త్యాగము తపస్సు మరియు సేవ యొక్క పరిభాష.
ఈరోజు భట్టీని ప్రారంభించేటందుకు పిలిచారు. సర్వగుణ
ధారణా మూర్తులు మరియు సంపూర్ణ ఙ్ఞానమూర్తులు అయ్యేటందుకు ఈ భట్టీకి వచ్చారు.
అందువలన ముఖ్యంగా మూడు విషయాలు ధ్యాసలో ఉంచుకోవాలి. అవి ఏవి? ఏ మూడు విషయాల
ద్వారా సంపూర్ణ జ్ఞానమూర్తిగా , సర్వగుణ మూర్తిగా తయారయ్యి వెళ్తారు?
జ్ఞానమంతటి సారం ఆ మూడు మాటల్లో నిండి ఉంది. అవి ఏవి? 1. త్యాగం 2. తపస్సు
మరియు 3. సేవ. ఈ మూడింటి ధారణామూర్తులుగా అవ్వటం అంటే సంపూర్ణ జ్ఞానమూర్తిగా
మరియు సర్వ గుణమూర్తిగా అవ్వటం. త్యాగం అని దేనిని అంటారు? నిరంతర త్యాగ వృత్తి
మరియు తపస్వి మూర్తిగా తయారయ్యి ప్రతీ సెకను, ప్రతీ సంకల్పం ద్వారా ప్రతీ
ఆత్మకి సేవ చేయాలి. ఇది నేర్చుకునేటందుకే భట్టీకి వచ్చారు. మామూలుగా అయితే
త్యాగము మరియు తపస్సు రెండింటి గురించి మీకు తెలుసు అయినా కానీ ఇప్పుడు దేని
కోసం వచ్చారు? (వాటిని కర్మలోకి తీసుకువచ్చేటందుకు) వీటి గురించి మీకు తెలుసు.
కానీ ఇప్పుడు తెలుసుకున్న దాని అనుసారంగా నడవాలి. ఈ రెండింటినీ సమానంగా
చేసుకునేటందుకు వచ్చారు. ఇప్పుడు తెలుసుకోవటం మరియు నడచుకోవటం రెండింటిలో తేడా
ఉంది. ఆ తేడాను సమాప్తం చేసుకునేటందుకు భట్టీకి వచ్చారు. మీ త్యాగం మరియు
తపశ్శక్తి యొక్క ఆకర్షణ దూరం నుండే కనిపించాలి. స్థూలమైన అగ్ని లేదా ప్రకాశం
లేదా వేడి దూరం నుండే కనిపిస్తాయి లేదా అనుభవం అవుతాయి. మీ యొక్క తపస్సు మరియు
త్యాగం యొక్క మెరుపు దూరం నుండే ఆకర్షించాలి. ప్రతీ కర్మలో త్యాగం మరియు తపస్సు
ప్రత్యక్షంగా కనిపించాలి. అప్పుడే సేవలో సఫలత పొందగలరు. కేవలం సేవాధారి అయ్యి
సేవ చేయటం ద్వారా ఏదైతే సఫలతను మీరు కోరుకుంటున్నారో అది రావటం లేదు. కానీ
సేవాధారిగా అవ్వటంతో పాటు త్యాగం మరియు తపస్విమూర్తిగా కూడా ఉండాలి. అప్పుడే
సేవ యొక్క ప్రత్యక్షఫలం కనిపిస్తుంది. మీరు చాలా మంచి సేవాధారులే కానీ సేవ చేసే
సమయంలో త్యాగము మరియు తపస్సును మర్చిపోకూడదు. ఈ మూడు వెనువెంట ఉండటం ద్వారా
శ్రమ తక్కువ మరియు ప్రాప్తి అధికంగా ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ సఫలత
లభిస్తుంది. కనుక రెండింటినీ జత కలపాలి. ఈ విషయాన్ని బాగా అభ్యసించి వెళ్ళాలి.
ఎంత జ్ఞాన సాగరులో అంతగానే శక్తిశాలిగా మరియు విజయీలుగా అవ్వాలి. జ్ఞాన
సాగరులకి గుర్తు ఏమిటంటే వారి యొక్క ఒకొక్క మాట శక్తివంతంగా ఉంటుంది మరియు
ప్రతీ కర్మ విజయవంతంగా ఉంటుంది. ఒకవేళ ఈ రెండు ఫలితాలు తక్కువగా
కనిపిస్తున్నాయంటే ఇంకా జ్ఞానసాగరులుగా తయారవ్వాలని భావించండి. ఈ రోజుల్లో
ఆత్మల ద్వారా అర్ధ జ్ఞానాన్ని ఏదైతేనే ప్రాప్తింప చేసుకుంటున్నారో వారికి కూడా
అల్పకాలికంగా సఫలత ప్రాప్తిస్తున్నట్లు అనుభవం అవుతుంది. కానీ మీరు సంపూర్ణ
శ్రేష్ట జ్ఞానం యొక్క ప్రాప్తిని ప్రత్యక్షంగా పొందినట్లు ఇప్పుడే అనుభవం
చేసుకోవాలి. అంతేకానీ ఈ జ్ఞానానికి ప్రాప్తి భవిష్యత్తులో ఉంటుంది అని
భావించకూడదు. ఈ సమయంలో జ్ఞానం ద్వారా లభించే ప్రాప్తి ఏమిటంటే మీ పురుషార్ధంలో
సఫలత మరియు సేవలో సఫలత అనుభవం అవుతాయి. సఫలత ఆధారంగా మీకు ఎంత జ్ఞానం ఉందో
తెలిసిపోతుంది, ఎంత వరకు జ్ఞాన సాగరులు అయ్యారో అది పరిశీలన చేసుకునేటందుకు
మరియు పరిశీలన చేయించుకునేటందుకు భట్టీకి వచ్చారు. ఏ పాత సంకల్పము లేదా
సంస్కారము కనిపించకూడదు. అంత త్యాగం నేర్చుకోవాలి. మస్తకము అనగా బుద్ధి యొక్క
స్మృతి లేదా మీ దృష్టి ద్వారా కేవలం ఆత్మ స్వరూపం తప్ప మరేదీ కనిపించకూడదు లేదా
స్మృతిలోకి రాకూడదు. అలాంటి నిరంతర తపస్విగా తయారవ్వాలి. ఎలాంటి స్వభావ
సంస్కారం కలిగినవారు అయినా కానీ రజోగుణి లేదా తమోగుణి ఆత్మ అయినా కానీ, స్వభావ
సంస్కారాలకి వశమై ఉన్నా కానీ, మీ యొక్క పురుషార్ధంలో పరీక్షగా అవ్వటానికి
నిమిత్తమైనా కానీ ప్రతీ ఆత్మ పట్ల సేవ అనగా కళ్యాణం యొక్క సంకల్పం లేదా భావన
ఉత్పన్నమవ్వాలి. ఈ విధంగా సర్వాత్మలకి సేవాధారి అనగా కళ్యాణకారి అవ్వాలి. ఏమి
త్యాగం చేయాలో, ఏమి తపస్సు చేయాలో మరియు ఎంత వరకు సేవ చేయాలో ఇప్పుడు
అర్ధమైందా! వీటి యొక్క మహీనతను ఇప్పుడు అనుభవం చేసుకోండి. ఈ పురుషార్ధంలో ఎవరు
ఫలిభూతం కాగలరంటే ఎవరిలో జ్ఞానం మరియు యోగం యొక్క ఫలం ఉంటుందో వారే కాగలరు.
ఇప్పుడు అందరి ముందు బ్రహ్మకుమారులుగా ప్రసిద్ధి అవుతున్నారు. వీరు
బ్రహ్మకుమారులు అని దూరం నుండే తెలిసిపోతుంది. కానీ బ్రహ్మకుమారులతో పాటు
తపస్వికుమారులుగా కూడా దూరం నుండే కనిపించాలి. ఆవిధంగా తయారయ్యి వెళ్ళాలి. అది
ఎప్పుడు జరుగుతుందంటే మననము మరియు మగ్నము; రెండింటిని అనుభవం చేసుకున్నప్పుడు.
స్థూల మత్తులో ఉన్నవారి నడవడిక లేదా ముఖము ద్వారా
వీరు నషాలో ఉన్నారని తెలిసిపోతుంది. అదేవిధంగా మీ యొక్క నడవడిక మరియు ముఖము
ద్వారా వీరు ఈశ్వరీయ నషాలో మరియు నారాయణత్వ నషాలో ఉన్నారని తెలియాలి. ముఖమే మీ
పరిచయాన్ని ఇవ్వాలి. ఎవరినైనా కలుసుకున్నప్పుడు మీ పరిచయ కార్డుని ఇస్తారు కదా!
అదేవిధంగా మీ ముఖమే పరిచయ కార్టువలె పనిచేయాలి. అర్ధమైందా! ఇప్పుడు గుప్త ధారణా
రూపాన్ని కలిగి ఉండటం కాదు. కొందరు భావిస్తున్నారు - జ్ఞానం గుప్తం, బాబా
గుప్తం కనుక ధారణ కూడా గుప్తమే అని. ఙ్ఞానం గుప్తం, బాబా గుప్తం కానీ మీ ధారణలు
మాత్రం గుప్తంగా ఉండవు. కనుక ధారణలను ప్రాప్తులను ప్రత్యక్ష రూపంలో చూపించండి,
అప్పుడే ప్రత్యక్షత జరుగుతుంది. విశేషంగా కుమారులలో ఒక సంస్కారం ఉంటుంది, అది
పురుషార్థంలో విఘ్న రూపంగా అవుతుంది. అది ఏ సంస్కారం? కోరికలను పూర్తి
చేసుకునేటందుకు కొన్ని సంస్కారాలను మిగుల్చుకుంటారు కుమారులు. జేబు ఖర్చు కోసం
కొంచెం ధనం దాచుకున్నట్లుగా, రాజ్యం అయితే పోయింది కానీ కోశాధికారం మాత్రం
రాజులు వదల్లేదు అన్నట్లు. ఆవిధంగా సంస్కారాలను ఎంత సమాప్తం చేసుకున్నా, కానీ
జేబు ఖర్చుల కోసం ఎంతో కొంత ప్రక్కకు పెట్టుకుంటారు. ఇదే ముఖ్య సంస్కారం.
భట్టీకి వచ్చి ఇది కూడా తెలుసుకున్నారు మరియు నడిచే ధైర్యాన్ని కూడా ధారణ
చేస్తున్నారు. కానీ మాయ కోశాగారంలో ఎక్కడో అక్కడ మిగిలి ఉంటుంది. అర్ధమైందా! ఈ
భట్టీలో అన్నింటినీ త్యాగం చేసి వెళ్ళాలి. సంపూర్ణంగా అయితే అంతిమంలో అవుతాము,
అంతవరకు ఎంతో కొంత ఉంటూనే ఉంటాయి అని ఎప్పుడూ అనుకోకండి. అర్ధమైందా? సంస్కారాలు
కొంచెం అయినా మిగిలి ఉంటే అవి కూడా మోసం చేస్తాయి. అందువలన పాత ఆస్తి ఏదయితే
ఉందో దానిని పూర్తిగా భస్మం చేసేసి వెళ్ళాలి. దాచి పెట్టుకోకూడదు. అర్థమైందా?
మంచిది. ఇది కుమారుల గ్రూపు. ఇప్పుడు తపస్వి కుమారుల గ్రూపుగా తయారవ్వాలి. ఈ
గ్రూపులో ఈ విశేషత అందరికీ కనిపించాలి - తపస్వి భూమి నుండి తపస్వి కుమారులు
వచ్చారని అనుకోవాలి. అర్థమైందా? ప్రతి ఒక్కరు ప్రకాశ కిరీటధారులుగా కనిపించాలి.
కిరీటధారిగా అయితే భవిష్యత్తులో అవుతారు. కానీ ఈ భట్టీ నుండి ప్రకాశకిరీటధారులై
వెళ్ళాలి. ఈ కిరీటం ద్వారా సేవాభాద్యతను కిరీటం స్వతహాగానే ప్రాప్తిస్తుంది.
కనుక ఈ ప్రకాశ కిరీటాన్ని ధారణ చేయాలని విశేష ధ్యాస పెట్టండి. అర్థమైందా?
తపస్విలు సదా ఆసనంపై కూర్చుని ఉంటారు. అదేవిధంగా మీరు సదా ఏకరస స్థితి అనే
ఆసనంపై విరాజమానమై ఉండండి. ఈ ఆసనాన్ని వదలకండి, అప్పుడే సింహసనం లబిస్తుంది.
మిమల్ని చూడగానే అందరి నోటి నుండి ఒకే మాట రావాలి - ఈ కుమారులు తపస్వి కుమారులై
వచ్చారని, ప్రతీ కర్మేంద్రియం యొక్క దేహాభిమానాన్ని త్యాగం చేయాలి మరియు
ఆత్మాభిమానం యొక్క తపస్సు ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. ఎందుకంటే బ్రహ్మ యొక్క
స్థాపన కార్యం అయితే జరుగుతూ ఉంది. ఈశ్వరీయ పాలన యొక్క కర్తవ్యం కూడా జరుగుతూ
ఉంది. ఇప్పుడు తపస్సు ద్వారా మీ వికర్మలను మరియు ప్రతీ ఆత్మ యొక్క తమోగుణాన్ని
మరియు ప్రకృతి యొక్క తమోగుణ సంస్కారాలను భస్మం చేసుకునే కర్తవ్యం చేయాలి. ఈ
సమయం ఏ కరవ్యం కోసమో ఇప్పుడు అర్థమైందా? తపస్సు ద్వారా తమోగుణాన్ని భస్మం చేసే
సమయం. మీ చిత్రాలలో శంకరుని రూపం వినాశనకారిగా అనగా తపస్వి రూపాన్ని చూపిస్తారు
కదా! ఆవిధంగా ఏకరస స్థితి అనే ఆసనంపై స్థితులై మీ తపస్వి రూపాన్ని ప్రత్యక్షంగా
చూపించండి. అర్థమైందా ఏమి నేర్చుకోవాలో మరియు ఏవిధంగా అవ్వాలో? దీని కొరకు ఈ
కుమారుల గ్రూపు ఏ స్లోగన్ని ఎదురుగా పెట్టుకుంటారు; దాని ద్వారా సఫలత లభించాలి.
సత్యత మరియు స్వచ్చత ద్వారా సృష్టిలోని వికారాలను శుభ్రం చేస్తాము. సృష్టిలో
చేస్తున్నారంటే స్వయంలో అయితే అంతకంటే ముందే అయిపోయింది. కనుకనే సృష్టిలో
చేస్తున్నారనే కదా అర్ధం. కనుక ఈ స్లోగన్ని స్మృతిలో పెట్టుకోవటం ద్వారా తపస్వి
మూర్తిగా అవ్వటం ద్వారా సఫలతామూర్తిగా అవుతారు. అర్థమైందా? మంచిది.