్వాలను కూడా పావనం చేసేవాళ్ళం, పరివర్తన చేసేవాళ్ళం అని, అలాంటి వారు ఎప్పుడైనా వాయుమండలానికి వశం అవుతారా? పరివర్తన చేసేవారు మీరు అంతేకానీ ప్రకృతి యొక్క ఆకర్షణలోకి వచ్చేసి పరివర్తన అయిపోయేవారు కాదు. సదాకాలికంగా కమలపుష్ప సమానంగా ఉండాలి. ఈరోజు ఈ గ్రూపు యొక్క ఏ రోజు? థియరీ పూర్తి అయ్యింది, ప్రాక్టికల్ పరీక్ష కోసం వెళ్తున్నారు. ఇప్పుడు ఈ గ్రూపు వారు, ఇతర అన్ని గ్రూపుల కంటే ఏ విశేష కార్యం చేసి చూపిస్తారు? ఎంత సమయంలో ఎంతమంది వారసులను తయారు చేసి తీసుకువస్తారు? కొద్ది సమయంలో అనేకులను తయారు చేస్తారా? వీరు అయితే చాలా ప్రతిజ్ఞలు చేశారు. ప్రతిజ్ఞల కోసమే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఎన్ని ప్రతిజ్ఞలు చేస్తారో, ఆ ప్రతిజ్ఞలు అన్నింటినీ నిలుపుకునేటందుకు కేవలం ఒకే ఒక నియమాన్ని గుర్తుంచుకోవాలి. అది ఏమిటి? (జీవిస్తూనే చనిపోవాలి) జీవిస్తూనే చనిపోవటం అనేది మాటిమాటికీ జరుగుతుందా? బాప్ దాదా సదా ప్రతీ ఒక్కరిపై అన్ని రకాల ఆశలు పెట్టుకుంటారు . కానీ ఆశలను పూర్తి చేసేవారు నెంబరువారీగా ఉంటారు. అందువలన ఈ గ్రూపు ముఖ్యంగా ఒక ప్రతిజ్ఞను గుర్తుంచుకోవాలి. కోర్సు అంతటి యొక్క సారం ఏమిటి? చిత్రాలన్నింటిలో ముఖ్య చిత్రం ఏది చూపిస్తారు? దాని ద్వారా బాప్ దాదా ప్రత్యక్షం అవ్వాలి. శిక్షణల అన్నింటి యొక్క సారం చెప్పండి. ఏ కర్మ ద్వారా అయినా అనగా చూడటం, లేవటం, కూర్చోవటం, నడవటం మరియు నిద్రపోవటం ద్వారా కూడా ఫరిస్తా స్థితి కనిపించాలి. ప్రతీ కర్మలో అలౌకికత కనిపించాలి. ఏ లౌకిక కర్మలు లేదా సంస్కారాలు ఉండకూడదు, ఈ విధంగా పరివర్తన చెందారా? సర్వోన్నత పురుషార్థీల లక్షణాలు కూడా విశేషంగా ఉంటాయి. వారిలో ఆలోచించటం, చేయటం, చెప్పటం మూడూ సమానంగా ఉంటాయి. ఇది చేయకూడదు అనుకున్నాను కానీ చేశాను అని వారు అనరు. ఆలోచించటం, చెప్పటం, చేయటం మూడూ సమానంగా ఉంటాయి. ఇలాంటి శ్రేష్ఠ పురుషార్థీగా అయ్యారా? మంచిది.

ఈ గ్రూపు ఎంత పెద్దదో అంత శక్తిశాలి స్వరూపంగా అయ్యి నలువైపులా వెళ్తే ఇక శక్తుల యొక్క జై జై కారాలు ప్రసిద్ధం అవుతాయి. సంస్కారాలకు కూడా ఆధీనం అవ్వకూడదు. ఎవరి యొక్క స్నేహానికి ఆధీనం కాకూడదు. వాయుమండలానికి ఆధీనం కాకూడదు. అర్థమైందా? ఏమి చేయను, బలహీనంగా ఉన్నాను.... ఇప్పుడు ఇలాంటి మాటలు నోటి నుండే కాదు, మనస్సులో సంకల్ప రూపంలో కూడా రాకూడదు. ఏ వ్యక్తి లేదా వాయుమండలం బలహీనం చేసినా కానీ అవ్వకూడదు. బలహీనం అవ్వకూడదు, ధృడంగా అవ్వాలి. అర్థమైందా? మరలా ఫిర్యాదు రాకూడదు. భట్టీ కంటే ముందు మీ పురుషార్ధం యొక్క ఫిర్యాదు తీశారా? ఏమిటి అది? నిర్భలత కారణంగా సాంగత్యదోషంలోకి రావటం. ఈ ఫిర్యాదుని సమాప్తం చేసుకుని వెళ్తున్నారా? ఇలాంటి ఏ సాంగత్యంలోకి రాకూడదు. మాయ ఈశ్వరీయ రూపంలో తన తోడుగా చేసుకోవటానికి ప్రయత్నిస్తే? చూడండి, మీ ప్రతిజ్ఞలను జ్ఞాపకం ఉంచుకోండి. సూక్తి ఉంది కదా - ఒకరే, ఒకని వారిగానే ఉంటాము, ఒకని మతం పైనే నడుస్తాము - ఇది సదా పక్కాగా ఉండాలి. ఈశ్వరీయ రూపంలో మాయ ఎలా వస్తుందో చాలా పరిశీలించుకోవటం అవసరం. పరిశీలనా శక్తిని ధారణ చేసి వెళ్తున్నారా? సదా ఇది అవినాశిగా ఉంచుకోండి. ఇప్పుడు ఫలితం చూస్తాను. అల్పకాలిక ఫలితాన్ని చూపకూడదు. సదాకాలిక మరియు సంపూర్ణ ఫలితాన్ని చూపించాలి. ఈ గ్రూపు వారు ప్రతిజ్ఞ కూడా చేశారు మరియు ధైర్యం కూడా పెట్టుకున్నారు. కానీ ఆ ప్రతిజ్ఞలను తొలగించుకోవటంలో మాయ మిమ్మల్ని బలహీనం చేస్తే ఏమి చేస్తారు? ప్రతిజ్ఞ అయితే చాలా మంచిగా చేశారు. కానీ ఎవరైనా బలహీనం చేస్తే అప్పుడు ఏమి చేస్తారు? స్వయమే బలహీనం అయిపోతే యుద్ధం ఎలా చేస్తారు?

సత్యం అని దేనిని అంటారు? తెలుసా? ఏ విషయం అయినా సంకల్పంలో అయినా వస్తే ఆ సంకల్పాన్ని కూడా దాచకూడదు. దానిని సత్యం అని అంటారు. పురుషార్ధం చేసి సఫలత పొందితే మీ సఫలత లేదా ఓటమి రెండింటి సమాచారం స్పష్టంగా చెప్పాలి. అది సత్యం. సత్యమైనవారు తమ ప్రతిజ్ఞను పూర్తి చేయగలరు. మంచిది.