15.04.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


త్రిమూర్తి తండ్రి యొక్క పిల్లల త్రిమూర్తి కర్తవ్యాలు.

త్రిమూర్తి తండ్రి యొక్క పిల్లలు మీరందరు కూడా త్రిమూర్తులే కదా! త్రిమూర్తియైన మూడు కర్తవ్యాలు చేస్తున్నారా? ఈ సమయంలో రెండు కర్తవ్యాలే చేస్తున్నారా లేక మూడూ చేస్తున్నారా? ఏ కర్తవ్యం చేస్తున్నారు? మూడు కర్తవ్యాలు వెనువెంట చేస్తున్నారా? త్రిమూర్తిగా అయితే అయ్యారు కదా? ప్రతీ కర్మ లేదా ఉత్పన్నం అయ్యే ప్రతీ సంకల్పాన్ని త్రికాలదర్శి అయ్యి కర్మలోకి తీసుకువస్తున్నారా? సదా మూడు కర్తవ్యాలు వెనువెంట జరుగుతాయి తప్పకుండా. ఎందుకంటే మీ పాత సంస్కారాలు లేదా స్వభావాలు లేదా వ్యర్థ సంకల్పాల యొక్క వినాశనం చేయకపోతే కొత్త రచన ఏవిధంగా జరుగుతుంది? మరియు కొత్త రచన ఏదయితే చేస్తారో దానిని పాలన చేయకపోతే అది ప్రత్యక్షంగా ఎలా కనిపిస్తుంది? కనుక త్రిమూర్తి తండ్రి యొక్క త్రిమూర్తి పిల్లలు మూడు కర్తవ్యాలు వెనువెంట చేస్తున్నారు. వికర్మలు లేదా వ్యర్థ సంకల్పాలను వినాశనం చేస్తున్నారు. ఇదయితే ఇప్పుడు మరింత వేగంగా చేయవలసి ఉంది. కేవలం మీ వ్యర్థ సంకల్పాలను, వికల్పాలను వినాశనం చేసుకోవటమే కాదు, ఎందుకంటే మీరు విశ్వకళ్యాణకారులు. అందువలన విశ్వంమంతటి వికర్మల భారాన్ని తేలిక చేయాలి. లేదా అనేకాత్మల వ్యర్ధ సంకల్పాలను సమాప్తం చేయాలి - ఇదే శక్తుల యొక్క కర్తవ్యం. వర్తమాన సమయంలో ఇదే వినాశన కర్తవ్యం మరియు దీంతో పాటు కొత్త శుద్ధ సంకల్పాల స్థాపన యొక్క కర్తవ్యం రెండూ పూర్తి శక్తివంతంగా జరగాలి. చాలా వేగవంతమైన యంత్రం ఉంటే దానిలో వేసిన వస్తువు యొక్క రూపం, రంగు, గుణం, కర్తవ్యం మొదలైనవన్నీ సెకండులో మారిపోతాయి. యంత్రంలో పడగానే మారిపోతుంది. అదేవిధంగా ఈ వినాశనం మరియు స్థాపన యొక్క యంత్రం చాలా వేగవంతం కానున్నది. ఆ యంత్రంలో పడగానే వస్తువు యొక్క రంగు రూపం ఎలా అయితే మారిపోతాయో అలాగే ఆత్మిక యంత్రం అయిన మీ ఎదురుగా ఎవరు వచ్చినా కానీ వస్తూనే వారి సంకల్పం, స్వరూపం, గుణం మరియు కర్తవ్యం మారిపోవాలి. ఇలాంటి యంత్రం ఇప్పుడు ప్రత్యక్షంగా నడవనున్నది. అందువలనే చెప్పాను - వినాశనం మరియు స్థాపన రెండు కర్తవ్యాలు వెనువెంట నడుస్తున్నాయని. ఇప్పుడు మరింత వేగంతో నడవనున్నాయి. మహాదానుల దగ్గర సదా బికారుల వరుస ఉంటుంది. అలాగే మీ అందరి దగ్గర కూడా బికారుల వరుస ఉండనున్నది. ప్రదర్శినికి జనం గుంపుగా వచ్చేస్తే మీరు ఏమి చేస్తారు? క్యూ పద్దతిలో క్లుప్తంగా సందేశం ఇచ్చేసి పంపించి వేస్తారు కదా! అప్పుడు రచన యొక్క జ్ఞానం ఇవ్వలేరు. రచయిత అయిన తండ్రి యొక్క పరిచయం మరియు సందేశం ఇవ్వగలరు అంతే. అదేవిధంగా బికారుల గుంపు ఉన్నప్పుడు కేవలం సందేశం మాత్రమే ఇవ్వగలరు. కానీ ఆ ఒక్క సెకను యొక్క సందేశం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఆ సందేశమే వారిలో సంస్కార రూపంలో నిండిపోతుంది. సర్వ ధర్మాత్మలు కూడా ఈ భిక్ష అడిగేటందుకు వస్తారు. క్రీస్తు కూడా బికారి రూపంలో ఉంటారని చెప్తారు కదా! అదేవిధంగా ధర్మపితలు కూడా మీ ఎదురుగా బికారుల రూపంలో వస్తారు. మరి వారికి ఏమి భిక్ష ఇస్తారు? ఈ సందేశమే. అది ఎంత శక్తివంతమైన సందేశం అంటే ఆ సందేశం యొక్క శక్తిశాలి సంస్కారం ద్వారానే ధర్మస్థాపన చేయటానికి నిమిత్తమవుతారు. ఆ సంస్కారం అవినాశి అయిపోతుంది. ఎందుకంటే అంతిమ సంపూర్ణ స్థితి సమయంలో మీ సంస్కారాలు కూడా అవినాశి సంస్కారాలుగా ఉంటాయి. ఇప్పుడు సంస్కారాలను అవినాశిగా తయారు చేసుకుంటున్నారు. అందువలన ఇప్పుడు మీరు ఎవరికైతే సందేశం ఇస్తున్నారో మరియు శ్రమిస్తున్నారో ఇప్పుడు అది సదాకాలికంగా వారిలో ఉండటం లేదు. కొంచెం సమయం ఉంటుంది తర్వాత ఢీలా అయిపోతుంది. కానీ అంతిమ సమయంలో మీ సంస్కారాలు అవినాశిగా ఉంటాయి. అవినాశి సంస్కారాల శక్తి కారణంగా వారికి కూడా ఎలాంటి శిక్షణ లేదా సందేశం ఇస్తారంటే వారి సంస్కారం కూడా అవినాశి అయిపోయేలాంటి సందేశం ఇస్తారు. ఇప్పుడు ఏమి పురుషార్థం చేయవలసి ఉంటుంది? సంస్కారాలను పరివర్తన చేసుకోవాలి, కానీ అవినాశి అనే ముద్ర కూడా వేసుకోవాలి. ప్రభుత్వం వారు సీల్ వేస్తారు కదా, దానిని ఎవరూ తెరవలేరు. అదేవిధంగా మీరు కూడా ఎలాంటి సీల్ వేయాలంటే అర్థకల్పం వరకు మాయ తెరవకూడదు. కనుక అవినాశి సంస్కారాన్ని తయారు చేసుకునే తీవ్ర పురుషార్థం చేయాలి. ఇది ఎప్పుడు అవుతుందంటే మాస్టర్ త్రికాలదర్శులై సంకల్పాన్ని కర్మలోకి తీసుకువచ్చినప్పుడు. ఏ సంకల్పం ఉత్పన్నం అయినా మొదట సంకల్పాన్నే పరిశీలన చేసుకోండి. నేను మాస్టర్ త్రికాలదర్శి స్థితిలో ఉన్నానా? ఆ స్థితిలో స్థితులై కర్మ చేస్తే ఏ కర్మ వ్యక్తం అవ్వదు. వికర్మ అనే విషయం అయితే లేనేలేదు. వికర్మల ఖాతా నుండి అతీతం అయిపోయారు. వికల్పాలు సమాప్తం కనుక వికర్మలు సమాప్తం. ఇప్పుడిక ఉన్నది వ్యర్ధ కర్మ మరియు వ్యర్ధ సంకల్పాల విషయం. ఈ వ్యర్థాన్ని మార్చుకుని సమర్థ సంకల్పం మరియు సమర్ధ కార్యం చేయాలి. దీనినే సంపూర్ణస్థితి అని అంటారు. ఇప్పుడు మహాదానిగా అయ్యారా? ఎన్ని రకాల దానాలు చేస్తున్నారు? రెండు రకాల దానాలా? లేక మూడు రకాలా లేక మూడు కంటే ఎక్కువా? (ప్రతీ ఒక్కరు తమన తమ ఆలోచన చెప్పారు.) ముఖ్యమైన మూడు దానాలు చెప్పండి. జ్ఞానదానం కూడా చేస్తున్నారు. యోగం ద్వారా శక్తుల దానం కూడా చేస్తున్నారు మరియు మూడవది కర్మ ద్వారా గుణాల దానం. 1. మనసాదానం 2. వాచా మరియు 3. కర్మ ద్వారా దానం. మనస్సు ద్వారా సర్వ శక్తుల దానం, వాణి ద్వారా జ్ఞాన దానం, కర్మ ద్వారా సర్వగుణాల దానం. రోజు మొదలవగానే మొదట ఈ ప్లాను తయారు చేసుకోండి - ఈరోజు ఈ మూడు దానాలను ఏ రూపంలో చేయాలి? మరియు రోజు అయిపోయిన తర్వాత పరిశీలించుకోండి - మేము మహాదాని అయ్యామా? మూడు రకాల దానాలు చేయాలి. ఎందుకంటే మూడు రకాల దానాలకి వేర్వేరు ప్రాలబ్ధం లేదా ప్రాప్తి ఉంది. భక్తిమార్గంలో కూడా ఎవరు ఏరకమైన దానం చేస్తారో వారికి ఆవిధమైన ప్రాప్తి లభిస్తుంది. అదేవిధంగా ఈ మహాన్ జీవితంలో కూడా ఎంత మరియు ఏ రకమైన దానం చేస్తారో అంత మరియు ఆవిధంగానే భవిష్యత్తు తయారవుతుంది. కేవలం భవిష్యత్తు కాదు, కానీ ప్రత్యక్షఫలం కూడా లభిస్తుంది. ఎవరైనా వాణి ద్వారా లేదా కర్మ ద్వారా దానం చేయటం లేదు, కేవలం మనసా దానం మాత్రమే చేస్తున్నారంటే వారికి వేరుగా ప్రాప్తి లభిస్తుంది. ఇప్పుడు మీరు కర్మ సిద్ధాంతాన్ని మంచిగా తెలుసుకున్నారు కదా! మూడు దానాలకు ప్రాప్తి వేర్వేరు. ఎవరైతే మూడు రకాల దానాలు చేస్తారో వారికి మూడింటి ప్రాప్తి ప్రత్యక్షంగా లభిస్తుంది. మీకు కర్మల గతి గురించి తెలుసు కదా! అయితే చెప్పండి, మనస్సు ద్వారా దానం చేసిన దానికి ఫలం ఏమిటి? మనసా మహాదాని అయిన వారికి ప్రత్యక్షఫలంగా లభించేది ఏమిటంటే వారు తమ మనస్సుపై అనగా సంకల్పాలపై ఒక్క సెకనులో విజయీ అవుతారు అంటే వారికి సంకల్పాలపై విజయీ అయ్యే శక్తి ప్రాప్తిస్తుంది. మరియు ఎవరు ఎంత చంచల సంకల్పాలు కలవారు అయినా కానీ, ఒక్క సెకను కూడా తమ మనస్సు యొక్క సంకల్పాలని స్థిరం చేయలేని వారు అయినా కానీ అలాంటి చంచల సంకల్పాలు గలవారిని కూడా తమ విజయీ శక్తితో తాత్కాలికంగా శాంతిగా లేదా చంచలత నుండి అచంచలంగా తయారు చేయగలరు. మామూలుగా కూడా దు:ఖంతో బాధపడుతున్నవారికి ఇంజక్షన్ ద్వారా మత్తు ఇస్తారు కదా! దాని ద్వారా వారి దు:ఖం యొక్క చంచలత సమాప్తం అవుతుంది. అదేవిధంగా మనస్సు ద్వారా మహాదానిగా అయ్యేవారు తమ దృష్టి, వృత్తి మరియు స్మృతి యొక్క శక్తితో వారిని శాంతి యొక్క అనుభవీగా చేయగలరు. కానీ తాత్కాలిక సమయం కొరకు మాత్రమే. ఎందుకంటే వారికి తమ పురుషార్ధం యొక్క శక్తి ఉండదు. ఆ మహాదానుల శక్తితో కొద్ది సమయం కొరకు అనుభవం చేసుకుంటారు. ఎవరైతే మనసా మహాదానిగా ఉంటారో వారి సంకల్పానికి ఎంత శక్తి ఉంటుందంటే సంకల్పం చేశారంటే సిద్దించేస్తుంది. అనగా మనసా మహాదానులు సంకల్ప సిద్ధి పొందేవారిగా ఉంటారు. వీరు ఎక్కడ కావాలంటే అక్కడ తమ సంకల్పాలను స్థిరం చేయగలరు. సంకల్పాలకు వశం అవ్వరు. కానీ సంకల్పాలే వారికి వశం అవుతాయి. సంకల్పాలను రచించాలంటే రచించగలరు, సంకల్పాలను వినాశనం చేయాలంటే చేయగలరు. ఈ విధంగా మహాదాని అయిన వారిలో సంకల్పాలను రచించే మరియు వినాశనం చేసే మరియు పాలన చేసే మూడు శక్తులూ ఉంటాయి. ఇది మనస్సు ద్వారా మహాదానం. అదేవిధంగా వీరిలో మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. అర్థమైందా!

వీరు మాస్టర్ సర్వశక్తివంతులు అయ్యారు మరియు ఇక వాచా ద్వారా మహాదాని అయిన వారికి ఏమి లభిస్తుంది? వీరు మాస్టర్ జ్ఞాన సాగరులు. వీరి ఒకొక్క మాటకి చాలా విలువ ఉంటుంది. ఒక రత్నం యొక్క విలువ అనేక రత్నాల విలువ కంటే ఎక్కువగా ఉంటుంది. వాచా ద్వారా మీరు రత్నాలను దానం చేస్తున్నారు కదా! కనుక ఎవరైతే జ్ఞాన రత్నాలను దానం చేస్తారో వారి యొక్క ఒకొక్క రత్నానికి ఎంత విలువ ఉంటుందంటే వారి యొక్క ఒకొక్క మాట వినడానికి అనేకాత్మలు దాహంతో ఉంటాయి. దప్పికతో ఉన్న అనేకాత్మల దప్పికను తీర్చే విధంగా ఉంటుంది, వారి యొక్క ఒకొక్క వచనం. వీరు మాస్టర్ జ్ఞాన సాగరులు మరియు విలువైనవారు మరియు సారయుక్తులు కూడా. వారి యొక్క ఒక్కొక్క మాటలో సారం నిండి ఉంటుంది. సారం లేకుండా ఏ మాట ఉండదు. ఇలా సారయుక్తంగా మాట్లాడిన వారిని వీరు చాలా తెలివైనవారు అని అంటారు. మాట ద్వారా మన తెలివి తెలుస్తుంది. కనుక సారం మరియు తెలివి రెండు ఉంటాయి. ఇవి లక్షణాలు. మరి ప్రాప్తి ఏమిటి? వాచా ద్వారా దాని అయిన వారికి విశేషంగా 1. సంతోషం ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ధనాన్ని చూసి హర్షితం అవుతారు కదా! మరియు 2. వీరు ఎప్పుడూ కూడా అసంతుష్టం అవ్వరు. ఎందుకంటే ఖజానా నిండుగా ఉంటుంది. కనుక ఏ వస్తువు లోటుగా ఉండదు. కనుక సదా సంతుష్టంగా మరియు హర్షితంగా ఉంటారు. వీరి యొక్క ఒకొక్క మాట బాణం వలె తగులుతుంది. ఎవరికి ఏది చెప్తే అది వారికి తగులుతుంది. వారి మాట ప్రభావశాలిగా ఉంటుంది. వాణి ద్వారా దానం చేయటం ద్వారా వాణిలో చాలా గుణాలు వస్తాయి. స్థితిలో సంతోషం స్వతహాగానే ప్రాప్తిస్తుంది. ఖజానా నుండి తీసుకుంటూ ఉంటే తరగకుండా వస్తూనే ఉంటుంది కదా! అవిధంగా వీరికి లోపల నుండి సంతోషం అనేది స్వతహాగానే లభిస్తూ ఉంటుంది. అది వరదానం రూపంలో ప్రాప్తిస్తుంది. సంతోషం కోసం పురుషార్ధం చేయలేదు. పురుషార్ధం అయితే వాణి ద్వారా దానం చేయటం అనేది చేశారు. మరయితే ప్రాప్తిగా సంతోషం లభించింది.

ఇక కర్మ ద్వారా గుణాలను దానం చేస్తే ఏ మూర్తిగా అయిపోతారు? ఫరిస్తా. కర్మ అనగా గుణాలను దానం చేయటం ద్వారా నడవడిక మరియు ముఖము రెండూ ఫరిస్తా వలె కనిపిస్తాయి. రెండు రకాలుగా లైట్ గా ఉంటారు, అనగా ప్రకాశమయంగా మరియు తేలికగా భారాన్ని అనుభవం చేయరు. ఏదో శక్తి నడిపిస్తున్నట్లు ఉంటారు. ప్రతీ కర్మలో బాబా సహాయాన్ని అనుభవం చేసుకుంటారు. ప్రతీ కర్మలో సర్వుల ద్వారా వరదానం ప్రాప్తిస్తున్నట్లు అనుభవం చేసుకుంటారు. ప్రతీ కర్మ ద్వారా మహాదానిగా అయ్యేవారు సర్వుల ఆశీర్వాదాలకి పాత్రులు అవుతారు. కనుక జీవితంలో సర్వ వరదానాలు ప్రాప్తించినట్లు అనుభవం చేసుకుంటారు. శ్రమతో కాదు, వరదానం రూపంలో, కర్మ ద్వారా దానం చేసేవారు 1. ఫరిస్తా వలె కనిపిస్తారు. 2.స్వయాన్ని సర్వ వరదానిమూర్తిగా అనుభవం చేసుకుంటారు. ఇప్పుడు స్వయాన్ని పరిశీలించుకోండి - ఏ దానం అయినా చేయటంలో లోపం లేదు కదా? మూడు దానాలు చేస్తున్నారా? మూడింటి లెక్క ఏదో రూపంలో పూర్తి చేసుకోవాలి. దీనికి పద్దతిని మరియు అవకాశాన్ని వెతకండి. అవకాశం లభిస్తే చేస్తాం అని అనకండి. అవకాశం తీసుకోవాలి, అంతేకానీ అవకాశం లభిస్తే చేస్తాం అనటం కాదు. ఈవిధంగా మహాదాని అవ్వటం ద్వారా కాంతిగోళం వలె కనిపిస్తారు. మీ మస్తకం ద్వారా కాంతిగోళం కనిపిస్తుంది. మీ నడవడిక ద్వారా, మాట ద్వారా జ్ఞాన శక్తి యొక్క ప్రకాశం కనిపిస్తుంది. అనగా బీజం కనిపిస్తుంది. మీరు మాస్టర్ బీజరూపులు కదా! ఇలా ప్రకాశము మరియు శక్తి యొక్క గోళం వలె కనిపించేవారు సాక్షాత్తు మరియు సాక్షాత్కారమూర్తిగా అవుతారు. అర్ధమైందా?

ఇక్కడ ఈ హాలులో లైట్ మరియు మైట్ రెండింటి గోళం ఉన్న చిత్రం ఏదైనా ఉందా? (కొందరు అన్నారు - లక్ష్మీనారాయణుల చిత్రం, కొందరు అన్నారు - బ్రహ్మాబాబా) చూడండి. చిత్రాన్ని చూడటంతోనే ముఖం ఎలా మారిపోతుందో! మీరు కూడా ఇలాంటి చైతన్య చిత్రంగా అవ్వండి, చూడగానే అందరి చరిత్ర మరియు ముఖకవళికలు మారిపోవాలి. ఇలా తయారవ్వాలి. మరియు తయారవుతున్నారు కూడా. వరదాన భూమికి రావటం అంటే వరదానానికి అధికారి అవ్వటం, యాత్రకి వెళ్లారు కదా! ఎందుకు వెళ్లారు? (పాపాలు పోతాయని) ఆ భూమిలో విశేషత ఉంటుంది కనుకనే వెళ్తారు కదా! అలాగే ఈ భూమిలో ఏ విశేషత ఉంది? ఇది వరదాని భూమి. కనుక వరదానం అయితే ప్రాప్తిస్తుంది కదా! అడగవలసిన అవసరం లేదు. కనుక ఈ రోజు నుండి అడగటం సమాప్తం చేసి స్వయాన్ని అధికారిగా భావించండి. మంచిది.