24.10.1971        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


దృష్టి ద్వా రా అద్భుతం చేసే విధి.

స్వ స్వరూపం, స్వ దేశం, స్వ ధర్మం, శ్రేష్ట కర్మ, శ్రేష్ట స్థితిలో స్థితులై నడుస్తున్నారా? ఎందుకంటే వర్తమాన సమయంలో ఈ స్వ స్థితి యొక్క శక్తి ద్వారానే సర్వ పరిస్థితులను దాటగలరు. అనగా పాస్ విత్ ఆనర్ కాగలరు. కేవలం స్వ అనే పదాన్ని గుర్తుంచుకున్నా కానీ స్వ స్వరూపం, స్వధర్మం, స్వ దేశం స్వతహాగానే గుర్తుంటాయి. అయితే స్వ అనే ఒక పదాన్ని గుర్తు పెట్టుకోలేరా? స్వ స్వరూపం మరియు స్వ ధర్మంలో స్థితులవుతూ ఆత్మలందరినీ స్వదేశిగా తయారుచేయవలసిన అవసరం ఉంది. మరయితే ఏ కర్తవ్యం కోసం నిమిత్తమయ్యారో లేదా ఏ కర్తవ్యం కోసం అవతరించారో ఆ కర్తవ్యాన్ని లేదా స్వయాన్ని తెలుసుకుని అంగీకరించి కూడా కూడా మర్చిపోతున్నారా? ఎవరైనా లౌకిక కర్తవ్యం చేస్తూ ఆ కర్తవ్యం ఏమిటో మర్చిపోతారా? వైద్యుడు వైద్యం అనే కర్తవ్యాన్ని నడుస్తూ తిరుగుతూ, తింటూ త్రాగుతూ లేదా అనేక పనులు చేస్తున్నా కానీ వైద్యం నా కర్తవ్యం అని మర్చిపోతారా? బ్రాహ్మణులైన మీ యొక్క జన్మ మరియు కర్మ ఇదే - సర్వాత్మలకు స్వ స్వరూపం మరియు స్వ ధర్మం యొక్క స్థితిలో స్థితుల్ని చేయటం. మరయితే బ్రాహ్మణుల యొక్క లేదా బ్రహ్మాకుమారీ కుమారులైన మీ కర్తవ్యాన్ని మర్చిపోతున్నారా?

రెండవ విషయం - ఏ వస్తువు అయినా ఎల్లప్పుడూ మనతో పాటు లేదా మన ఎదురుగా ఉంటే దానిని ఎప్పుడైనా మర్చిపోతామా? అయితే మనకి అతి సమీపాతి సమీపంగా మరియు సదా మన వెంట ఉండేది ఏది? ఆత్మకి సదా సమీపంగా మరియు సదా వెంట ఉండేది ఏది? శరీరం లేదా దేహం. ఇది సదా వెంట ఉంటుంది, కనుక నిరంతరం గుర్తుంటుంది. మర్చిపోవాలన్నా కానీ మర్చిపోలేరు. అదేవిధంగా ఇప్పుడు శ్రేష్టాత్మలైన మీకు సదా సమీపంగా మరియు సదా తోడుగా ఉండేవారు ఎవరు? బాప్ దాదా సదా మీ తోడు మరియు సదా సన్ముఖం, దేహమనేది మీతో పాటు ఉంటుంది. కనుక దేహాన్ని మీరు ఎప్పుడూ మర్చిపోరు. మరయితే బాబా అంత సమీపంగా ఉన్నా కానీ ఎందుకు మర్చిపోతున్నారు? ప్రస్తుత సమయంలో ఏ ఫిర్యాదు చేస్తున్నారు? బాబా స్మృతి మర్చిపోతున్నామని, చాలా జన్మలుగా మీతో పాటు ఉన్న దేహాన్ని లేదా దేహ సంబంధాలను మర్చిపోవటం లేదు. కానీ ఎవరి ద్వారా సర్వ ఖజానాలు ప్రాప్తిస్తాయో మరియు సదా ఎవరికి దగ్గరగా ఉంటున్నారో వారిని ఎందుకు మర్చిపోతున్నారు? ఎక్కించే వారు గుర్తు ఉండాలా లేక మిమ్మల్ని పడవేసేవారు గుర్తు ఉండాలా? మిమ్మల్ని మోసం చేసేవారు పొరపాటున అయినా గుర్తు వస్తే వారిని తొలగిస్తారు కదా! మరయితే మిమ్మల్ని పైకి ఎక్కించే బాబాని ఎందుకు మర్చిపోతున్నారు? ఎప్పుడైతే బ్రాహ్మణులు తమ స్వ స్థితి, స్వ స్మృతిలో లేదా శ్రేష్ట స్థితిలో స్థితులవుతారో అప్పుడే ఇతరాత్మలను కూడా స్థితులు చేయగలరు. ఈ సమయంలో మీరందరు బాబాతో పాటు ఈ కర్తవ్యం కోసం నిమిత్తమై ఉన్నారు. ప్రతీ ఆత్మకి చాలాకాలంగా ఏ కోరిక లేదా ఆశ ఉంది? నిర్వాణ లేదా ముక్తిధామానికి వెళ్ళిపోవాలనే కోరిక అనేకాత్మలకు చాలాకాలం నుండి ఉండిపోయినది. చాలాకాలం నుండి ఉన్న ఆశను పూర్తి చేసే కర్తవ్యం కోసం బ్రాహ్మణులైన మీరు నిమిత్తులు, ఎప్పటి వరకు అలాంటి స్థితిని తయారుచేసుకోరో అప్పటి వరకు ఈ కర్తవ్యాన్ని ఎలా చేయగలరు? ముక్తి - జీవన్ముక్తి పొందాలి అనే మీ కోరికనే పూర్తి చేసుకోకపోతే ఇతరులది ఎలా పూర్తి చేస్తారు? ముక్తి లేదా జీవన్ముక్తి యొక్క వాస్తవిక అనుభవం ఎలా ఉంటుందో అది ముక్తి లేదా జీవన్ముక్తి ధామంలో అనుభవం చేసుకుంటారా? ముక్తిలో ఉన్నప్పుడు అయితే అనుభవం చేసుకోవటం కూడా ఉండదు, అతీతంగా ఉంటారు మరియు జీవన్ముక్తిలో ఉన్నప్పుడు జీవన బంధన అంటే ఏమిటో తెలియదు. జీవన్ముక్తిలో ఉంటారు. కనుక అప్పుడు ఏమి అనుభవం చేసుకుంటారు? బాబా ద్వారా ముక్తి - జీవన్ముక్తి యొక్క వారసత్వం ఏదైతే ప్రాప్తిస్తుందో దాని యొక్క అనుభవాన్ని ఇప్పుడే చేసుకోగలరు. నిర్వాణ స్థితి లేదా ముక్తి స్థితి ఏమిటో ఇప్పుడే తెలుసుకోగలరు. ముక్తి జీవన్ముక్తి యొక్క అనుభవాన్ని ఇప్పుడే చేసుకోవాలి. ఎప్పుడైతే స్వయం ముక్తి జీవన్ముక్తి యొక్క అనుభవిగా అవుతారో అప్పుడే ఇతరాత్మలకు ముక్తి అనగా తమ ఇంటికి మరియు తమ రాజ్యం అనగా స్వర్గద్వారాన్ని దాటే ప్రవేశ అనుమతి పత్రాన్ని ఇవ్వగలుగుతారు. ఏ ఆత్మకి అయినా ప్రవేశ అనుమతి పత్రాన్ని ఇవ్వకపోయినట్లయితే వారు ద్వారాన్ని దాటలేరు. కనుక ముక్తి జీవన్ముక్తి ధామం యొక్క ప్రవేశ అనుమతి పత్రాన్ని తీసుకునేటందుకు మీ వద్ద చాలా పెద్ద వరుస (క్యూ) ఉంటుంది. ఆ ప్రవేశ అనుమతి పత్రాన్ని తీసుకోవటంలో ఆలస్యం అయితే సమయం దాటిపోతుంది. అందువలన స్వయాన్ని సదా స్వ స్వరూపం, స్వ ధర్మం, స్వ దేశిగా భావించటం ద్వారా, సదా ఈ స్థితిలో స్థితులై ఉండటం ద్వారా ఒక్క సెకండులో ఏ ఆత్మకి అయినా దృష్టి ద్వారా అద్భుతం చేయగలరు. మీ యొక్క కళ్యాణకారి వృత్తి ద్వారా వారికి స్మృతిని ఇప్పించి ప్రతీ ఆత్మకి ప్రవేశ అనుమతి పత్రాన్ని ఇవ్వగలరు. దాహంతో ఉన్న ఆత్మలు శ్రేష్టాత్మలైన మీ దగ్గరకి తమ జన్మజన్మల ఆశను పూర్తి చేసుకునేటందుకు దానం అడిగేటందుకు వస్తారు. మరయితే మీ దగ్గర సర్వశక్తులు జమ అయ్యి ఉన్నాయా? మాస్టర్ సర్వశక్తివంతులై ఒక్క సెకండులో విధి ద్వారా సిద్దిని ఆ ఆత్మలకు ప్రాప్తింప చేయగలగాలి. విజ్ఞాన శక్తి రోజురోజుకీ కాలము అనగా సమయంపై విజయం పొందుతూ వెళ్తుంది. ప్రతీ కార్యాన్ని చాలా కొంచెం సమయంలో విధి ద్వారా చేయగల సిద్ధిని పొందుతూ వెళ్తున్నారు. స్విచ్ వేయగానే పని అయిపోతుంది, ఇదే విధి. మరయితే మాస్టర్ రచయితలు అయిన మీరు మీ యొక్క శాంతిశక్తి ద్వారా సర్వాత్మలకు ఒక్క సెకండు యొక్క విధి ద్వారా సిద్ధిని ఇవ్వలేరా? ఇప్పుడు ఈ శ్రేష్ట సేవ అవసరం. ఇలాంటి సేవాధారిగా, భగవంతుని సహాయకారులుగా తయారవ్వండి. నయనాలలో ఉన్న ఈశ్వరీయ నషా అద్భుతం చేసి చూపాలి. ఎందుకంటే ఆత్మలు అనేక జన్మలుగా అనేక రకాల సాధనలు చేసిచేసి అలసిపోయారు. ఇప్పుడు సిద్ధిని కోరుకుంటున్నారు, కాని సాధనను కాదు. సిద్ధి అనగా సద్గతి. ఈ విధంగా తపిస్తున్న దప్పికతో ఉన్న, అలసిన ఆత్మలకు శ్రేష్టాత్మలైన మీరు తప్ప వారి దాహాన్ని మరెవరు తీర్చగలరు? అనగా సిద్ధిని ప్రాప్తింప చేయగలరు? మీరు తప్ప ఏ ఆత్మ అయినా చేయగలరా? అనేకసార్లు చేసిన మీ శ్రేష్ట కర్తవ్యం స్మృతిలోకి వస్తుందా? ఎంతెంత శ్రేష్ఠ స్థితి తయారు చేసుకుంటూ వెళ్తారో అంతంత ఆత్మల పిలువు యొక్క ఆలాపన, శక్తులైన మిమ్మల్ని ఆహ్వానించే ఆలాపన..దప్పికతో ఉన్న అనాధ ఆత్మల ముఖం, అలసిపోయి ఉన్న ఆత్మల యొక్క ముఖాలు కనిపిస్తాయి.అది స్థాపనా కార్యంలో సాకార బ్రహ్మాబాబా యొక్క అనుభవం ఉదాహరణగా చూశారు కదా! ఆత్మలసేవ చేయకుండా ఉండగలిగేవారా? సేవ తప్ప మరేదైనా కనిపించేదా? అదేవిధంగా మీరు కూడా ఆత్మలకు సిద్ధిని ప్రాప్తింప చేసే కార్యంలో నిమగ్నమవ్వండి. అప్పుడు ఈ చిన్న చిన్న విషయాలో మీ సమయం, మీరు జమ చేసుకున్న శక్తులు ఏవైతే పోతున్నాయో అవన్నీ రక్షించబడతాయి మరియు జమ కూడా అవుతాయి. ఒక్క సెకండులో మీ యొక్క శక్తిశాలి వృత్తి ద్వారా బేహద్ ఆత్మలకు సేవ చేయగలరు. మరయితే మీ యొక్క హద్దులోని చిన్న చిన్న విషయాలలో సమయం ఎందుకు పోగొడుతున్నారు? బెహద్ లో ఉండండి. అప్పుడు హద్దులోని విషయాలు స్వతహాగానే సమాప్తం అయిపోతాయి. మీరు హద్దులోని విషయాలలో సమయాన్ని వ్యర్థం చేసుకుని ఆ తర్వాత బెహద్ స్థితులవ్వాలని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఆ సమయం గడిచిపోయింది. ఇప్పుడు బేహద్ సేవలో సదా తత్పరులై ఉండండి. అప్పుడు హద్దులోని విషయాల నుండి స్వతహాగానే ముక్తులై పోతారు. ఇతరాత్మలకు మీరు చెప్తారు కదా - భక్తిలో సమయాన్ని నాశనం చేసుకోవటం అంటే బొమ్మలాటలో మీ సమయాన్ని నాశనం చేసుకోవటం అని, ఎందుకంటే ఇప్పుడు భక్తి కాలం సమాప్తం కానున్నదని చెప్తారు కదా మీరు, మరయితే మీరు హద్దులోని విషయాల యొక్క బొమ్మలాటలో సమయాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? ఇది కూడా బొమ్మలాటయే కదా! దీని ద్వారా ఏ ప్రాప్తి లేదు, సమయం వ్యర్ధం - శక్తి వ్యర్థం. కనుక బాబా కూడా చెప్తున్నారు - ఇప్పుడు ఈ బొమ్మలాట యొక్క సమయం సమాప్తం కానున్నది. ఈరోజుల్లో ఏదైనా కొత్త ఫ్యాషన్ వస్తే ఇంకా పాత ఫ్యాషన్లోనే ఉంటే ఏమంటారు? కనుక చిన్న చిన్న విషయాలలో సమయం పోగొట్టడం అనేది పాత ఫ్యాషన్. ఇప్పుడు అది చేయకూడదు. మీరు కూడా కొందరికి చెప్తే వింటారు కదా - ఇప్పటి సమయ ప్రమాణంగా సంభాళించండి, పాత తరం వారిలా సంభాళించకండి అని, ఫలానా వారిది పాత పద్ధతి, వీరిది కొత్త పద్ధతి అని అంటారు కదా! మిమ్మల్ని మీరు సంభాళించుకోవటం కూడా పాత పద్ధతి అనుసారంగా ఉండకూడదు. ఎలాగైతే ఇతరులను పాత పద్ధతిలో సంభాళించటం మంచిగా అనిపించటం లేదో, అలాగే మీ కొరకు కూడా ఇప్పటి వరకు పాత పద్ధతినే ఎందుకు అవలంభిస్తున్నారు? ఇప్పుడు పరివర్తనా రోజుని జరుపుకోండి. ప్లానింగ్ బుద్ధి గల పార్టీ వచ్చారు. ప్లానింగ్ పార్టీ వారికి క్రొత్త ప్లాను ఇస్తున్నారు. ప్రభుత్వం వారు కూడా ఒకొక్క తారీఖున ఒకొక్క విశేష రోజుని జరుపుతూ ఉంటారు. అలాగే మీరు కూడా ఇక్కడికి వచ్చారు. కనుక మీ పాత ఆచారవ్యవహారాలు మరియు పురుషార్థాన్ని పరివర్తన చేసుకునే రోజుగా జరుపుకోండి. కానీ హద్దులో కాదు, బేహద్ గా, మధువన యజ్ఞభూమికి వచ్చారు. యజ్ఞంలో అగ్ని ఉంటుంది. అగ్నిలో ఏ వస్తువు వేసినా త్వరగా మలచబడుతుంది. అదేవిధంగా ఎలాంటి స్వరూపంగా తయారుకావాలనుకుంటే ఆ స్వరూపంగా తయారుకావాలి. యజ్ఞానికి వచ్చారంటే మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకోవాలంటే అలా తయారు చేసుకోవాలి. సహజంగానే తయారు కాగలరు. మంచిది.