21.01.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


నిరంతర యోగిగా అయ్యేటందుకు సహజవిధి.

 ఎలా అయితే ఒక్క సెకనులో స్విచ్ ఆన్ చేయటం, ఆఫ్ చేయటం జరుగుతుందో అలాగే ఒక సెకనులో శరీరాన్ని ఆధారంగా తీసుకోవాలి మరియు ఒక సెకనులో శరీరానికి అతీతంగా అశరీరీ స్థితిలో స్థితులవ్వాలి. ఈ స్థితి వస్తుందా? ఇప్పుడిప్పుడే శరీరంలోకి రావాలి, మరియు ఇప్పుడిప్పుడే అశరీరి అవ్వాలి. ఈ అభ్యాసం చేయాలి దీనినే కర్మాతీత స్థితి అని అంటారు. ఎలా అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్త్రాన్ని ధారణ చేయటం మరియు ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్త్రాన్ని విడిచి పెట్టడం ఇది మీ చేతుల్లో ఉంటుంది కదా! అవసరం అయినప్పుడు వస్త్రాన్ని ధరిస్తారు లేదా అవసరం లేనప్పుడు విడిచి పెట్టేస్తారు. అలానే అవసరం అయినప్పుడు ఈ శరీరాన్ని ధారణ చేయాలి మరియు అవసరం అయిపోయిన తర్వాత ఈ శరీరానికి అతీతం అయిపోవాలి. ఇలాంటి అనుభవం ఈ శరీర రూపి వస్త్రంతో ఉండాలి. కర్మ చేస్తూ కూడా ఒక వస్త్రాన్ని ధారణ చేసి కార్యం చేస్తున్నాను అనే స్థితి ఉండాలి. కార్యం పూర్తి కాగానే వస్త్రానికి అతీతం అయిపోవాలి. ఇలా శరీరం మరియు ఆత్మ రెండింటి అతీత స్థితి నడుస్తూ, తిరుగుతూ అనుభవం కావాలి. ఏదైనా అభ్యాసం చేయాలి కదా! అలాగే ఈ అతీత స్థితి కూడా అభ్యాసం చేయాలి, కానీ ఈ అభ్యాసం ఎవరికి ఉంటుంది? ఎవరైతే శరీరంతో, శరీర సంబంధాల యొక్క విషయాలతో, శారీరక ప్రపంచంతో, సంబంధంతో, వస్తువులతో పూర్తిగా అతీతంగా ఉంటారో, కొంచెం కూడా తగుల్పాటు ఉండదో వారే ఈ దేహానికి అతీతంగా కాగలుగుతారు. సూక్ష్మ సంకల్పంలో అయినా మీకు అతీతస్థితి లేకుండా తేలికతనం ఉన్నట్లైతే మీకు అతీత స్థితి అనుభవం అవ్వదు. ఇప్పుడు మహారథీలు ఈ అభ్యాసం చేయాలి. మీ ద్వారా పూర్తిగా అతీత స్థితి అందరికి అనుభవం కావాలి. ఈ స్థితి ద్వారా ఇతరాత్మలకు కూడా మీ ద్వారా అతీత స్థితి అనుభవం అవుతుంది. ఎలా అయితే యోగంలో కూర్చున్న సమయంలో ఈ వ్యాయామం చేయించేవారు. అతీతమైనవారు అతీత స్థితిలో ఉన్నారు అని అనుభవం అవుతుంది కదా! అలాగే మీ ద్వారా నడుస్తూ, తిరుగుతూ ఫరిస్తా స్థితి యొక్క సాక్షాత్కారం అవ్వాలి. మీరు ఇక్కడ కూర్చున్నా కూడా అనేకాత్మలకు అంటే మీ సత్యయుగి కుటుంబంలోకి వచ్చే ఆత్మలకు మీ ఫరిస్తా రూపం మరియు భవిష్య రాజ్య పదవి రెండింటి సాక్షాత్కారం జరగాలి. ఎలా అయితే ఆదిలో బ్రహ్మాబాబా, శ్రీకృష్ణుని స్వరూపం రెండు వెనువెంట సాక్షాత్కారం అయ్యేవో అలాగే మీ యొక్క ఫరిస్తా యొక్క సంపూర్ణ స్వరూపం మరియు భవిష్య రాజ్య రూపం రెండింటి డబుల్ రూపం సాకాత్కారం అవ్వాలి. ఎవరైతే నెంబర్ వారిగా ఈ స్థితిని తయారుచేసుకుంటూ ఉంటారో అంతగా మీ ద్వారా ఇతరులకు ఈ రెండు రూపాలు సాక్షాత్కారం అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మీ అందరికి ఈ పూర్తి అభ్యాసం అయిపోతుందో అప్పుడు నలువైపుల నుండి, అక్కడి నుండి, ఇక్కడ నుండి ఇదే సమాచారం రావటం ప్రారంభం అవుతుంది. ఎలా అయితే ఆదిలో ఇంట్లో కూర్చొని ఉండగానే సమీపంగా వచ్చిన ఆత్మలకు సాక్షాత్కారాలు జరుగుతూ ఉండేవి. అలాగే అంతిమంలో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. అంటే మీరు ఇక్కడ కూర్చొని సూక్ష్మ సేవ చేయగలుగుతారు. ఇప్పుడు ఈ సేవ జరుగనున్నది. సాకారంలో అందరు ఉదాహరణ చూసారు కదా! కనుక అన్ని విషయాలు డ్రామానుసారం నెంబర్‌ వారీగా జరుగుతూ ఉంటాయి. ఇలా మీరు ఎంతెంతగా స్వయం ఆకారి ఫరిస్తా రూపంగా అవుతూ ఉంటారో అంతంతగా ఫరిస్తా రూపం సేవ చేస్తుంది. ఆత్మకు మొత్తం విశ్వం చక్రం తిరగటానికి ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు మీరు మీ సూక్ష్మ స్వరూపంతో సేవ చేయాలి. కానీ ఎవరు చేయగలుగుతారు? ఎవరైతే అతీత స్థితిలో ఉంటారో వారే సూక్ష్మ సేవను చేయగలుగుతారు. స్వయం మీరు ఫరిస్తా రూపంలో స్థితులవ్వాలి. ఆదిలో అందరికి సాక్షాత్కారాలు జరిగేవి కదా! బ్రహ్మాబాబా యొక్క ఫరిస్తా రూపం అంటే సంపూర్ణ స్థితి యొక్క రూపం కూడా కనిపించేది మరియు వర్తమాన పురుషార్థీ రూపం కూడా అందరికి వేరు వేరుగా సాక్షాత్కారాలు అయ్యేవి. అలాగే సాకార బ్రహ్మ మరియు సంపూర్ణ బ్రహ్మ ఈ రెండింటి సాక్షాత్కారాలు కూడా పిల్లలకు జరుగుతూ ఉండేవి. అలాగే అంతిమంలో అనన్య పిల్లల సాక్షాత్కారం కూడా అందరికి జరుగుతుంది. ఈ సేవ ద్వారానే ప్రభావం పడుతుంది. అప్పుడే అలజడి ప్రారంభం అవుతుంది. సాకార శరీరం ద్వారా మీరు ఏమీ చేయలేరు. ఈ సూక్ష్మసేవ ద్వారానే ఎక్కువ ప్రభావం పడుతుంది. ఆదిలో కూడా సాక్షాత్కారాల ద్వారానే ప్రభావం పడింది కదా! పరోక్షంగానైనా, అపరోక్షంగానైనా ఆ సాక్షాత్కారాల అనుభవంతో బాబా జ్ఞానం యొక్క ప్రభావం అందరి మీద పడింది. అలాగే అంతిమంలో కూడా ఇదే సేవ జరుగుతుంది. మీ సంపూర్ణ స్వరూపం యొక్క సాక్షాత్కారం జరుగుతుందా? ఇప్పుడు అందరు ఎక్కువగా శక్తులను పిలుస్తున్నారు. ఇప్పుడు పరమాత్మను తక్కువ పిలుస్తున్నారు. దేవతలైన మిమ్మల్ని, శక్తులైన మిమ్మల్ని ఎక్కువగా చాలా వేగంతో పిలుస్తున్నారు. కనుక ఇప్పుడు మీరందరు దేవతలుగా సాక్షాత్కారం అయ్యేటందుకు మధ్య మధ్యలో ఈ అభ్యాసం చేస్తూ ఉండాలి. ఈ అభ్యాసం మీకు అలవాటు అయిపోతే చాలా ఆనందం అనుభవం అవుతుంది. ఇప్పుడు ఒక సెకనులో ఆత్మ శరీరం నుండి అతీతం అయిపోవాలి. ఈ అభ్యాసం అవ్వాలి, ఇప్పుడు ఈ పురుషార్థం చేయాలి. వర్తమాన సమయంలో పురుషార్థుల యొక్క మూడు స్థితులు బాబా చూస్తున్నారు. ఈ మూడు స్థితుల ద్వారా ప్రతి ఒక్కరు తమ శక్తిననుసరించి పాస్ అవుతూ వస్తున్నారు. ఆ మూడు స్థితులు ఏమిటి? ఒకటి - వర్ణన, రెండు - మననం, మూడు - మగ్నస్థితి. చాలా మంది వర్ణనలో ఎక్కువగా ఉన్నారు. అంటే జ్ఞానాన్ని వర్ణించటంలో తెలివైనవారిగా ఉన్నారు, కానీ ఆ జ్ఞానాన్ని మననం చేయటం, ఆ జ్ఞానంలో నిమగ్నమవ్వటం ఈ లోపం ఉన్న కారణంగా ఆత్మలలో ఆత్మిక శక్తి తక్కువ అయిపోతుంది. కేవలం జ్ఞానాన్ని వర్ణన చేయటం ద్వారా బాహర్ముఖత యొక్క శక్తి కనిపిస్తుంది. కానీ దాని ద్వారా ఎవ్వరికి ప్రభావం పడటం లేదు. మననం కూడా చేస్తున్నారు, కానీ అంతర్ముఖి అయ్యి బాబా పాయింట్ను మననం చేయండి. ఇప్పుడు దీని లోపం ఉంది. బాబా పాయింట్స్ చాలా మంచిగా మననం చేస్తున్నారు, కానీ ప్రతి పాయింట్ ద్వారా మననం చేయటం లేదా మననం చేయటం ద్వారా ఆ శక్తి స్వరూపం యొక్క వెన్న తీయటం దీనిలో లోపం ఉంది. భలే మీరు చాలా ప్లాన్ తయారు చేస్తున్నారు. దానితో పాటు సర్వశక్తుల యొక్క అలంకరణ కూడా మీకు ఉండాలి. అది ఉండటం లేదు. ఏ వస్తువైనా ఎంత విలువైనది అయినా దానిని ఒకవేళ ఆ రూపంతో అలంకరించి పెట్టకపోతే ఆ వస్తువు యొక్క విలువ ఎవ్వరికి తెలియదు. అలాగే మీరు కూడా జ్ఞానం యొక్క మననం చేస్తున్నారు. కానీ ఒకొక్క పాయింట్ ద్వారా మీకు ఏదైతే శక్తి లభిస్తుందో ఆ శక్తిని తక్కువ నింపుకుంటున్నారు. అందువలన జ్ఞానం యొక్క విలువ కూడా తెలియటం లేదు. దానితో పాటు శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ వస్తుంది. మనస్సులో అయితే చాలా ఉల్లాసాలతో మంచి ప్లాన్స్ తయారు చేస్తున్నారు. కానీ ప్రత్యక్షంలో ఫలితం చూస్తే ఉల్లాసాలనేవి మనస్సులో అవినాశిగా ఉండటం లేదు. ఏ ఫోర్స్ అయితే ఏకరసంగా ఉండాలో, అది పిల్లలలో ఉండటం లేదు. బాబా చెప్పిన ఒకొక్క పాయింటుని మననం చేయటం ద్వారా ఎటువంటి శక్తి నిండుతుంది? ఈ అనుభవంలో అందరు తెలివి తక్కువగా ఉన్నారు. అందుకు బాబా జ్ఞానం ద్వారా వచ్చేటువంటి అంతర్ముఖతను, అతీంద్రియ సుఖం యొక్క అనుభవం చేసుకోలేకపోతున్నారు. ఇలా ఎప్పటి వరకు జ్ఞాన ప్రాప్తుల యొక్క అతీందియ సుఖాన్ని, సర్వప్రాప్తులను అనుభవం చేసుకోరో అప్పటి వరకు అల్పకాలికంగా ఏదోక వస్తువు మనల్ని ఆకర్షితం చేస్తూ ఉంటుంది. కనుక వర్తమాన సమయంలో మననశక్తి ద్వారా ఆత్మలో సర్వశక్తులు నింపుకునే అవసరం ఉంది. అప్పుడే మగ్నస్థితి ఉంటుంది, మరియు ఏ విఘ్నాలు చలింపచేయలేవు. విఘ్నాల యొక్క అల కూడా ఆత్మీయత యొక్క ఫోర్స్ తగ్గినప్పుడే వస్తుంది. కనుక ఇప్పుడు వర్తమాన సమయంలో శివరాత్రి సేవకు ముందు స్వయంలో శక్తి నింపుకునే ఫోర్స్ ఉండాలి. భలే యోగం యొక్క ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నారు, కానీ యోగం ద్వారా శక్తుల యొక్క అనుభవం చేసుకోవటం మరియు చేయించటం ఇప్పుడు ఈ క్లాసులు చాలా అవసరం. ప్రత్యక్షం యొక్క బలం ఆధారంగా ఇతరులకు కూడా బలం ఇవ్వాలి. కేవలం బయట సేవా ప్లాన్స్ మీరు ఆలోచిస్తున్నారు, కానీ పూర్తిగా దీనిపై దృష్టి పెట్టాలి. ఎవరైతే నిమిత్త ఆత్మలు ఉన్నారో వారికి ఈ ఆలోచన నడుస్తూ ఉండాలి. మా వైపు నుండి, మా పుష్పగుచ్ఛం ఏ విషయంలో బలహీనంగా ఉంది అని. ఏ రీతిగా మీ పుష్పగుచ్చం బలహీనంగా ఉందో దానిపై మీరు కఠిన దృష్టి పెట్టాలి. మీరు సమయం ఉపయోగించి మీ పుష్పగుచ్చంలో ఉన్న బలహీనతలను తొలగించాలి. ఇప్పుడు శక్తుల యొక్క లోపం, వాటి ప్రభావం తక్కువగా ఉన్న కారణంగా నడుస్తూ, నడుస్తూ అన్ని విషయాలలో మీకు బలహీనత వచ్చేస్తుంది. అందువలన వినాశి తయారీలు కూడా చాలా ఫోర్స్ గా తయారవుతున్నాయి. మరలా మీరు బలహీనం అయ్యేటప్పటికి అవి కూడా బలహీనం అయిపోతున్నాయి. స్థాపనా కార్యం చేసే మీలో ఫోర్స్ లేకపోతే వినాశన కార్యంలో ఎలా ఫోర్స్ నిండుతుంది? కనుక ఆదిలో ఆత్మలకు శక్తి యొక్క నషా ఎంత ఉండేది? తమపై తాము కఠినమైన దృష్టి పెట్టుకునేవారు. ఈ విఘ్నం ఏమిటి?, మాయ అంటే ఏమిటి?, ఎంత కఠినమైన దృష్టి పెట్టుకోవాలి? అని ప్రతి ఒక్కరు తమపై తాము చాలా కఠినమైన దృష్టి పెట్టుకునేవారు. మీకు కూడా మీ కర్మలగతిపై చాలా ధ్యాస ఉండాలి. ఇప్పుడు డ్రామానుసారం అందరు నెంబర్ వారీగా తయారవ్వాల్సిందే. ఏదోక కారణంగా నెంబర్ క్రిందికి రావల్సిందే. కాని మీరు ఇప్పుడు అందరిలో ఫోర్స్ నింపే కర్తవ్యం చేయాలి. ఎలా అయితే సాకారంలో బ్రహ్మాబాబాను చూసారు కదా! ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు పగలు విశేషంగా శక్తినిచ్చే విశేష సేవను చేసేవారు. విశేషంగా ప్లాన్స్ తయారుచేసేవారు, నిర్బల ఆత్మలకు విశేషంగా బలం నింపే విశేష ధ్యాస పెట్టుకునేవారు. రాత్రి సమయం కూడా తీసి ఆత్మలకు శక్తి నింపే సేవ చేసేవారు. ఇప్పుడు మీరు కూడా విశేషంగా ఆత్మలకు శక్తినిచ్చే సేవ చేయాలి. లైట్ హౌస్, మైట్ హౌస్ అయ్యే సేవ ఎక్కువగా చేయాలి. నలువైపుల లైట్, మెట్ యొక్క ప్రభావాన్ని వ్యాపింపచేయాలి. ఈ సేవ చాలా అవసరం. ఎవరైనా షావుకారులుగా ఉంటే వారి సంబంధీకులు బలహీనంగా ఉంటే వారికి సహయోగం ఇచ్చి వారిని ఉన్నతంగా తీసుకువెళ్లారు కదా! అలాగే వర్తమాన సమయంలో ఎవరైతే బలహీన ఆత్మలు ఉన్నారో వారికి మీ సంబంధ, సంపర్కాల విశేషమైన శక్తిని ఇవ్వాలి. నిరంతరం దేహాభిమానాన్ని పూర్తిగా మర్చిపోవాలి. దీని కొరకు ప్రతి ఒక్కరు శక్తిననుసరించి నెంబర్ వారీగా పురుషార్థం అనుసరించి శ్రమ చేస్తున్నారు. బాబా చదివించే ఈ చదువు యొక్క లక్ష్యం ఏమిటంటే - దేహాభిమానానికి అతీతంగా ఆత్మాభిమానిగా అవ్వటం. దేహాభిమానం తొలగించుకునే సహజమైన యుక్తి - సదా మీ స్వమానంలో అంటే స్వయం యొక్క గౌరవంలో స్థితులై ఉండండి. అప్పుడు దేహాభిమానం స్వతహాగానే తొలగిపోతుంది. స్వమానం అంటే దీనిలో స్వయం యొక్క అభిమానం ఉంటుంది. అంటే ఆత్మ యొక్క అనుభవం, స్వమానం అంటే నేనెవరు? మీ సంగమయుగం యొక్క, భవిష్యత్తు యొక్క అనేక స్వమానాలు ఏవైతే మీకు లభించాయో అవి సమయానుసారం అనుభవం చేసుకుంటూ ఉండాలి. దానిలో ఒక్క స్వమానంలో మీరు స్థితులైనా దేహాభిమానం తొలగిపోతుంది. నేను ఉన్నతోన్నతమైన బ్రాహ్మణాత్మను - ఇది కూడా ఒక స్వమానం. మొత్తం విశ్వంలో బ్రహ్మాండం మరియు మొత్తం విశ్వానికి యజమాని ఆత్మను - ఇది కూడా స్వమానం. ఎలా అయితే మీరు ఆదిలో ఈ దేహాభిమానం తొలగిపోవటానికి, నేను స్త్రీని అనే అభిమానం తొలగిపోవటానికి నేను ఆత్మను, పురుషుడిని అనే లక్ష్యం పెట్టుకునేవారు కదా! ఈ పురుష స్థితిలో స్థితులవ్వటం ద్వారా నేను స్త్రీని అనే అభిమానం స్వతహాగానే తొలగిపోతూ ఉండేది. అలాగే సదా మీ బుద్ధిలో వర్తమానం మరియు భవిష్యత్తు ఈ రెండింటి స్వమానాలు స్మృతిలో ఉంచుకోవటం ద్వారా దేహాభిమానం స్వతహాగానే సమాప్తి అయిపోతుంది. కేవలం మాటను మార్చండి, అప్పుడు స్వమానంతో స్వభావం కూడా మంచిగా అయిపోతుంది. అప్పుడు స్వభావ, సంస్కారాల గొడవలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమాప్తి అయిపోయి స్వమానంలో స్థితులు కాగలుగుతారు. కనుక స్వమానం అంటే స్వయం యొక్క గౌరవం, దీని ద్వారా ఒకటి దేహాభిమానం సమాప్తి అయిపోతుంది మరియు రెండు స్వభావాల ఘర్షణ కూడా సమాప్తి అయిపోతుంది. వెనువెంట ఎవరైతే స్వమానంలో స్థితులవుతారో వారికి అందరి నుండి స్వతహాగానే గౌరవం కూడా లభిస్తుంది. ఈ రోజుల్లో ప్రపంచంలో కూడా గౌరవం ద్వారానే స్వమానం లభిస్తుంది. ఎవరైనా ప్రెసిడెంట్ ఉంటే వారు ప్రెసిడెంట్ అనే గౌరవం కారణంగానే స్వమానం లభిస్తుంది. అలాగే మీరు కూడా స్వమానం ద్వారానే విశ్వమహారాజుగా కాగలుగుతారు. మరియు వారిని విశ్వమంతా కూడా గౌరవిస్తుంది. కనుక స్వమానంలో స్థితులవ్వండి. అప్పుడు మీకు సర్వప్రాపులు ప్రాప్తిస్తాయి. ఈ స్వమానంలో ఎవరైతే స్థితులై ఉంటారో, స్వమానాలలో బాబా మనకు అనేక రకాలైన స్వమానాలు చెప్పారు. నేను శివశక్తిని ఇది కూడా స్వమానం. ఒకటి - కేవలం ఈ స్వమానాన్ని వినటం, రెండు - ఆ స్వమానం యొక్క స్వరూపాన్ని అనుభవం చేసుకోవటం. కనుక అనుభవం ఆధారంగా ఒక్క సెకనులో దేహాభిమానం నుండి స్వమానంలో మీరు స్థితులు కాగలుగుతారు. ఎవరైతే అనుభవీ మూర్తిగా కారో వారు వినటం యొక్క అభ్యాసిగానే ఉండిపోతారు. కనుక ఇప్పటి వరకు అందరు అనుభవీలుగా కాలేదు. స్వమానాల లిస్ట్ తీస్తే ఎంత పెద్దది ఉంటుంది! ఆ లిస్టులో ఒక్కొక్క విషయం అనుభవం చేసుకుంటూ ఉంటే మాయ యొక్క చిన్న చిన్న బలహీనతలు సమాప్తి అయిపోతాయి. మాయ మనల్ని బలహీనంగా చేసేటందుకు మొదట దేహాభిమానం రూపంలో వస్తుంది. అసలు మీరు దేహాభిమానంలోకే రాకపోతే బలహీనత ఎక్కడి నుండి వస్తుంది? కనుక అందరికి స్వమానం యొక్క స్మృతిని ఇప్పించండి, మరియు ఆ స్వరూపం యొక్క అనుభవీగా తయారుచేయండి. ఎలా అయితే నేను మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మను అనే ఈ సంకల్పం చేయటం ద్వారా మీకు ఆ స్థితి తయారయిపోతుంది కదా! కానీ ఆ స్థితి ఎవరికి తయారవుతుంది? ఎవరికైతే ఆ స్వమానం యొక్క అనుభవం ఉంటుందో వారికి తయారవుతుంది. అనుభవం లేకపోతే స్థితి కూడా తయారవ్వదు, అలసట అనుభవం అవుతుంది. జ్ఞానమార్గం కూడా కష్టంగా అనిపిస్తుంది. ఎలా చేయాలి? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది కానీ ఎవరైతే అనుభవీ మూర్తులు ఉంటారో వారికి కఠిన పరిస్థితి వచ్చిన సమయంలో కూడా స్వమానంలో స్థితులై ఉండటం ద్వారా వారు సహజంగా దానిని కట్ చేయగలుగుతారు. కనుక అందరికి స్వమానం యొక్క స్మృతి ఇప్పించండి, అందరిని అనుభవీ మూర్తిగా చేసే క్లాస్ చేయండి. ఎవరైతే మీ సమీప సంబంధంలోకి వస్తారో, మీ సంపర్కంలోకి వస్తారో ఆ ఆత్మలకు అనుభవం చేయించే సహయోగం ఇవ్వండి. ఇప్పుడు ఆత్మలకు అనుభవం అనే సహయోగం కావాలి. ఎలా అయితే సాకారంలో బ్రహ్మాబాబా ద్వారా అనుభవీ మూర్తిగా అయ్యే సేవ జరుగుతూ ఉండేదో అలాగే మీ ద్వారా కూడా ఎవరైతే సమీప ఆత్మలు ఉన్నారో వారికి నిర్బలతను, బలహీనతలను మీ శక్తుల యొక్క సహయోగంతో తొలగించుకునే సహయోగం ఇవ్వండి. వారిని అనుభవీ మూర్తిగా తయారుచేయండి. ఏ ఆత్మలకు మీరు నిమిత్తమయ్యారో ఆ ఆత్మలకు స్వమానం యొక్క స్థితిని అనుభవం చేయించారా? అని పరిశీలించుకోండి. ఒకవేళ చేయించకపోతే చేయించండి. శ్రమ చేయండి ఎందుకంటే మీ రాజధాని యొక్క సమీప సంబంధంలోకి వచ్చే ఆత్మలు బలహీనంగా ఉంటే ఇక ప్రజలు ఎలా తయారవుతారు? కనుక బలహీన ఆత్మలు సంబంధంలోకి రాలేరు. కనుక మీ రాయల్ కుటుంబంలో సంబంధీకులను మంచిగా తయారుచేసుకోండి. ఇప్పుడు త్వరత్వరగా మీ రాజధానిని తయారు చేసుకోండి. ప్రజలైతే చాలా తొందరగా తయారవుతారు. కానీ రాజ్య సంబంధంలోకి, సంపర్కంలోకి వచ్చే వారిని మీరే తయారుచేయాలి. తయారు చేస్తారు కదా? నిమిత్త ఆత్మలు ఇలాంటి ధ్యాస పెట్టుకుని శ్రేష్ట ఆత్మలను తయారుచేయండి. నా సంపర్కంలోకి వచ్చే ఏ ఆత్మ ఈ స్థితి నుండి వంచితం కాకూడదు అని ధ్యాస పెట్టుకోండి. మరి స్వయమే మీలో ఏదోక శక్తి యొక్క లోపంగా ఉంటే ఇతరులకు శక్తిని ఎలా ఇవ్వగలుగుతారు? కనుక ఇప్పుడు మీ సమీపంగా వచ్చే వారికి తల్లి. తండ్రి ద్వారా పాలన దొరకటం లేదు, కనుక నిమిత్త ఆత్మలైన మీ ద్వారా సహయోగం దొరకాలి. మీ యొక్క పాలన లభించాలి. మీ అనుభవీ మూర్తుల ద్వారా శక్తిశాలి పాలన లభించాలి. కనుక నేను ఎంత శక్తిశాలిగా తయారు చేస్తున్నాను? అని పరిశీలన చేసుకోండి. ఎవరైతే డైరెక్టుగా బ్రహ్మా బాబా ద్వారా పాలన పొందారో వారు అనేకరకాలైన అనుభవాలనే రసనను వారిలో నింపుకున్నారు. కానీ ఇప్పుడు తల్లి, తండ్రి డైరెక్ట్ గా లేరు, కనుక నిమత్త ఆత్మలెన మీ ద్వారా కూడా పాలన చాలా అవసరం. కనుక ప్రతి ఒక్క టీచర్ మీ కాస్లో ఈ ధ్యాస పెట్టుకోండి.