03.10.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


నిర్మానత యొక్క గుణం ద్వారా విశ్వ నిర్మాత.

ఈరోజు బాప్ దాదా ఎవరిని చూస్తున్నారు? మీరెవరు? ఈరోజు బాప్ దాదా మిమ్మల్ని ఏ రూపంలో చూస్తున్నారో మీకు తెలుసా? మాస్టర్ జ్ఞాన సాగరులు కాదా? మాస్టర్ జ్ఞాన సాగరులు అయితే బాబా ఏ రూపంలో చూస్తున్నారో మీకు తెలియదా? మీరు బాబాకు పిల్లలు సరే కానీ, పిల్లల్ని ఏ రూపంలో చూస్తున్నారు? వీరందరూ విశ్వ నిర్మాతలు అనే రూపంలో బాప్ దాదా చూస్తున్నారు. విశ్వ నిర్మాతలేనా? బాబాతో పాటు బాబా కర్తవ్యంలో సహాయకారులు కదా! కొత్త ప్రపంచాన్ని నిర్మించటం ఇదే కర్తవ్యం కదా? మరి ఆ కర్తవ్యంలోనే ఉన్నారా లేదా ఇప్పుడు ఉండాలా? అయితే విశ్వ నిర్మాతలుగా అవ్వలేదా? మేమందరం మాస్టర్ విశ్వ నిర్మాతలం అనే స్మృతి సదా ఉండాలి. ఇది సదా స్మృతిలో ఉండటం ద్వారా ఏ గుణం స్వతహాగా వస్తుంది? నిర్మానత. అర్ధమైందా? ఎక్కడ నిర్మానత మరియు సరళత సహజ రూపంలో ఉంటాయో అక్కడ ఇతర గుణాలు కూడా స్వతహాగానే వచ్చేస్తాయి. సదా ఇదే స్మృతి స్వరూపంలో స్థితులై ఉండి అప్పుడు ప్రతి సంకల్పం లేదా కర్మ చేయండి. అప్పుడు చిన్న చిన్న విషయాలు ఏవైతే మీరు ఎదుర్కోవలసి వస్తున్నాయో అవి వృద్ధుల ముందు చిన్న పిల్లల ఆటవలె అనిపిస్తాయి. చిన్న పిల్లలు నిర్లక్ష్యంగా ఏదైనా అనినా, చేసినా పాపం వీరికి ఏమీ తెలియదు, నిర్దోషులు, చిన్న పిల్లలు అని అనుకుంటారు కదా! వారిపై ఏ ప్రభావం పడదు. అదేవిధంగా స్వయాన్ని మాస్టర్ విశ్వ నిర్మాతగా భావించటం ద్వారా మాయ యొక్క ఈ చిన్న చిన్న విఘ్నాలు చిన్నపిల్లల ఆటల్లా అనిపిస్తాయి. ఒక చిన్న పిల్లవాడు పసితనపు అమాయకత్వంతో ముక్కు లేదా చెవి పట్టుకున్నా కూడా కోపం వస్తుందా? ఎందుకంటే పిల్లలు నిర్దోషులు, అమాయకులు అని వారికి తెలుసు. వారి దోషం ఏమీ కనిపించదు. అదేవిధంగా మాయ కూడా ఏ ఆత్మ ద్వారానైనా కానీ సమస్య లేదా విఘ్నం లేదా పరీక్షగా అయ్యి వస్తే ఆ ఆత్మలను నిర్దోషిగా భావించాలి. మాయయే ఆయా ఆత్మల ద్వారా తన ఆటను చూపిస్తుంది. మరయితే నిరోషిపై ఏ భావం ఉంటుంది? జాలి, దయ కలుగుతాయి కదా! ఈవిధంగా ఏదోక ఆత్మ నిమిత్తమవుతుంది. కానీ ఆ ఆత్మ నిర్దోషి. ఆ దృష్టితో ప్రతీ ఆత్మను చూడండి. అప్పుడు పురుషార్థం యొక్క వేగము ఎప్పుడైనా తగ్గుతుందా? ప్రతీ సెకను వృద్ధి కళ అనుభవం అవుతుంది. వృద్ధి కళలోకి వెళ్ళేటందుకు దీనిని అర్థం చేసుకునే కళ కావాలి. 16కళా సంపూర్ణంగా తయారవ్వాలి కదా! కనుక ఇది కూడా ఒక కళ. ఈ కళ మీకు వస్తే వృద్ది కళ వచ్చినట్లే. అలాంటి వారు ఎప్పుడూ ఆగిపోరు. వారి వేగము ఎప్పుడూ తగ్గదు. ప్రతీ సెకను వేగం పెరుగుతుంది. ఇప్పుడు ఇది ఆగే సమయమా ఏమిటి? ఆగి ఆ ఆత్మల యొక్క కారణం మరియు నివారణ; పరిష్కారాలు చేసే సమయమా ఇది? ఇప్పుడు మీరు చాలా వృద్ధులు అయిపోయారు. మీరు వానప్రస్థ స్థితిలోకి వెళ్ళాల్సిన సమయం ఇది. మీ ఇల్లు మీకు ఎదురుగా కనిపించటం లేదా? ఆఖరికి యాత్రను సమాప్తి చేసుకుని ఇంటికి వెళ్ళాలి. ఏ విషయం అయినా భిన్న భిన్న రూపాలతో, భిన్న భిన్న విషయాలతో ఎదురుగా వస్తున్న సమయంలో ముందుగా ఇలా అనుకోవాలి - ఇలాంటి సమస్యలను లేదా భిన్న భిన్న రూపాల విషయాలను ఎన్నోసార్లు పరిష్కరించాను మరియు అలా చేసి చేసి అనుభవీ అయిపోయాను. ఎన్నిసార్లు అనుభవీ అయ్యారో తెలుసా? అనేక సార్లు అయ్యారు, గుర్తుందా? కల్పపూర్వం వీటిని దాటారు, దాటవలసి ఉందా? లేక దాటారా? ఇంకా దాటాలా? అనేకసార్లు అనుభవీ అవ్వకపోతే ఇప్పుడు ఇంత సమీపంగా ఎలా రాగలరు? ఈ లెక్క తీయటం రావటం లేదా? పాండవులు అయితే లెక్కల్లో తెలివైనవారిగా ఉండాలి. కానీ శక్తులు మొదటి నెంబరు అయిపోయారు. ఈ స్మృతి స్పష్టంగా మరియు సరళంగా ఉండాలి. తెచ్చుకోవలసి రాకూడదు. కల్పపూర్వ విషయాన్ని ఇప్పటి వరకు కూడా బుద్ధిలోకి తెచ్చుకుంటూ ఉన్నట్లయితే ఏమంటారు? తప్పకుండా మాయ యొక్క ఆకర్షణ ఏదో ఉన్నట్లే, అందువలనే కల్పపూర్వపు విషయం యొక్క స్మృతి స్పష్టంగా లేదా సరళంగా రావట్లేదు. కనుకనే విఘ్నాలు దాటటం కష్టంగా అనుభవమవుతుంది. పురుషార్ధానికి లభించిన సమయాన్ని అనుసరించి, జ్ఞానం యొక్క ప్రకాశం మరియు శక్తి ఎంత లభించిందో దానిని అనుసరించి వర్తమాన సమయంలో కల్పపూర్వపు స్మృతి సహజంగా మరియు సరళంగా ఉండాలి. ఎంత స్పష్టంగా గుర్తుండాలంటే ఒక్క నిమిషం క్రితమే జరిగిన పని ఎంత బాగా గుర్తుంటుంది! గుర్తుంటుందా లేక అది కూడా మర్చిపోతున్నారా? 5000 సం||ల క్రితం జరిగిన విషయం కూడా అంతే స్పష్టంగా అనుభవమవ్వాలి. కెమేరా శక్తివంతమైనది అయితే ఒక్క సెకనులో చిత్రాన్ని ఎంత స్పష్టంగా తీస్తుందో కదా! ఎంత దూరంలోని దృశ్యం అయినా కానీ అది కూడా స్పష్టంగా ఎదురుగా వచ్చేస్తుంది. అయితే శక్తివంతమైన కెమెరామెన్ గా (ఫోటో తీసేవారు) అవ్వలేదా? కెమేరా ఉందా లేక ఎవరిదైనా తీసుకుని వాడుతున్నారా? శక్తివంతమైనదేనా? కల్పపూర్వపు చిత్రం దానిలో స్పష్టంగా వస్తుందా? మనస్సు అనేది ఉంది, ఇది పెద్ద కెమేరా! ప్రతీ సెకను యొక్క చిత్రం ఈ కెమేరాలో నిక్షిప్తం అవుతున్నాయా లేదా? కెమేరా అయితే అందరి వద్ద ఉంది. కానీ కొందరి కెమేరా దగ్గర దృశ్యాలను చిత్రం తీయగలదు, కొందరి కెమేరా చంద్రుని వరకు కూడా చిత్రం తీయగలదు. అవ్వటానికి అయితే అది కూడా కెమేరా, ఇది కూడా కెమేరాయే. కెమేరాల్లో చిన్న, పెద్ద ఉంటాయి కదా! ప్రతీ ఒక్కరి దగ్గర ఎంత శక్తివంతమైన కెమేరా ఉంది? విజ్ఞానం వారు ఇక్కడి నుండి చంద్రుని వరకు, అక్కడి నుండి ఇక్కడి చిత్రాలు తీస్తున్నారు కదా! అదేవిధంగా మీరు సాకార లోకంలో ఉంటూ నిరాకారి ప్రపంచం యొక్క, ఆకారి ప్రపంచం యొక్క లేదా ఈ సృష్టి అంతటి భూత భవిష్య చిత్రాలను తీయలేరా? కెమేరాని శక్తివంతం చేసుకోండి, దానిలో ఏ విషయమైనా, ఏ దృశ్యమైనా ఉన్నది ఉన్నట్లుగా కనిపించాలి. రకరకాలుగా కనిపించకూడదు. ఏది ఉంటే అది, ఎలా ఉంటే అలా స్పష్టంగా కనిపించాలి. అప్పుడే కెమేరా శక్తివంతంగా ఉన్నట్లు. అప్పుడు ఏ సమస్య అయినా సమస్యగా అనిపిస్తుందా లేక ఆటగా అనిపిస్తుందా? ఇప్పటి పరిస్థితిని బట్టి ఇలాంటి స్థితిని తయారుచేసుకోండి. అప్పుడే తీవ్ర పురుషార్ధి అని అంటారు. కెమేరాతో మొదట చిత్రాలు తీస్తూ ఉంటారు, వాటిని కడిగిన తర్వాత అవి ఎలా వచ్చాయో తెలుస్తుంది, అదేవిధంగా రోజంతటిలో మీ ఆటోమేటిక్ కెమేరా ద్వారా అనేకానేక చిత్రాలు తీస్తూ ఉంటారు. రాత్రి కూర్చుని ఎలాంటి చిత్రాలు తీశామో చూసుకోవాలి. ఏది ఎలా ఉందో అలాగే వచ్చిందా చిత్రం లేక కొంచెం తేడాగా వచ్చిందా! అప్పుడప్పుడు కెమేరా సరిగ్గా లేకపోతే తెలుపు రంగుతో ఉన్న వస్తువు కూడా నలుపుగా వస్తుంది, రూపం మారిపోతుంది, ఆకారం మారిపోతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా అప్పుడప్పుడు కెమెరా సరిగ్గా మరియు స్పష్టంగా లేని కారణంగా విషయం సమస్యగా అయిపోతుంది. విషయం యొక్క రూపురేఖ మారిపోతుంది, రంగు రూపం కూడా మారిపోతుంది. యదార్థానికి బదులు అయదార్థ రూపం కూడా వచ్చేస్తుంది ఒకొక్కసారి. అందువలన సదా మీ కెమెరాని స్పష్టంగా మరియు శక్తివంతంగా తయారు చేసుకోండి. స్వయాన్ని సేవాధారిగా భావించటం ద్వారా త్యాగం, తపస్సు అన్నీ వచ్చేస్తాయి. నేను సేవాధారిని, సేవ కోసమే ఈ జీవితం అని భావించటం ద్వారా ఒక్క సెకను కూడా సేవ లేకుండా ఉండలేరు. సదా స్వయాన్ని సేవాధారిగా భావిస్తూ నడవండి. మరియు స్వయాన్ని వృద్ధులుగా భావించాలి అప్పుడు చిన్న చిన్న విషయాలు ఆటబొమ్మల వలె కనిపిస్తాయి. దయా హృదయులు అయిపోతారు. తిరస్కారానికి బదులు దయ వస్తుంది. మంచిది.