05.10.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంపూర్ణతకి గుర్తు 16 కళలు.

ఇప్పుడు పురుషార్ధం యొక్క లక్ష్యం ఏమిటి? (సంపూర్ణంగా అవ్వటం). సంపూర్ణ స్థితి అని దేనిని అంటారు? సంపూర్ణ స్థితికి ఏ పటం ఎదురుగా పెట్టుకుంటారు? బాబా కూడా ఏదైతే సంపూర్ణ స్థితిని ధారణ చేశారో ఆ స్థితిలో ఏ విషయాలను చూశారు? ఇతరులకి చెప్పేటప్పుడు సంపూర్ణ స్థితి గురించి ఏమేమి వర్ణిస్తారు మీరు? ఈ జ్ఞానం ద్వారా సర్వగుణ సంపన్నులుగా, 16 కళా సంపూర్ణులుగా, సంపూర్ణ నిర్వికారిగా అవుతారని మీరు చెప్తారు కదా! సంపూర్ణ స్థితి గురించి ఇలాగే వర్ణిస్తారు కదా! సర్వ గుణాలు ఏమిటో, ఆ గుణాల జాబితా తెలుసు కదా! కానీ ఏవైతే 16 కళలు అని చెప్తారో, దాని యొక్క భావార్ధం ఏమిటి? ఇది సంపూర్ణ స్థితికి గుర్తు. ఎవరిలోనైనా ఏదైనా విశేషత ఉంటే వీరిలో ఈ కళ ఉంది అని అంటారు కదా! ఏడ్చేవారిని నవ్వించే కళ అనగా విశేషత కొందరిలో ఉంటుంది. కొందరిలో శుభ్రత యొక్క కళ, కొందరిలో చమత్కార బుద్ధి యొక్క కళ ఉంటాయి. కానీ 16 కళా సంపూర్ణులు అనగా వారి యొక్క ప్రతీ కర్మ కళ సమానంగా కనిపిస్తుంది. ఎవరి యొక్క కళను అయినా చూసేటందుకు ఎంత అభిరుచితో వెళ్తారు. అదేవిధంగా ఎవరైతే సంపూర్ణ స్థితిని పొందిన ఆత్మలు ఉంటారో వారి యొక్క ప్రతీ నడవడిక కళ రూపంలో ఉంటుంది మరియు చరిత్ర రూపంలో కూడా ఉంటుంది. అంటే విశేషత అయ్యింది కదా! ఎలాగైతే సాకార బాబా మాట్లాడటం, నడవటం అన్నింటిలో విశేషత చూశారు కదా! అంటే అది కళ అయ్యింది కదా! లేవటం, కూర్చోవటం, చూడటం, నడవటం అన్ని కళగా ఉండేవి. అందరికంటే అతీతంగా మరియు విశేషంగా ఉండేవి. ప్రతీ కర్మ కళ సమానంగా ఉండటం ప్రత్యక్షంగా చూశారు. కనుక 16 కళలు అనగా ప్రతి నడవడిక సంపూర్ణంగా కళ రూపంలో కనిపించాలి. వారినే 16 కళా సంపూర్ణులు అని అంటారు. కనుక సంపూర్ణ స్థితికి గుర్తు ఇదే - వారి యొక్క ప్రతీ కర్మ కళ సమానంగా కనిపిస్తుంది. అనగా విశేషంగా ఉంటుంది. దీనినే సంపూర్ణ స్థితి అని అంటారు. కనుక 16 కళా సంపూర్ణులుగా అయ్యే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నారో దాని యొక్క స్పష్టీకరణ ఇది. పరిశీలించుకోవాలి - నా దృష్టి కళాత్మకంగా ఇందా? నా మాటలు కళాత్మకంగా ఉన్నాయా? కళకే మచ్చ పడింది. కళంకితం అయ్యింది అని అంటుంటారు కదా! వాస్తవానికి కళ అనేది మంచి విషయం, కళే చనిపోయింది అనగా కర్మలో ఉండాల్సిన ఆకర్షణ శక్తి సమాప్తం అయిపోయింది అని అర్ధం. అయితే మరి మన ప్రతీ కర్మ కళ సమానంగా ఉందా? లేదా అనేది పరిశీలించుకోవాలి. గారడీవారు ఎంత సమయం తమ ఆటని చూపిస్తారో అంత సమయం వారి ప్రతి కదలిక కళాత్మకంగా ఉంటుంది. నడవటం, వస్తువుని చేతబట్టడం అన్ని కళ రూపంలో లిఖించుకుంటారు. అలాగే ఈ సంగమయుగం విశేష కర్మ అనే కళను చూపించే సమయం. కనుక సదా నేను వేదిక పై ఉన్నాను అని అనుభవం చేసుకోండి. ఈ విధంగా 16 కళా సంపూర్ణులుగా అవ్వాలి. వారి యొక్క ప్రతీ కర్మ కళా రూపంగా ఉంటుంది. కనుక వారి యొక్క ప్రతి కర్మకి అనగా గుణాలకు మహిమ జరుగుతుంది. దీనినే మరో మాటగా ప్రతీ కర్మ చరిత్ర సమానం అని అంటారు. ఆ కళా రూపాన్ని చూసి ఇతరులలో కూడా ప్రేరణ కలుగుతుంది. వారి యొక్క కర్మ సేవ చేస్తుంది. కళలు ప్రదర్శిస్తారు కదా! ఆ కళ వారి సంపాదనకి సాధనం అవుతుంది. అదేవిధంగా వీరి యొక్క ప్రతీ కర్మ కళ సమానంగా ఉండటమే కాదు, వారి యొక్క ఆ కర్మ అఖండ సంపాదనకి సాధనం అవుతుంది. ప్రతీ కర్మ కళ వలె ఉంటే అయస్కాంతం వలె అయిపోతారు. ఈరోజుల్లో చిన్న చిన్న కళాకారులు మార్గంలో నడుస్తూ, నడుస్తూ కూడా తమ కళని ప్రదర్శిస్తూ ఉంటారు. అప్పుడు జనం ప్రోగవుతారు. ఇది అయితే శ్రేష్ట కళ, మరయితే ఆత్మలు ఆకర్షితం అవ్వరా? ఇప్పుడు ఇంతగా పరిశీలించుకోవాలి. ఎవరైతే శ్రేష్ట ఆత్మగా అవుతారో వారి యొక్క ప్రతీ కర్మపై అందరి ధ్యాస ఉంటుంది. ఎందుకంటే వారి యొక్క ప్రతీ కర్మలో కళ ఉంటుంది. అందువలనే ప్రతీ కర్మకి మందిరంలో పూజ జరుగుతుంది. పెద్ద పెద్ద మందిరాలు ఏవైతే ఉంటాయో అక్కడ మేల్కొల్పు దర్శనం, శయన సేవకి దర్శనం, నైవేద్యానికి దర్శనం, స్నాన కార్యక్రమ దర్శనం... ఇలా వేర్వేరు కర్మకి వేర్వేరు దర్శనాలు ఉంటాయి. దానికి గల కారణం ఏమిటి? ఎందుకంటే ప్రతీ కార్యాన్ని కళ రూపంలో చేశారు. అందువలనే స్మృతిచిహ్నం నడుస్తుంది. సాకార బాబా యొక్క ప్రతీ కర్మను చూడాలనే అభిరుచి మీకు ఎందుకు ఉండేది? ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్నా కానీ, తెలిసినా కానీ, అర్ధమైనా కానీ, చూస్తూనే ఉన్నా కానీ మరలా మరలా చూడాలనే ఆసక్తి ఎందుకు ఉండేది? ఒక్క కర్మని కూడా చూడకుండా ఉండలేకపోయేవారు. గారడీవారు చేసేది ఒక్కటి మిస్ అయినా కానీ ఎన్నో మిస్ అయినట్లు భావిస్తారు. ఎందుకంటే వారి ప్రతీ కర్మ కళ. అదేవిధంగా ఇక్కడ కూడా ఎలా నిద్రపోతారో కూడా చూడాలనే కోరిక ఉండేది. నిద్రలో కూడా కళ ఉండేది. ప్రతీ కర్మలో కళ ఉండేది. దీనినే 16 కళా సంపూర్ణం అని అంటారు. మంచిది, ఇలాంటి స్థితి తయారయ్యిందా? లక్ష్యం నుండి లక్షణాలను ధారణ చేయవలసి ఉంటుంది. ప్రతీ కర్మ కళా రూపంగా ఉండేటందుకు, 16 కళా సంపూర్ణులుగా అయితే సర్వ గుణాల యొక్క ధారణ కూడా స్వతహాగానే అయిపోతుంది. మంచిది.