సార స్వరూపంగా అవ్వటం ద్వారా సంకల్పం మరియు సమయం
యొక్క పొదుపు.
మాస్టర్ బీజరూప స్థితిలో స్థితులయ్యే అభ్యాసం చేస్తూ,
సదా ఈ స్మృతిలో స్వయాన్ని స్థితులు చేసుకుంటున్నారా? ఎలా అయితే విస్తారం మరియు
వాణీలోకి రావటం మీకు సహజంగా అనిపిస్తుందో, అలాగే వాణీకి అతీతంగా విస్తారానికి
బదులు సార స్థితిలో స్థితులవ్వటం వస్తుందా? హద్దు యొక్క గారడీ చేసేవారు
విస్తారాన్ని ఇముడ్చుకుని చూపిస్తారు కదా! మరి మీరెవరు? బేహద్ గారడీ చేసే ఆత్మలు.
మరి మీరు విస్తారాన్ని సారంలోకి ఇమడ్చగలుగుతున్నారా? ఏదైనా ఆత్మ ఎదురుగా
వచ్చినప్పుడు 7 రోజుల కోర్స్ ఒక్క సెకనులో ఇవ్వగలుగుతున్నారా? అంటే 7 రోజుల
కోర్స్ ద్వారా ఆత్మలలో ఆత్మికశక్తిని లేదా సంబంధం యొక్క శక్తిని నింపుతారు కదా!
అలాగే 7 రోజుల కోర్స్ కాకుండా ఆ ఆత్మలలో ఒక్క సెకనులో శక్తిని నింపగలుగుతున్నారా?
ఈ అంతిమ స్థితి ఉందా? ఎలా అయితే ఎవరైనా వ్యక్తి దర్పణం ఎదురుగా నిల్చోవటం ద్వారా
ఒక్క సెకనులో తన స్వయం యొక్క సాక్షాత్కారం చేసుకుంటారు కదా! తన రూపం అంతా
కనిపిస్తుంది కదా! అలాగే మీ యొక్క ఆత్మిక స్థితి రూపి దర్పణం ముందు ఎవరైనా ఆత్మ
రాగానే, ఒక్క సెకనులో తన స్వ స్వరూపాన్ని దర్శించుకుంటుందా? లేక సాక్షాత్కారం
చేసుకుంటుందా? ఇలా బాబా సమానంగా లైట్‌హౌస్, మైట్‌హౌస్ అయ్యి సమీపంగా అనుభవం
చేయిస్తున్నారా? లేక ఇప్పుడు ఇంకా ఆ స్థితి దూరంగా ఉందా? సంభవం అని
అనుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు చేయించలేకపోతున్నారు అంటే కారణం ఏమిటి? ఆ
విషయం సంభవమే కానీ, ప్రత్యక్షంలోకి తీసుకురావటం లేదు. అంటే తప్పకుండా ఏదోక కారణం
ఉంటుంది కదా! మరి మీలో ఆ బలహినత కూడా ఎందుకు వస్తుంది?కారణం ఉంటుంది కదా! మరి
అటువంటి స్థితి తయారు చేసుకునేటందుకు మీలో ఏ స్థితి యొక్క ధ్యాస లోపంగా ఉంది?
వైజ్ఞానికులు అనేక కార్యాలు ఒక్క సెకనులో సిద్ది చేసి చూపిస్తున్నారు. స్విచ్
ఆన్ చేయడం, అఫ్ చేయడంలో ఆలస్యం అవుతుందా? అయితే మరి ఇక్కడ మీ స్థితి ఎందుకు
తయారవ్వటంలేదు? ముఖ్య కారణం ఏమిటి? దర్పణం మీ ముందు ఉంది. ఆ దర్పణంలో ఇతరాత్మలకు
సాక్షాత్కారం చేయటంలో ఎంత సమయం పడుతుంది? ఇప్పుడు స్వయమే విస్తారంలో ఉంటున్నారు
అంటే విస్తారంలోకి రావడం ద్వారా సారరూపం యొక్క స్థితి ఎలా తయారవుతుంది? ఏదైనా
విషయం చూస్తున్నా, వింటున్నా చాలా సమయం బుద్ధికి ఆలోచించే అలవాటు అయిపోయిన
కారణంగా విస్తారంలోకి వెళ్లే ప్రయత్నమే చేస్తుంది. ఏ విషయం చూస్తున్నా,
వింటున్నా దాని సారాన్ని తెలుసుకుని మరియు ఒక్క సెకనులో దానిని ఇముడ్చుకోవటం,
పరివర్తన చేసుకోవటం - ఈ అభ్యాసం తక్కువగా ఉంది. ఎందుకు? ఏమిటి? అనేది విస్తారం
కదా! ఇది అవసరం లేనప్పటికీ ఆ విస్తారంలోకి వెళ్ళిపోతున్నారు. అందువలన ఎలా అయితే
బీజంలో శక్తి అధికంగా ఉంటుంది, వృక్షంలో తక్కువగా ఉంటుంది. ఇక్కడ వృక్షం అంటే
విస్తారం అలాగే ఏదైనా వస్తువు యొక్క విస్తారంలోకి మీరు వెళ్ళినప్పుడు శక్తి కూడా
విస్తారం అయిపోతుంది. విస్తారంలోకి వెళ్ళటం ద్వారా సమయం వ్యర్థం అయిపోతుంది
మరియు సంకల్పశక్తి కూడా వ్యర్ధం అయిపోతుంది. వ్యర్ధంగా వెళ్ళిపోయిన కారణంగా మీలో
శక్తి నిండటం లేదు. అందువలన విస్తారాన్ని సార స్థితిలోకి, శ్రేష్టస్థితిలోకి
మార్చుకునేటందుకు సదా ఈ అభ్యాసం చేయండి. ఏ విషయంలోనైనా విస్తారాన్ని మలుచుకుని
సార స్థితిలో స్థితులవ్వండి. ఇటువంటి అభ్యాసం చేస్తూ, చేస్తూ స్వయం సార
స్వరూపంగా అయిపోండి. అప్పుడు ఇతరాత్మలకు కూడా ఒక్క సెకనులో మొత్తం జ్ఞానం యొక్క
సారాన్ని అనుభవం చేయించగలుగుతారు. అనుభవీ మూర్తులుగా అయినవారే ఇతరులకు అనుభవం
చేయించగలుగుతారు. కానీ ఈ విషయం స్వయంలోనే అనుభవం తక్కువగా ఉంది. దీని కారణంగా
ఇతరాత్మలకు కూడా అనుభవం చేయించలేకపోతున్నారు. ఏదైనా శక్తిశాలి వస్తువు,
శక్తిశాలి సాధనాలు ఉంటే అవి ఏ వస్తువునైనా పరివర్తన చేయగలుగుతాయి, అంత శక్తి
వాటిలో ఉంటుంది. అగ్ని చాలా వేగంగా అంటే శక్తిశాలిగా ఉంటే దానిలో ఏ వస్తువు
వేసినా స్వతహాగానే దాని రూపం పరివర్తన అయిపోతుంది కదా! అలాగే అగ్ని శక్తిశాలిగా
లేనప్పుడు మనం దానిలో ఏదైనా వస్తువు వేసినా అది కాలుతుంది, కానీ దాని రూపం
పరివర్తన అవ్వదు. అలాగే సదా మీరు శక్తిశాలి స్థితిలో స్థితులై ఉంటే ఏ విషయాలైనా
అంటే వ్యక్తభావం, వ్యక్త ప్రపంచం యొక్క వస్తువులు, వ్యక్త భావంలో ఉండే వ్యక్తులు
మీ ఎదురుగా వచ్చినా మీ శక్తిశాలి స్థితితో, వారి స్థితి, రూపు రేఖలు అన్నీ
పరివర్తన అయిపోతాయి. వ్యక్తభావంతో మీ ఎదురుగా వచ్చిన వారు కూడా ఆత్మిక భావంతో
తిరిగి వెళ్తారు. అంతగా పరివర్తన అయిపోతారు. అలాగే వ్యర్థ విషయాలు పరివర్తన
అయిపోయి సమర్థ విషయాలను ధారణ చేస్తారు. వికల్పాలు సమాప్తి అయిపోయి శుద్ధ
సంకల్పాలను ధారణ చేస్తారు. కానీ అటువంటి పరివర్తనకు మీలో శక్తిశాలి స్థితి
ఉండాలి. లౌకికతను అలౌకికతలోకి మార్చుకోండి. సాధారణతను అసాధారణ రూపంలోకి
పరివర్తన చేసుకోండి. శక్తిశాలి స్థితి ద్వారా ఇటువంటి స్థితిని తయారుచేసుకోండి.
ఆ శక్తిశాలి స్థితి ముందు వ్యక్తి, వైభవం, వాయుమండలం, తరంగాలు, వృత్తి, దృష్టి
పరివర్తన కావాలి. కానీ వాటికి మీరు వశం కాకూడదు. ఇప్పుడు కారణం ఏమిటో అర్ధమైందా?
ఒకటి ఇముడ్చుకునే శక్తి తక్కువగా ఉంది. రెండు - పరివర్తన చేసుకునే శక్తి
తక్కువగా ఉంది, అంటే లైట్‌హౌస్, మైట్‌హౌస్ రెండు స్థితులలో సదాకాలికంగా
ఉండలేకపోతున్నారు. ఏదైనా కర్మ చేసేముందు బాప్ దాదా ద్వారా ఏవైతే విశేష శక్తులు
అనే బహుమతి లభించాయో, వాటిని పనిలో ఉపయోగించటం లేదు. కేవలం చూస్తున్నారు,
వింటున్నారు, సంతోష పడిపోతున్నారు. కానీ సమయానికి పనిలో ఉయోగించని కారణంగా లోటు
వచ్చేస్తుంది. కనుక ప్రతి కర్మ చేసే ముందు మాస్టర్ త్రికాలదర్శి అయ్యి కర్మ
చేయలేకపోతున్నారు. మాస్టర్ త్రికాలదర్శి అయ్యి ప్రతి సంకల్పం, ప్రతి కర్మ, ప్రతి
మాట మాట్లాడితే ఆ కర్మ వ్యర్ధంగా, అనర్థంగా ఉంటుందా? కానీ మీరు కర్మ చేసేటప్పుడు
కర్మకి వశం అయిపోతున్నారు. త్రికాలదర్శి అంటే సాక్షి స్థితిలో స్థితులై ఈ
కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయలేకపోతున్నారు. అందువలనే వశీభూతం అయిపోతున్నారు.
వశీభూతం అవ్వటం అంటే భూతాన్ని ఆహ్వానించటం. కర్మ చేసిన తర్వాత పశ్చాత్తాప
పడుతున్నారు. అప్పుడు ఏమౌతుంది? కర్మ యొక్క గతి లేదా కర్మ యొక్క ఫలం
తయారైపోతుంది కదా! కర్మ మరియు కర్మ యొక్క ఫలం వీటి యొక్క బంధనలో చిక్కుకుంటున్న
కారణంగా కర్మబంధన ఆత్మగా అయిపోతున్నారు. ఉన్నత స్థితిని పొందలేకపోతున్నారు. సదా
పరిశీలించుకోండి - కర్మబంధన నుండి ముక్తి అవ్వాలి అనుకుంటున్నారు, కానీ ముక్తి
అవుతూ అవుతూ కర్మబంధన యుక్తులుగా అయిపోవటం లేదు కదా? ఇది కూడా చూసుకోండి.
జ్ఞానస్వరూపంగా అయిన తర్వాత మాస్టర్ నాలెడ్జ్ ఫుల్, మాస్టర్ సర్వశక్తివాన్
ఆత్మలుగా అయిన తర్వాత కూడా ఏదైనా కర్మ యుక్తియుక్తంగా చేయటం లేదు, కర్మబంధనలలో
చిక్కుకుంటున్నారు అంటే అజ్ఞాన కాలంలో కంటే ఇప్పుడు మీరు కర్మ బంధనలో
చిక్కుకున్నప్పుడు కోటానుకోట్ల కంటే ఎక్కువ మీరు ఫలితం అనుభవించాల్సి ఉంటుంది.
ఈ కర్మబంధన కోటానుకోట్ల రెట్లు ఉంటుంది. ఈ కారణంగా బంధనయుక్త ఆత్మ స్వతంత్రంగా
ఉండటం లేని కారణంగా, స్థితిని తయారు చేసుకోలేకపోతుంది. ఈ బంధన ఉండకూడదు, ఇది
తొలగిపోవాలి, సంతోషం యొక్క అనుభూతి చేసుకోవాలి, తేలికతనంగా ఉండాలి, సంతుష్టత
అనుభవం చేసుకోవాలి, సేవలో విజయం పొందాలి, దైవీ పరివారానికి స్నేహిగా, సమీపంగా
అవ్వాలి అనుకుంటుంది. కానీ కర్మబంధన కారణంగా అనుభవం చేసుకోలేకపోతుంది. ఈ
కర్మబంధన కారణంగా స్వయంతో, తన పురుషార్ధంతో, ఇతరాత్మలతో సంతుష్టంగా
ఉండలేకపోతుంది. ఈ కర్మల గుహ్యగతిని తెలుసుకుని, త్రికాలదర్శి అయ్యి ప్రతి కర్మ
చేయండి. అప్పుడు కర్మాతీతంగా అవుతారు. చిన్న చిన్న లోపాలు సంకల్ప రూపంలో కూడా
వస్తాయి. వాటికి కూడా కర్మల ఖాతా చాలా కఠినంగా ఉంటుంది. ఇప్పుడు చిన్న పొరపాటుని
కూడా పెద్దగా భావించండి. చాలా స్వచ్ఛమైన వస్తువు ఉన్నప్పుడు చిన్న మచ్చ కూడా ఆ
వస్తువులో చాలా పెద్దగా కనిపిస్తుంది కదా! అలాగే వర్తమాన సమయంలో మీరు స్వచ్చమైన
సమీప స్థితికి చేరుకుంటున్నారు. అందువలన మీరు చిన్న పొరపాటు చేసినా కానీ, అది
పెద్ద రూపంలో లెక్కించబడుతుంది. అందువలన ఇవి చిన్న చిన్న పొరపాట్లే కదా, జరుగుతూ
ఉంటాయి అని తెలివి తక్కువ వారిగా అవ్వకండి. సమయం పరివర్తన అవుతుంది. కనుక సమయంతో
పాటు మీ పురుషార్థం యొక్క వేగం కూడా మారాలి. ఇప్పుడు వర్తమాన సమయం అనుసరించి
చిన్న బలహీనతలు కూడా పెద్ద బలహీనతల రూపంలో లెక్కించబడతాయి. అందువలన అడుగు, అడుగు
జాగ్రత్తగా ఉండండి. ఒక చిన్న పొరపాటు కూడా చాలా సమయం యొక్క ప్రాప్తి నుండి
వంచితం చేసేస్తుంది. అందువలన జ్ఞాన స్వరూపంగా, లైట్‌హౌస్, మైట్‌హౌస్ గా అవ్వండి.
అనేకాత్మలకు మార్గం చూపించే మీరే నడుస్తూ, నడుస్తూ ఆగిపోతే ఇతరులకు మార్గం
చూపించడానికి ఎలా నిమిత్తం అవుతారు? అందువలన సదా విఘ్నవినాశకులుగా అవ్వండి.
ఈవిధంగా సదా త్రికాలదర్శిగా, కర్మయోగిగా అయ్యి
నడిచేవారికి బాప్ దాదా యొక్క నమస్తే. మంచిది.