ఆకారంలో నిరాకారాన్ని చూసే అభ్యాసం.
ఆకారాన్ని చూస్తూ నిరాకారాన్ని చూసే అభ్యాసం
అయ్యిందా? ఎలాగైతే బాబా నిరాకారీ ఆత్మలను చూస్తారో అలాగే బాబా సమానంగా అయ్యారా?
సదా శ్రేష్టమైనది ఏదైతే ఉంటుందో దాని వైపుకే దృష్టి మరియు వృత్తి వెళ్తాయి.
అదేవిధంగా ఆకారంలో ఉన్న శ్రేష్ఠ వస్తువు ఏది? నిరాకారి ఆత్మ. మరైతే రూపాన్ని
చూస్తున్నారా, ఆత్మను చూస్తున్నారా? ఎందుకంటే ఇప్పుడు మీకు తేడా (అంతరం) కూడా
తెలిసిపోయింది మరియు మహామంత్రం కూడా తెలిసింది. తెలుసుకున్నారు, అనుభవం
చేసుకున్నారు కూడా. ఇంకా ఏమి మిగిలింది? ఆ స్థితిలో ఉండే అభ్యాసిగా అయ్యారా?
(ప్రతి ఒక్కరు తమ తమ అనుభవాన్ని చెప్పారు) అంతిమం వరకు మొదటి పాఠం యొక్క
అభ్యాసిగానే ఉంటాము అని అనుకుంటున్నారా? అంతిమం వరకు అభ్యాసిగానే ఉంటారా లేదా
స్వరూపంగా కూడా అవుతారా? అంతిమానికి ఎంత సమయం ముందు ఈ అభ్యాసం సమాప్తం
అవుతుంది? మరియు స్వరూపంగా ఎప్పుడు అవుతారు? శరీరం వదిలే వరకు అభ్యాసిగానే
ఉంటారా? అంతిమం వరకు అభ్యాసిగానే ఉంటామని భావించేవారు చేయి ఎత్తండి, ఆకారంలో
నిరాకారాన్ని చూసే విషయం అనగా మొదటి పాఠం గురించి అడుగుతున్నాను. ఇప్పుడు
ఆకారాన్ని చూస్తూ నిరాకారాన్ని చూస్తున్నారా? ఎవరితో మాట్లాడుతున్నారు?
(నిరాకారితో) ఆకారంలో నిరాకారిని చూసేటందుకు వచ్చారు. అంతిమం వరకు ఇదే
అభ్యాసంలో ఉండిపోతే దేహీ అభిమాని లేదా మీ యొక్క వాస్తవిక స్వరూపం యొక్క ఆనందం,
సుఖం ఏవైతే ఉన్నాయో అవి సంగమయుగంలో అనుభవం చేసుకోరా? సంగమయుగం యొక్క వారసత్వం
ఎప్పుడు ప్రాప్తిస్తుంది? సంగమయుగం యొక్క వారసత్వం ఏది? (అతీంద్రియ సుఖం). ఇది
వెళ్లిపోయేటప్పుడు అనగా అంతిమంలో లభిస్తుందా ఏమిటి? ఆత్మిక స్వరూపంలో నడవాలి.
ఆత్మగా నడవాలి. ఈ అభ్యాసం ఉందా? సాకారాన్ని లేదా ఆకారాన్ని చూస్తూ ఆకర్షణ
ఇటువైపు వెళ్తుందా లేక ఆత్మవైపు వెళ్తుందా? ఆత్మను చూస్తున్నారు కదా! ఆకారంలో
నిరాకారాన్ని చూడాలి. ఇది ప్రత్యక్ష మరియు సహజ స్వరూపంగా అయిపోవాలి. ఇప్పటి
వరకు శరీరాన్ని చూస్తారా? సేవ అయితే ఆత్మకు చేస్తున్నారు కదా! భోజనం
స్వీకరించేటప్పుడు ఆత్మకు స్వీకరింపజేస్తున్నారా లేక దేహాభిమానంలో
స్వీకరిస్తున్నారా? మెట్లు ఎక్కుతూ, దిగుతూ ఉన్నారా? మెట్ల ఆట మంచిగా
అనిపిస్తుందా? దిగటం మరియు ఎక్కడం ఎవరికి మంచిగా అనిపిస్తుంది? చిన్నపిల్లలు
ఎక్కడ మెట్లు చూసినా ఎక్కుతూ, దిగుతూ ఉంటారు. అలాగే మీరు కూడా అంతిమం వరకు
చిన్నపిల్లలగానే ఉంటారా? వానప్రస్థిగా అవ్వరా? శరీరం యొక్క వానప్రస్థ స్థితి
వచ్చినప్పుడు కూడా నెమ్మదినెమ్మదిగా బాల్య సంస్కారాలు తొలగిపోతాయి. అలాగే ఈ
ఎక్కడం, దిగడం అనగా బాల్యం యొక్క ఆట ఎంత వరకు ఉంటుంది? ఆకారంలో ఉంటూ నిరాకార
స్థితిలో ఉన్నప్పుడు సాక్షాత్కార మూర్తిగా కాగలరు. అంతిమం వరకు అభ్యాసిగానే
ఉంటాము అని భావిస్తే ఈ మొదటి పాఠాన్ని పరిపక్వం చేసుకోవడంలో డీలా స్థితి
వచ్చేస్తుంది. అప్పుడు నిరంతర సహజ స్మృతి లేదా స్వరూపం యొక్క స్థితి యొక్క
సఫలతను చూడలేరు. శరీరం వదిలితే అప్పుడు సఫలత పొందుతారా? అలా కాదు. ఆత్మిక
స్వరూపం యొక్క అనుభవం అంతిమం కంటే ముందుగానే చేసుకోవాలి. ఎలా అయితే అనేక జన్మలు
మీ దేహ స్వరూపం యొక్క స్మృతి సహజంగా ఉంది కదా! అదేవిధంగా ఈ అసలైన స్వరూపం యొక్క
స్మృతి మరియు అనుభవం కూడా కొంచెం సమయానికైనా చేసుకోరా ఏమిటి? చేసుకోవాలి కదా?
మొదటి పాఠం సమాప్తం అయిపోవాలి. ఆత్మాభిమాని స్థితిలో ఉండడం ద్వారానే
సర్వాత్మలకు సాక్షాత్కారం చేయించేటందుకు నిమిత్తమవుతారు. దీనిపై ధ్యాస
పెట్టాలి. ఆత్మగా భావించాలి. మీ స్వరూపం యొక్క స్థితిలో స్థితులవ్వాలి.
బ్రహ్మాకుమారీ, బ్రహ్మాకుమారులు అనడం ద్వారా బ్రహ్మాబాబా మరియు బ్రహ్మాకుమార్
స్థితిని, స్వరూపాన్ని మరిచిపోతున్నారా? నడుస్తున్నా, తిరుగుతున్నా నేను
బ్రహ్మాకుమారుడిని అని మరిచిపోతారా? ఇది మర్చిపోనప్పుడు, మీరు శివ వంశీయులు
కనుక మీ ఆత్మిక స్వరూపం ఎందుకు మర్చిపోతున్నారు? బాప్ దాదా అని అంటున్నారు కదా!
శివబాబా అని అనగానే నిరాకారుని స్వరూపం ఎదురుగా వస్తుంది. బ్రహ్మాకుమారుల
స్థితి లేదా స్వరూపం నడుస్తూ, తిరుగుతూ కూడా పక్కాగా అయిపోయింది. అదేవిధంగా మీ
శివవంశీ స్వరూపం ఎందుకు మర్చిపోవాలి? బ్రహ్మాకుమారులుగా అయిపోయారు. శివవంశీ
స్వరూపంగా అంతిమంలో అవుతారా? బాప్ దాదా అని కలిపి అంటున్నారా లేక విడివిడిగా
అంటున్నారా? బాప్ దాదా అనే మాట కలిపి అంటున్నప్పుడు మీ యొక్క రెండు స్వరూపాలు
అనగా ఆత్మిక స్వరూపం మరియు బ్రహ్మాకుమార్ స్వరూపం రెండూ గుర్తుండడం లేదా? ఈ
అభ్యాసాన్ని ముందుగానే పూర్తిచేసుకోవాలి. అంతిమానికి అయితే మరికొన్ని
విషయాలుంటాయి. చెప్పాను కదా - అంతిమ సమయంలో కొత్తకొత్త పరీక్షలు వస్తాయి. ఆ
పరీక్షలను దాటి సంపూర్ణత అనే డిగ్రీ తీసుకుంటారు. ఒకవేళ ఈ మొదటి పాఠమే స్మృతిలో
లేకపోతే సంపూర్ణత యొక్క డిగ్రీ కూడా తీసుకోలేరు. డిగ్రీ లభించకపోతే ఏమవుతుంది?
ధర్మరాజు యొక్క డిగ్రీ (ఆదేశం) లభిస్తుంది. కనుక ఈ అభ్యాసాన్ని బాగా పక్కాగా
చేసుకోండి. మొదటి వికారాన్ని పూర్తిగా అనగా సంకల్ప రూపం నుండి కూడా తొలగించాలని
నిశ్చయించుకున్నారు కదా! దానిలో చాలామంది విజయీగా అయ్యారు. ఇదంతా మీ ప్రతిజ్ఞపై
ఆధారపడి ఉంటుంది. శక్తివంతంగా ఏ విషయం గురించి ప్రతిజ్ఞ తీసుకుంటారో ఆ ప్రతిజ్ఞ
ప్రత్యక్ష రూపంలోకి వచ్చేస్తుంది. అలాగే ఇది అంతిమం యొక్క కోర్సు అని మీరు
అనుకుంటే ఫలితం ఎలా వస్తుంది? ప్రత్యక్ష రూపంలోకి రాదు. అభ్యాసంలోనే
ఉండిపోతుంది. కనుక మొదట ఈ విషయాలను దాటాలి. ఒకవేళ అంతిమం వరకు దాటుతూనే ఉంటే
సంపూర్ణ అతీంద్రియ సుఖం యొక్క వారసత్వాన్ని ఎప్పుడు ప్రాప్తింపచేసుకుంటారు?
కొన్ని విషయాలను ప్రతి ఒక్కరూ తమతమ శక్తిని అనుసరించి దాటి అభ్యాసానికి బదులు
ప్రత్యక్షంలోకి తీసుకువచ్చారు. కొందరు కొన్ని విషయాల్లో ఎలాగైతే లౌకిక దేహ
సంబంధాల యొక్క విషయం కొందరికి అభ్యాసంగా ఉంది. కొందరికి ప్రత్యక్షంలో ఒకే
అలౌకిక పారలౌకిక సంబంధాల్లో ఉంది. స్వప్నంలో కూడా ఎప్పుడూ కూడా సంకల్ప రూపంలో
కూడా దేహ సంబంధీకుల వైపు వృత్తి మరియు దృష్టి వెళ్లకూడదు. పాండవులు దీనిని
దాటాలి. లౌకికాన్ని అలౌకికంలోకి పరివర్తన చేసుకునేటందుకు స్మృతిలోకి వచ్చారంటే
అది కళ్యాణార్ధం. మీరు మధువనం అనే భట్టీలో ఉండేవారు కదా! కనుక మొదటి మెట్టుని
దాటాలి. ఒక్క సెకెను క్రితం అయింది ఈ సెకెనులో అవ్వదా! మధువనం యొక్క పాండవులు
మీరు. విశ్వ విద్యాలయం యొక్క విద్యార్థులు మీరు. ఏదో చిన్న గీతాపాఠశాల
విద్యార్థులు కారు మీరు. మరి మీకు ఎంత నషా ఉండాలి! మీ చదువు ఎంత ఉన్నతమైనది.
ఒక్క సెకెను క్రితం మీపైన ఆశలేదు, కానీ మరుక్షణంలో అందరూ ఆశావాహులుగా అయిపోవాలి
అలాంటి అద్భుతం చేసి చూపించాలి. మహావీర సైన్యం ఏమి చేశారు? లంక అంతటినీ
కాల్చేశారు మరైతే మెట్టు దాటలేరా? మొదటి మెట్టు ఒకటే చెప్పాను. రెండవ మెట్టు -
కర్మేంద్రియాలపై విజయం. మూడవ మెట్టు - వ్యర్థ సంకల్పాలు వికల్పాలపై విజయం ఇదే
చివరిది. మేము ఫుల్ పాస్ అవుతామని ఉత్సాహ, ఉల్లాసాలతో చెప్పండి. రెండవ మెట్టు
దాటడం చాలా సహజం. మరజీవగా అయిపోయినప్పుడు పాత కర్మేంద్రియాల యొక్క ఆకర్షణ
ఎందుకు ఉంటుంది? మరజీవ అయిపోయాము అంటే సమాప్తం అయిపోయింది కదా! ఫలానా వారు
ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతారు తరువాత చనిపోతారు అని జాతకం చెబుతారు కదా కానీ
ఒకవేళ ఎవరైనా దానపుణ్యాలు చేసినట్టయితే కొత్త జన్మమాదిరిగా కొత్త ఆయుష్షు
మొదలవుతుంది. అదేవిధంగా మీరు కూడా మరజీవ అయ్యారు అంటే అన్ని వైపుల నుండి
చనిపోయారు. పాత ఆయుష్షు తీరిపోయింది. ఇప్పుడు కొత్త జన్మ తీసుకున్నారు.
తీసుకుని బ్రహ్మాకుమారీ, కుమారులు అయ్యారు. బ్రహ్మాకుమారీ కుమారులకు
కర్మేంద్రియాలపై విజయం పొందకపోవడం అనేది ఉంటుందా? పాత ఖాతా సమాప్తం అయింది
మరజీవగా అయ్యారు. బ్రహ్మకుమారులుగా అయ్యారు మరలా కర్మేంద్రియాలకు వశం ఎలా
కాగలరు? బ్రహ్మకుమారుల యొక్క కొత్త జీవితంలో కర్మేంద్రియాలకు వశం అవ్వడం అంటే
ఏమిటనేది కూడా తెలియనే తెలియదు. శూద్రత్వం నుండి చనిపోలేదా.. మరజీవగా
అవుతున్నారా? శూద్రత్వం యొక్క శ్వాస అనగా సంస్కారాలు అక్కడక్కడ అతుక్కుని
ఉన్నాయా లేవు కదా? కొందరికి శ్వాస లోపల దాగి ఉంటుంది. కొంచెం సమయం తరువాత మరలా
శ్వాస ఆడుతుంది. ఇక్కడ కూడా ఆ విధంగా ఉన్నారా? పాత సంస్కారాలు అతుక్కుని
ఉన్నాయా లేక మరజీవా అయ్యారా? ఏమంటారు మరజీవగా అవకపోతే బ్రహ్మకుమారులు అని ఎలా
అంటారు? మరజీవగా అయితే అయ్యారు కదా! ఇక మిగిలింది మనసా సంకల్పాలు. ఇవైతే
బ్రహ్మాకుమారులుగా అయిన తరువాతే మాయ వస్తుంది. శూద్ర కుమారుల దగ్గరకు మాయ
వస్తుందా ఏమిటి? మీరు ఎందుకు అయోమయం అవుతున్నారు? మరజీవ అయ్యాము అని చెప్పండి.
మరజీవగా అయిన తరువాత మాయతో శపథం చేసారు. అందువలనే మాయ వస్తుంది. యుద్ధం చేసి
మనం విజయీగా అవుతాము. ఇలా ఎందుకు చెప్పడం లేదు? మీరు మహావీరులు కదా! మీ నషాన్ని
స్థిరంగా ఉంచుకోండి. మిమ్మల్ని మీరు బ్రహ్మాకుమారులుగా భావించడం ద్వారా
కర్మేంద్రియాల ఆకర్షణ అనే రెండవ మెట్టు ఏదైతే ఉందో దానిని సహజంగా దాటేస్తారు.
బ్రహ్మాకుమార్ లేదా శివకుమార్ ఈ రెండింటిని స్మృతిలో ఉంచుకోవడం ద్వారా ఎప్పుడూ
ఫెయిల్ అవ్వరు. ఎందుకంటే బ్రహ్మాకుమారుడిగా భావించడం ద్వారా బ్రహ్మాకుమారుల
కర్తవ్యం. బ్రహ్మాకుమారుల గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్మృతిలో ఉంటాయి కదా!
ఇప్పుడు రెండవ మరియు మూడవ మెట్టు దాటి పాస్ విత్ ఆనర్ అవ్వడానికి సమీపంగా
వచ్చేటందుకు ఈ భట్టీ. భట్టీ సమాప్తితో పాటు వీటిని కూడా సమాప్తం చేయాలి. చూడండి
స్థానం ఆధారంగా స్థితి తయారవుతుంది. ఇది మధువన స్థానం ఇది స్థితినే
మార్చేస్తుంది. స్థానం యొక్క ప్రభావం స్థితిపై ఉంటుంది. ప్రతి ఒక్కరికి తమ
స్థానం యొక్క నషా ఎంతగా ఉంటుంది. దేశం గురించి, హద్దులోని నివాసస్థానమైన ఇంటి
గురించి నషా ఉండదా? పెద్ద మహల్ లో లేదా బంగ్లాలో ఉండేవారికి ఆ స్థానం యొక్క
ప్రభావం స్థితిపై ఉంటుంది. అదేవిధంగా మీరందరూ కూడా శ్రేష్ట స్థానంలో ఉన్నారు.
దీని యొక్క ప్రభావం మీ స్థితిపై ఉండాలి శ్రేష్ఠ వరదాన భూమి యొక్క నివాసులు
మీరు. మీ స్థితి కూడా సదా అందరికీ ఇచ్చేవిధంగా తయారుచేసుకోవాలి.
సాక్షాత్కారమూర్తులుగా అయినవారే వరదానం ఇవ్వగలరు. ఏ భక్తునికైనా వరదానమనేదే
సాక్షాత్కారం ద్వారానే లభిస్తుంది. కనుక సాక్షాత్తు మరియు సాక్షాత్కారమూర్తిగా
తయారవడం ద్వారానే వరదాతగా కాగలరు. దాత యొక్క పిల్లలు- దాతగా అవ్వాలి.
తీసుకునేవారుగా కాదు, ఇచ్చేవారు. ప్రతి సెకెను, ప్రతి సంకల్పంలో ఇవ్వాలి. దాతగా
అయిపోతే దాత యొక్క ముఖ్య గుణం ఏమిటి? ఉదారచిత్. ఇతరుల ఉద్ధారణ నిమిత్తమైన వారు
స్వయం యొక్క ఉద్ధారణ చేసుకోలేరా? నేను దాత యొక్క సంతానాన్ని, ఇవ్వకుండా
ఒక్కసెకెను కూడా ఉండలేను, సదా ఈ విధంగా భావించండి. అలాంటివారినే మహాదాని అని
అంటారు. అంటే ఇచ్చేటటునంటి ద్వారం సదా తెరిచే ఉంటుంది. మందిరం యొక్క తలుపులు
సదా తెరిచే ఉంటాయి. ఈ రోజుల్లో అయితే మూసేస్తున్నారు. అదేవిధంగా దాత యొక్క
పిల్లలు కనుక ఇచ్చేటటువంటి ద్వారం ఎప్పుడు మూసి ఉండదు. ప్రతి సెకెను, ప్రతి
సంకల్పం పరిశీలించుకోండి ఏదైనా ఇచ్చానా, ఏదీ తీసుకోలేదు కదా. ఇస్తూ వెళ్లండి.
తీసుకోవాలంటే బాబా నుండి, అదైతే తీసేసుకున్నారు కదా! ఇప్పుడు ఇక ఇవ్వాలి.
తీసుకునేటందుకు ఇంకా ఏమైనా మిగిలి ఉందా? ఏదైతే తీసుకోవాలో అదంతా
తీసేసుకున్నారు. ఇక ఇవ్వడమే మిగిలి ఉంది. ఎంతెంతగా ఇవ్వడంలో బిజీగా ఉంటారో ఈ
విషయాలను దాటడం ఏదైతే కష్టంగా అనిపిస్తుందో అది చాలా సహజమైపోతుంది. ఎందుకంటే
మహాదానిగా అవడం ద్వారా మహాశక్తి స్వతహాగానే ప్రాప్తిస్తుంది. ఈ కార్యం మంచిది
కదా. ఇచ్చేటందుకు భండారా నిండుగా ఉంది కదా? దీంట్లో ఫుల్ పాస్ అయ్యారా?
దేంట్లో ఫుల్ పాస్ అయితే దానిని టిక్ చేసుకుని వెళ్లండి. దేనిలో ఫుల్ పాస్
అవ్వాలో దానిలో ఫుల్ పాస్ అయి ఈ భట్టీ నుండి తిరిగి వెళ్లాలి. ఎంతగా దాతగా
అవుతారో అంతగా నిండుతుంది. భండారా నిండుగా ఉన్నప్పుడు దాతగా ఎందుకు అవ్వరు?
అలాంటివారినే నిరంతర ఆత్మిక సేవాధారి అని అంటారు. నిరంతర ఆత్మిక సేవాధారి అయి ఈ
భట్టీ నుండి వెళ్లాలి. త్యాగం లేకుండా సేవాధారిగా కాలేరు. సేవాధారిగా అవ్వడం
ద్వారా త్యాగం సహజంగా మరియు స్వతహాగానే వస్తుంది. మిమ్మల్ని మీరు బిజీగా
ఉంచుకునే పద్ధతి ఇదే. సంకల్పంతో, బుద్ధితో స్థూల కర్మతో ఎంత తేలికగా ఉంటారో మాయ
కూడా అంతగానే అవకాశం తీసుకుంటుంది. స్థూలం మరియు సూక్ష్మం రెండు రకాలుగా
స్వయాన్ని సదా బిజీగా పెట్టుకోండి అప్పుడు మాయకు అవకాశం లభించదు. ఏరోజైతే స్థూల
కార్యాన్ని కూడా ఇష్టంగా చేస్తారో ఆ రోజు పరిశీలించుకోండి. దేవతగా అయి చేస్తే
మీకు మాయ రాదు. మనుష్యులుగా అయి చేస్తే మాయకు అవకాశం ఇచ్చినవారు అవుతారు. కానీ
సేవాధారి అయ్యి దేవతగా అయ్యి మీ ఇష్టంతో ఉల్లాసంతో మిమ్మల్ని మీరు బిజీగా
పెట్టుకుని చూడండి. అప్పుడు ఎప్పుడూ కూడా మాయరాలేదు. సంతోషం కూడా ఉంటుంది.
సంతోషంగా ఉన్నారు కనుక మాయ మిమ్మల్ని ఎదుర్కొనేటందుకు సాహసించదు. కనుక
మిమ్మల్ని మీరు బిజీగా పెట్టుకునే అభ్యాసం చేయండి. ఎప్పుడైనా కానీ చూడండి ఈరోజు
బుద్ది తీరికగా ఉందంటే స్వయానికి స్వయమే టీచర్ అయి మీ బుద్ధికి పనిచెప్పండి.
ఇలా ఎవరైతే డెయిలీ డైరీ పెట్టుకుంటారో, కార్యక్రమం తయారుచేసుకుంటారో, ఈ రోజంతా
ఈ పనులు చేయాలని, తరువాత పరిశీలించుకుంటారు. అదేవిధంగా మీ బుద్ధిని బిజీగా
ఉంచుకునేటందుకు కూడా రోజూ కార్యక్రమం పెట్టుకోండి. కార్యక్రమం పెట్టుకోవడం
ద్వారా మీ ఉన్నతి చేసుకోగలరు. కార్యక్రమం తయారుచేసుకోకపోతే ఏ పనీ సమయానికి
పూర్తవదు. కనుక రోజూ డైరీ పెట్టుకోవాలి. ఎందుకంటే అందరికంటే గొప్పవారు కదా
మీరు. పెద్దపెద్దవాళ్లు ప్రోగ్రాం ఫిక్స్ చేసుకుని అప్పుడు వెళ్తారు. అదేవిధంగా
మిమ్మల్ని మీరు కూడా ఉన్నతోన్నతమైన తండ్రికి చెందినవారిగా భావించి ప్రతి సెకెను
యొక్క ప్రోగ్రాం ఫిక్స్ చేసుకోండి. ఏ విషయం గురించి ప్రతిజ్ఞ చేస్తారో దాంట్లో
విల్ పవర్ ఉంటుంది. మామూలుగా చేసేదాంట్లో విల్ పవర్ ఉండదు. ఇది చేయాల్సిందే అని
ప్రతిజ్ఞ చేయండి. చూస్తాం, చేస్తాను, చేయాలి కదా అనకండి. చేయాల్సిందే అనండి.
స్థూల కార్యం ఎంత ఎక్కువగా ఉన్నా కానీ ప్రతిజ్ఞ చేయడం ద్వారా చేసేస్తారు కదా!
ఆలోచన బలహీనంగా ఉంటే లేదా చేయాలని లేకపోతే అదెప్పుడు పూర్తిచేయరు. సాకులు చాలా
తయారుచేస్తారు. ప్రతిజ్ఞ చేయడం ద్వారా సమయం కూడా తీస్తారు సాకులు కూడా
తొలగిపోతాయి. అదేవిధంగా ఈరోజు బుద్దిని ఈ కార్యక్రమం అనుసారంగా నడిపించాల్సిందే
అని ప్రతిజ్ఞ చేయండి. భిన్నభిన్న సమస్యలు, పురుషార్థ హీనంగా చేసే వ్యర్ధ
సంకల్పాలు, సోమరితనం మొదలైనవి వస్తాయి. కానీ విల్ పవర్ ఉంటే వాటినన్నింటిని
ఎదుర్కొని విజయీగా అయిపోతారు. కనుక దీనికోసం కూడా డైరీ పెట్టుకోండి అప్పుడు
చూడండి అందరికీ ఆత్మిక మార్గం చూపే ఆత్మ ఎలా కనిపిస్తుందో! రూహ్ అంటే ఆత్మ అని
అర్థం మరియు రూహ్ అనగా సెంటు అని కూడా అర్థం ఉంది. రెండు రకాలుగా అయిపోతారు.
దివ్యగుణాల సువాసన యొక్క ఆకర్షణ మరియు ఆత్మ స్వరూపం రెండూ కనిపిస్తాయి. ఇలాంటి
లక్ష్యం పెట్టుకోండి. రూపం యొక్క విస్మృతి, ఆత్మ యొక్క స్మృతి ఈ భట్టీ నుండి ఈ
విధంగా తయారై వెళ్లాలి. ఈ శరీరం ఒక పెట్టెలాంటిది అని అనుభవం అవ్వాలి. ఈ
పెట్టెలో ఏదైతే వజ్రం ఉందో దాంతోనే మన సంబంధం మరియు స్నేహం... ఇలా అనుభవం
చేసుకోవాలి. కనుక నివాస స్థానం యొక్క ఆధారం తీసుకుని స్థితిని తయారుచేసుకోవాలి.
మధువన నివాసి అనగా మధురత మరియు బేహద్ వైరాగి. ఎవరైతే బేహద్ వైరాగులుగా ఉంటారో
వారు ఆత్మనే చూస్తారు. నడవడికలో మధురత మరియు మనసులో బేహద్ వైరాగ్య వృత్తి రెండు
స్మృతిలో ఉండాలి. అలా ఉంటే పాస్ విత్ ఆనర్‌గా అవ్వరా? ఈ రెండు లక్షణాలను
స్వయంలో ధారణ చేసి వెళ్ళాలి.
ఇది సంగమ యుగం యొక్క అమూల్య సమయం. ఇది ఎంత ఎక్కువ
ఉంటే అంత మంచిది. కల్పమంతటిలో తండ్రి మరియు పిల్లల యొక్క మిలనం ఇప్పుడు తప్ప
మరెప్పుడూ జరగదు. అందువలనే ఈ సంగమయుగ సమయం ఎక్కువసేపు ఉండాలనుకుంటారు. అంతేకానీ
మీ బలహీనత వలన కాదు. సదా ఇదే లక్ష్యం పెట్టుకోండి - ఎవరెడీగా ఉండాలని,
అతీంద్రియ సుఖం యొక్క వారసత్వాన్ని నిరంతరం అనుభవం చేసుకునేటందుకు ఉన్నారు కానీ
మీ బలహీనతల వలన కాదు. మీకైతే ఈ పాత ప్రపంచం విదేశం లాంటిది. కొందరు విదేశీ
వస్తువులను తాకరు. స్వదేశీ వస్తువులను మాత్రమే ఉపయోగించాలని అనుకుంటారు. ఇలాగే
మీరు ఈ పాత ప్రపంచాన్ని అనగా విదేశీ వస్తువును టచ్ చేయకూడదు. స్వదేశీలు మీరు
అవునా లేక విదేశీ వస్తువులకు ఆకర్షితం అయిపోతున్నారా? సదా మేము స్వదేశీ అని
భావించండి. ఈ విదేశీ వస్తువులను తాకనే తాకకూడదు. మీ ఉన్నత దేశం అనగా ఆత్మ
రూపంతో పరంధామమే మీ దేశం. ఈశ్వరీయ పరివారం యొక్క లెక్కతో చూస్తే మధువనమే మీ
దేశం, రెండుదేశాల యొక్క నషా పెట్టుకోవాలి. మేము స్వదేశీయులము. విదేశీ
వస్తువులను తాకము. ఇప్పుడు శక్తిశాలి రచయితగా అవ్వండి. రచయితయే బలహీనంగా ఉంటే
ఇంకేమి రచన చేస్తారు. అలంకారిగా అయి వెళ్లాలి. నిరంతరం ఏకీరస స్థితిలో
స్థితులయ్యే ఉదాహరణగా తయారై చూపించాలి. అందరికీ సాక్షాత్కారం అవ్వాలి.
ద్వాపరయుగంలో భక్తులు సాక్షాత్కారం చేసుకుంటారు. కానీ ఇక్కడ దైవీ పరివారం అందరూ
సాక్షాత్కారమూర్తి అయిన మీ ద్వారా సాక్షాత్కారం చేసుకోవాలి. కనుక జమా
చేసుకోవాలి. సంపాదించడం మరియు తినేయడం.... ఇదైతే 63 జన్మల నుండి చేస్తూ
వచ్చారు. ఇప్పుడు జమ చేసుకునే సమయం. పోగొట్టుకునే సమయం కాదు. మంచిది. మీలో
ప్రకాశం ఉంటే మీరు ఏ కర్మ చేసినా సంకల్పం చేసినా అది యదార్థంగా ఉంటుంది. కనుక
ప్రకాశ స్వరూపులుగా అనగా పారదర్శకంగా అవ్వండి. ఈ భట్టి పాండవభవనం అంతటిని
పారదర్శకంగా, చైతన్య ప్రదర్శినిగా తయారుచేస్తుంది. అందరికీ సాక్షాత్కారం
చేయించే ఆకర్షణ ఉండాలి. అన్ని విషయాల్లో విజయం పొందాలి. మొదటి నెంబరులోకి
రావాలి. పాత సంస్కారాలు, సంకల్పాలు అన్నింటిని సర్దుకుని సమాప్తం చేసేయాలి.
తిరిగి మరలా రాకూడదు. ఏది కావాలనుకుంటే అది చేయగలరు. కానీ కోరికలో విల్ పవర్
ఉండాలి. ఆలోచన ఎంత శక్తివంతంగా ఉంటుందో వాయుమండలం కూడా అంతే శక్తివంతంగా
తయారవుతుంది. ఏ సమయంలో అయినా, ఎవరిలో అయినా బలహీనత వస్తే మీ శక్తిశాలి వృత్తి
యొక్క సహయోగం లభించడం ద్వారా వారు ముందుకు వెళ్లగలుగుతారు. బాబా ఏకరసంగా
ఉంటారు. మీరు కూడా బాబా సమానంగా తయారవ్వాలి. ఏది ఏమైనా ఆటగా భావించి దానిని
సమాప్తం చేయాలి. ఆటగా భావిస్తే సంతోషం ఉంటుంది. ఇప్పటి తిలకం జన్మ
జన్మాంతరాల్లో తిలకధారిగా, కిరీటధారిగా తయారుచేస్తుంది. సదా ఏకరసంగా ఉండాలి.
తండ్రిని అనుసరించాలి. ఎవరైతే స్వయం హర్షితంగా ఉంటారో వారు ఎలాంటి మనసు
కలిగినవారినైనా హర్షితం చేస్తారు. హర్షితంగా ఉండడం అనేది జ్ఞానం యొక్క గుణం.
దీంట్లో ఆత్మీయతను కలపండి చాలు. హర్షితంగా ఉండే సంస్కారం కూడా ఒక వరదానం. ఇది
సమయానికి చాలా సహయోగం ఇస్తుంది. మీ బలహీన సంకల్పం మిమ్మల్ని పడేయడానికి కారణం
అవుతుంది. అందువలన ఒక్క సంకల్పం కూడా వ్యర్ధంగా వెళ్లకూడదు. ఎందుకంటే సంకల్పాల
యొక్క విలువ కూడా ఇప్పుడు మీకు తెలుస్తుంది. సంకల్పం, వాచా, కర్మణా మూడూ
అలౌకికంగా ఉంటే మిమ్మల్ని ఈ లోకవాసులుగా భావించరు. మీ పాదాలు మీ భూమిపై
లేనట్టుగా భావిస్తారు. కనుక మీ బుద్ధి యొక్క తగుల్బాటు ఈ ప్రపంచంపై లేదు.
బుద్ధి అనే పాదం, దేహం అనే భూమి కంటే ఉన్నతంగా ఉంది. ఇది సంతోషానికి గుర్తు.
ఎంతెంత దేహాభిమానం నుండి బుద్ధి అతీతంగా ఉంటుందో అంతగా మిమ్మల్ని ఫరిస్తాగా
అనుభవం చేసుకుంటారు. ప్రతి కర్తవ్యం చూస్తూ బాబా స్మృతిలో ఎగురుతూ ఉండండి.
అప్పుడు ఆ అభ్యాసం యొక్క అనుభవం అవుతుంది. ఎగురుతూ ఉన్న స్థితిలో ఉండాలి.
మంచిది.