04.07.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


స్మృతి యొక్క సహజ విధి.

ఇక్కడ కూర్చున్నవారందరూ ఏ స్థితిలో స్థితులై ఉన్నారు? ఈ సమయంలో మీ స్మృతి యొక్క స్థితి ఏవిధంగా ఉంది? డబల్ స్మృతి ఉందా లేక సింగిల్ స్మృతి ఉందా? ఈ సమయంలో ఉన్న ఈ స్థితిని కర్మాతీత స్థితి లేదా ఫరిస్తా స్థితి అని అనవచ్చా? అవ్యక్త స్థితి తప్ప మరే స్థితి అయినా ఉందని భావించేవారు చేయి ఎత్తండి. రోజంతటిలో ఇదేవిధంగా అవ్యక్త స్థితిలో స్థితులై కర్మ చేయగలరా? (లేదు) ఇప్పుడు మీరు వ్రాసుకుంటున్నారు, ఇది కూడా కర్మయే కదా! ఇలా కర్మ చేస్తూ ఈ స్థితిలో ఉండలేరా? (ఇప్పుడు బాబా ఎదురుగా ఉన్నాము కనుక) సదా బాబా మా తోడుగా ఉన్నారు. లేదా మా ఎదురుగా ఉన్నారు అని భావిస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి వాయుమండలం తయారు చేయటంపై విశేష ధ్యాస పెట్టినట్లయితే ఆ ధ్యాసయే మీ రక్షణా సాధనం అవుతుంది. సాదారణ కర్మ చేస్తూ కానీ మధ్యమధ్యలో అవ్యక్త స్థితిని తయారుచేసుకోవటంపై ధ్యాస పెట్టాలి మరియు ఏ కార్యం చేస్తున్నా కానీ సదా బాబాని మీ తోడుగా భావించి డబల్ శక్తితో ఆ కార్యం చేస్తే ఎలాంటి స్థితి ఉంటుంది? 1. స్మృతి చాలా సహజం అయిపోతుంది, ఇప్పుడు ఎదురుగా ఉన్నారు. కనుక స్మృతి సహజంగా ఉంది కదా! అదేవిధంగా సదా ప్రతీ కర్మలో బాబాని మీ తోడుగా భావించి నడిచినట్లయితే బాబా స్మృతి సహజంగా ఉండదా? సదా మన వెంటే ఉండేవారు ఎవరైనా ఉంటే వారు వెంట ఉంటారు. కనుక వారి స్మృతి సహజంగా ఉంటుంది. అదేవిధంగా సదా బాబాని తోడుగా పెట్టుకోవటం ద్వారా లేదా బుద్ధికి నిరంతరం సత్ సాంగత్యం ఉండటం ద్వారా నిరంతర సత్సగం అయిపోతుంది. మీరు సత్సంగులు కదా! ప్రతీ సెకను, ప్రతీ అడుగు సత్యం యొక్క సాంగత్యంలో ఉండేవారు. ఈ విధంగా నిరంతరం స్వయాన్ని సత్సంగిగా తయారు చేసుకుంటే స్మృతి సహజంగా ఉంటుంది మరియు శక్తిశాలి సాంగత్యం కారణంగా ప్రతీ కర్తవ్యంలో మీకు డబల్ శక్తి ఉంటుంది. డబల్ శక్తి ఉన్న కారణంగా మీ స్థితిని అనుసరించి ఏ కార్యం అయితే మీకు కష్టమనిపిస్తుందో అది మీకు సహజం అయిపోతుంది, ఎందుకని? డబల్ శక్తి ఉంది కనుక. ఒకే సమయంలో ఒక కర్తవ్యానికి బదులు రెండు కర్తవ్యాలు పూర్తి చేసేస్తారు. ఈ విధంగా 1. సహజ స్మృతి 2. సఫలత 3. సర్వ కర్మలలో ఉత్సాహ ఉల్లాసాలు మరియు సహయోగం ప్రాప్తిస్తాయి. అందువలన నిరంతర సత్సంగిగా అవ్వండి. మీ దగ్గరకి ఎవరైనా వస్తే వారికి నియమం చెప్తారు కదా - సదా సత్ సాంగత్యంలో ఉండడని. ఈ అభ్యాసం మీరు కూడా నిరంతరం చేయవలసి ఉంటుంది. స్మృతి కష్టమనిపిస్తుంది కదా! స్మృతి ఎలా నిలబడుతుంది? స్మృతి ఎక్కడ కుదురుతుంది? దీని ద్వారా ఇవన్నీ సమాప్తం అయిపోతాయి. అంతేకాదు కర్మలో సహజ సిద్ధి లభిస్తుంది. నిరాకారి రూపం యొక్క సాంగత్యంలో ఉండండి లేదా సాకార రూపం యొక్క సాంగత్యంలో ఉండండి. ఏదైనా కానీ సత్యం యొక్క సాంగత్యంలో ఉండాలి. సాకారునితో సంబంధం అనేది కల్పమంతటిలో అవినాశిగా ఉంటుంది కదా! కనుక సాకారి స్మృతి లేదా నిరాకారి స్మృతి అయినా కానీ స్మృతి మాత్రం తప్పకుండా ఉండాలి. బాప్ దాదా యొక్క సాంగత్యం తప్ప బుద్ధికి మరే సాంగత్యం ఉండకూడదు. ఫరిస్తాగా అయ్యేటందుకు బాబాతో ఏదైతే సంబంధం ఉందో దానిని పక్కా చేసుకోవాలి. బాబాతో సంబంధం పక్కాగా ఉంటే ఫరిస్తాగా అయిపోతారు. కనుక ఇప్పుడు కేవలం ఈ సంబంధాన్ని పక్కా చేసుకోండి. ఒకనితోనే సర్వ సంబంధాలు ఉన్నట్లయితే మీరు సహజ మరియు సదా ఫరిస్తా. బుద్ధి వెళ్ళేటందుకు ఏ మార్గం అయినా మిగిలి ఉందా? సర్వ సంబంధాలు బాబాతోనే కదా! మార్గాలన్నీ మూసేశారు కదా! మార్గాలన్నీ మూసివేయబడినప్పుడు ఇక బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? ఒకే మార్గం మరియు ఒకనితోనే సంబంధం. అప్పుడిక మీరు ఫరిస్తాగా అయిపోతారు. కనుక పరీశీలించుకోండి - ఏ మార్గమైనా, ఏ సంబంధమైనా ఇప్పటి వరకు పూర్తిగా సమాప్తి అవ్వలేదా? కొంచెం అయినా మార్గం తెరిచి ఉంటే ప్రజలు ఆ మార్గం నుండి వెళ్ళిపోవటానికి ప్రయత్నిస్తారు. పూర్తిగా మూసేస్తే ఇక వెళ్ళనే వెళ్లరు. ఏదైనా అడ్డు పెట్టినా కూడా దానిని తాకుతూ మరీ వెళ్ళిపోతారు. ఇక్కడ కూడా కొంచెమైనా మార్గం తెరిచి ఉన్నట్లయితే బుద్ది అటువైపు వెళ్ళిపోతుంది. ఇప్పుడు అన్నింటినీ ఎలా మూసి వేస్తారు? మార్గాలన్నింటినీ మూసివేసే సహజమైన యుక్తి చాలాసార్లు చెప్తూ ఉన్నాను. మీరు మురళీలో కూడా వింటూంటారు, గుర్తుందా? విస్మృతికి బదులు స్మృతిలో ఉండే యుక్తి ఏమిటి? ఒకే చిత్రం. దానిలో బాప్ దాదా కూడా వస్తారు మరియు వారసత్వం కూడా వస్తుంది. ఆ చిత్రాన్ని సదా ఎదురుగా పెట్టుకోండి. అప్పుడు మార్గాలన్నీ మూసివేయబడతాయి. చిత్రాలు లేదా సాహిత్యం మొదలైనవి ఏవైతే మీరు ముద్రిస్తూ ఉంటారో వాటికి ఒక బ్లాకు (శివబాబా ముద్ర) ఉంటుంది. అదేవిధంగా మీరు ముద్రించే ఆ బ్లాకుని బుద్ధిలో పెట్టుకున్నా చాలు, మార్గాలన్నీ బంద్ అవ్వవా? ఇది సహజమైన యుక్తి. మరొక గమ్యం కూడా ఇవ్వబడింది. ఇదయితే మీరు రోజూ మురళీలో వింటూంటారు. ఈ యుక్తి లేని మురళీ ఉండదు. చాలా సహజమైనది. ఈ చిత్రాన్ని గుర్తు పెట్టుకోండి అని చిన్న పిల్లలకి చెప్పినా కూడా గుర్తు పెట్టుకుంటారు. బ్యాడ్జి పెట్టుకుంటున్నారు, కానీ ఇప్పుడు బుద్ధిలో స్మృతి స్వరూపంగా అవ్వండి. ఈ ఒక్క చిత్రం యొక్క స్మృతి ద్వారా అన్ని స్మృతులు వచ్చేస్తాయి. జ్ఞానమంతటి సారం కూడా ఈ ఒక్క చిత్రంలో నిండి ఉంది. రచయిత మరియు రచన యొక్క జ్ఞానం ద్వారా ఈ ప్రాప్తి లభించింది అని చెప్పవచ్చు. ఈ సహజ యుక్తులను మీరు ఎంత ఉపయోగిస్తూ ఉంటారో అంతగా మీ శ్రమ సహజం అయిపోతూ ఉంటుంది. స్మృతి అని దేనిని అంటారు? ఏమి స్మృతి చేయాలి? ఇది స్మృతియో కాదో తెలియదు.... ఇలా అయోమయం అవ్వకండి. అమాయకత్వంతో మిమ్మల్ని మీరు అయోమయం చేసుకుంటున్నారు. స్మృతి అంటే ఏమిటి? బాబా యొక్క స్మృతి లేదా బాబా యొక్క కర్తవ్యం యొక్క స్మృతి, బాబా యొక్క గుణాల స్మృతి .... ఇదంతా స్మృతియే కదా! రూపం గుర్తున్నా, నామం గుర్తున్నా, కర్తవ్యం గుర్తున్నా, గుణం గుర్తున్నా... అంతా స్మృతియే కదా! మీరు చాలా కష్టంగా చేసుకుంటున్నారు. స్మృతి కోర్సుని కష్టంగా చేసుకోవటం వలన శక్తి రావటం లేదు. కోర్సులోనే ఉండిపోతున్నారు, ఫోర్సు రావటం లేదు. కనుక స్మృతిని సహజం చేసుకోండి. బాబా తప్ప ఇంకేదైనా ఉందా! ప్రత్యక్షంలో సర్వ స్నేహిగా బాబానే భావించినప్పుడు మరి ఆయనను స్మృతి చేయడానికి ఏదైనా ప్లాన్ ఆలోచించాలా? సహజమైన విషయాన్ని అప్పుడప్పుడు కొందరు కష్టం చేసుకుంటున్నారు. ఎక్కడో అక్కడ ఇప్పటి వరకు కూడా మార్గం తెరిచి ఉంది. అందువలనే మాటిమాటికీ బుద్ధి శ్రమ పడి తిరిగి రావలసి వస్తుంది. దీంట్లో అలసిపోతున్నారు, తల బరువు అయిపోతుంది. కష్టం కష్టం అని అనుకుంటూ కష్టంలో పడిపోతున్నారు. కనుక సహజమైన పద్దతి ఏమిటంటే మొదట ఈ మార్గాలన్నింటిని మూసివేయండి. ఈ మార్గం మూసివేయబడింది. అని ప్రభుత్వం వారు ప్రకటిస్తారు కదా! అదేవిధంగా మీ కోసం కూడా బాప్ దాదా యొక్క ఆజ్ఞ ఏమిటంటే మొదట ఈ మార్గాలన్నింటినీ మూసివేయండి, అప్పుడు శ్రమ నుండి విడిపించబడతారు. స్మృతి సహజం అయిపోతుంది మరియు స్వతహాగా అయిపోతుంది. ఈ ధ్యాస పెట్టుకోవటం కష్టమా లేక సహజమా? కష్టమేమీ లేదు కానీ కష్టంగా చేసుకుంటున్నారు. సమయానుసారంగా ఈ ధ్యాస పెట్టుకుంటూ ఉన్నట్లయితే అసలు కష్టమే అనిపించదు. చిన్నతనంలో నేర్పించిన విషయాలను సహజంగా స్మృతిలో పెట్టుకుంటారు, పెద్దవారు అయిన తర్వాత ఏ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలనినా కష్టమవుతుంది. అదేవిధంగా ఎవరైతే బాల్యం నుండే ఈ ధ్యాస పెట్టుకునే అభ్యాసం చేశారో వారికి ఈ రోజు కూడా సహజ స్మృతి యొక్క చార్టు ఉంది. మరియు ఎవరైతే ధ్యాస పెట్టటంపై మొదట నుండి సోమరిగా ఉన్నారో వారికి ఇప్పుడు కష్టమనిపిస్తుంది. జరిగిపోయిందేదో జరిగిపోయింది అని భావించి, ఇప్పటి నుండి నేను పిల్లవాడిని, బాబాతో పాటు ఉన్నాను... అని భావించండి. ఇలా భావించటం ద్వారా బాల్య జీవితం స్మృతిలో ఉంటుంది. ఇది ఎంత స్మృతి ఉంటుందో దాని ద్వారా మీకు సహాయం లభిస్తుంది. అప్పుడు కష్టమైన పని సహజం అయిపోతుంది. ఇప్పటి నుండి స్వయాన్ని ఒక్క సెకను కూడా బాబా నుండి వేరుగా భావించకండి. బాబా తోడుగా ఉన్నారు మరియు బాబా చేతిలో నా చేయి ఉంది ... సదా ఈ విధంగా భావించండి. ఎవరైనా పెద్దవారి చేతిలో చేయి ఉంటే చిన్నవారి స్థితి నిశ్చింతగా ఉంటుంది. కనుక ప్రతీ కర్మలో బాప్ దాదా నా తోడుగా ఉన్నారు, మా యొక్క ఈ అలౌకిక జీవితం యొక్క చేయి ఆయన చేతిలో ఉంది. అనగా జీవితము బాబాకి అంకితము అని భావించండి. అప్పుడు భాద్యత బాబాది అయిపోతుంది. ఈ విధంగా బరువు అంతా బాబాపై పెట్టి స్వయాన్ని తేలిక చేసుకోవాలి. బరువే లేకపోతే ఏదైనా కష్టం అనిపిస్తుందా? కనుక బరువు దించుకోవటానికి లేదా కష్టాన్ని సహజం చేసుకోవటానికి సాధనం ఏమిటంటే బాబా యొక్క చేయి మరియు తోడు. ఇదయితే సహజమే కదా! బాబా స్మృతిలోకి వచ్చినా, దాదా స్మృతిలోకి వచ్చినా, ఎలాగైనా సరే. బాబా స్మృతిలోకి వస్తే బాబాతో పాటు దాదా కూడా స్మృతిలోకి వస్తారు. దాదా స్మృతి రావటం ద్వారా బాబా కూడా స్మృతి వస్తారు. వేరుగా ఉండదు. సాకార బాబాతో స్నేహిగా అయిపోయినా కానీ మిగతావారందరితో బుద్ధి తెగిపోతుంది. సాకార స్నేహిగా అవ్వటం కూడా చిన్న విషయం కాదు. సాకార బాబా యొక్క స్నేహం కూడా సర్వ స్నేహాల నుండి, సంబంధాల నుండి బుద్దియోగాన్ని త్రెంచేస్తుంది. అనేక వైపుల నుండి త్రెంచి ఒకే వైపుకి జోడించటం, ఇది కూడా ఒక సాధనం. సాకారం నుండి నిరాకారుని యొక్క స్మృతి వస్తుంది. సాకారునితో స్నేహం ఎప్పుడు కలుగుతుందంటే బాబా మరియు దాదా ఇద్దరు కలిసి ఉన్నప్పుడే. బాబా మరియు దాదా కలిసి ఉండకపోతే సాకారునితో అంత ప్రియంగా అవుతారా ఏమిటి? ఎలాగైతే బాబా మరియు దాదా ఇద్దరూ సదా తోడుగా ఉంటారో మీ యొక్క స్మృతి కూడా సదా తోడుగా ఉండాలి. కష్టం అని ఎప్పుడూ భావించకూడదు. సహజ యోగులు అవ్వండి. కషమైన యోగులుగా అయితే ద్వాపర యుగం నుండి అవుతూ వచ్చారు. హఠయోగాన్ని మీరు ఖండిస్తారు కదా! మరి మీరు కూడా సహజ యోగి అవ్వకుండా కష్టం అని అంటూ ఉంటే ఇద్దరూ ఒకటి అయిపోయినట్లే కదా! కనుక సహజ యోగి అవ్వండి. యదార్ధ స్మృతి ఉండాలి, నిరంతర సహజ యోగిగా ఉండాలి. కేవలం మధ్యమధ్యలో మీ స్థితిని శక్తిశాలిగా తయారు చేసుకుంటూ ఉండండి. వేదికపై ఉన్నారు. సమయానుసారం మీ స్మృతిని శక్తిశాలిగా తయారు చేసుకోవటంపై ధ్యాస పెట్టుకుంటే శక్తి నిండుతుంది. దిగిపోయే కళ ఇప్పుడు సమాప్తం అయిపోయింది. లేక ఇప్పుడు కూడా ఉందా? ఎక్కేకళలోకి వచ్చేశారు కదా! ఒక రోజు యొక్క దినచర్య చూడండి, ఉంటే సాకార బాబా యొక్క స్మృతి ఉంటుంది. లేకపోతే నిరాకారి స్మృతి ఉంటుంది. మీరు చేసే కార్యవ్యవహారాలు కూడా యజ్ఞ కార్యవ్యవహారాలు కదా! యజ్ఞ పిత ద్వారానే యజ్ఞం యొక్క రచన జరిగింది కదా! యజ్ఞ కార్యవ్యవహారం అనే పదం గుర్తుండటం ద్వారా బాబా స్మృతి వస్తుంది కదా! కనుక ఎప్పుడైనా కాని కార్య వ్యవహారాలు చేస్తున్నప్పుడు నేను ఈశ్వరీయ కార్యంలో ఉన్నాను, యజ్ఞ కార్య వ్యవహారంలో ఉన్నాను అని భావించండి. డైరెక్టుగా వికర్మలను వినాశనం చేసుకునే స్థితి అనగా పూర్తి శక్తితో వికర్మలను వినాశనం చేసుకోవటం. 2. ఎంతెంత శుద్ధ సంకల్పాలు మనన శక్తితో మీ బుద్ధిని బిజీగా ఉంచుతారో వాటి ద్వారా ఏదైతే శక్తి జమ అవుతుందో ఆ శక్తి ద్వారా వికర్మలు నెమ్మది నెమ్మదిగా సమాప్తం అయిపోతాయి. బుద్ధిలో వీటిని నింపుకోవటం ద్వారా ఇంతకు మునుపు ఉన్నవి స్వతహాగానే తొలగిపోతాయి. ఉన్నదంతా తీసేసి తర్వాత నింపటం, నింపుతూ ఉంటే లోపల ఉన్నది పోవటం. ఖాళీ చేసుకునే ధైర్యం మీకు లేకపోతే నింపుకుంటూ వెళ్ళండి, మొదటిది స్వతహాగానే సమాప్తం అయిపోతుంది. ఆ స్థితి స్వతహాగానే వచ్చేస్తుంది. ఒకవైపు నిండుతూ ఉంటుంది, మరోవైపు ఖాళీ అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు కావలసిన స్థితి స్వతహాగానే తయారవుతూ ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ స్థితి వచ్చేస్తుంది. పూర్తి శక్తితో ఖాళీ చేయలేకపోతే రెండవ పద్ధతి కూడా ఉంది, నింపుతూ వెళ్ళండి, మిగిలినది స్వతహాగానే ఖాళీ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కేకళ ఇది స్మృతిలో పెట్టుకోండి. మార్గాలన్నీ మూసివేస్తే బుద్ధి ఎక్కడికి వెళ్తుంది? యజ్ఞ కార్యవ్యవహారం లేదా కర్మణా సేవకి కూడా మార్కులు ఉంటాయి. పాస్ విత్ ఆనర్ అవ్వటంలో అనగా 100 మార్కులు పొందటంలో ఇది కూడా సహాయం చేస్తుంది. కానీ ఏ సమయంలో కార్యవ్యవహారం చేస్తున్నారో లేదా వాచా సేవ చేస్తున్నారో లక్ష్యం మాత్రం ఇదే గుర్తుండాలి - ఇది ఈశ్వరీయ సేవ, యజ్ఞ కార్యవ్యవహారం అని, అప్పుడు స్వతహాగానే యజ్ఞ రచయిత యొక్క స్మృతి వస్తుంది. అంతేకాదు ఏ కార్యం చేస్తున్నా ఈ కార్యానికి నిమిత్తంగా చేసిన వెన్నెముక ఎవరు? నేను నిమిత్తం కానీ వెన్నెముక ఎవరు? అంటే వెన్నెముక లేకుండా శరీరం నిలబడుతుందా అలాగే వెన్నెముక అయిన శివబాబా లేకుండా మీరు ఏ కార్యంలోనైనా సఫలత పొందలేరు. ఏ కార్యం చేస్తున్నా నేను నిమిత్తం, చేయించేవారు ఎవరు? చేసి చేయించేవాడు భగవంతుడు అని భక్తిమార్గంలో కూడా అంటూంటారు. కానీ వారు వేరే అర్ధంతో అంటారు. కానీ ఈ సమయంలో ఏ కర్మ చేస్తున్నా చేసిచేయించేవారు ఉన్నారు కదా! చేయించేవారు తండ్రి, చేసేవారు నిమిత్తులు. ఇది స్మృతిలో ఉంచుకుని కర్మ చేసినట్లయితే అది సహజ స్మృతి అవ్వదా? నిరంతర యోగి అవ్వలేదా? వేదికపై ఏ పాత్రధారి అయినా ఉంటే లోకకళ్యాణార్ధం ఈ హాస్య పాత్రను పోషిస్తున్నాను అని అంటారు కదా! మీ స్థితి కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడిప్పుడే ఒక పాత్ర, మరలా మరోపాత్ర ఇలా ఆటగా అనుభవం అవుతుంది. సాక్షి అయ్యి పాత్ర అభినయిస్తున్నట్లు ఉంటారు. అంటే సహజ యోగులు అయిపోయారు కదా! స్మృతిని కూడా సహజం చేసుకోండి. ఎప్పుడైతే స్మృతి యొక్క కోర్సు సహజం అయిపోతుందో ఎవరికైనా కోర్సు చెప్పేటప్పుడు ఆ స్మృతి బలం కూడా నింపగలరు. కేవలం కోర్సు ఇవ్వటం ద్వారా ప్రజలు తయారవుతారు. కానీ కోర్సుతో పాటు ఫోర్సు కూడా ఇస్తే సమీప సంబంధంలోకి వస్తారు. అతీతం మరియు అతీప్రియంగా అనుభవం చేసుకుంటారు. కనుక అందరు సహజ యోగులు. హఠం చేయకండి. 63 జన్మలుగా కష్టాలు చూసి చూసి ఉన్నారు. ఈ ఒక్క జన్మలో కూడా సహజ పురుషార్ధంలో కూడా కష్టాలలోనే ఉంటే సహజం మరియు స్వతహా అభ్యాసాన్ని ఎప్పుడు అనుభవం చేసుకుంటారు? సహజ యోగం అని అంటారు కదా! కఠిన యోగం అయితే కాదు. ఇక్కడి సహజ యోగం అక్కడ సహజ రాజ్యం చేయిస్తుంది. అక్కడ ఏ కష్టమూ ఉండదు. ఇక్కడి సంస్కారాలే అక్కడికి తీసుకువెళ్తారు. ఒకవేళ అంతిమం వరకు కష్ట సంస్కారమే ఉన్నట్లయితే అక్కడ సహజ రాజ్యం ఎలా చేస్తారు. దేవతల చిత్రాలు ఏవైతే తయారు చేస్తారో వారి ముఖంలో సరళతను తప్పకుండా చూపిస్తారు. ఈ విశేష గుణాన్ని చూపిస్తారు. ముఖకవళికల్లో సరళత, దీనినే మీరు భోళాతనం అని అంటారు. ఎవరు ఎంత సహజ పురుషార్ధిగా ఉంటారో ,వారు మనస్సులో కూడా సరళంగా, వాచాలో కూడా సరళంగా, కర్మలో కూడా సరళంగా ఉంటారు. అలాంటి వారినే ఫరిస్తా అని అంటారు. మంచిది.