24.12.1972        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


సంగమయుగీ శ్రేష్టాత్మల బాధ్యత.

అందరు విధాత యొక్క విధానం మరియు విధి గురించి మంచిగా తెలుసుకున్నారా? ఒకవేళ విధాత బాబా గురించి తెలుసుకుంటే విధానం మరియు విధి స్వతహాగానే మీ బుద్ధిలోకి వచ్చేస్తుంది. విధాత ద్వారా శ్రేష్టాత్మలైన మీరందరు విధానాన్ని తయారుచేసేవారు. స్వయాన్ని ఇలా భావిస్తూ ప్రతి కర్మ చేస్తున్నారా? ఎందుకంటే ఈ సమయంలో బ్రాహ్మణాత్మలైన మీరు ఏదైతే శ్రేష్టకర్మ చేస్తున్నారో అదే విశ్వంలో మొత్తం కల్పం విధానంగా తయారవుతుంది. ఇలా మీ యొక్క ప్రతి కర్మను మహత్వపూర్వకంగా భావించి చేస్తున్నారా? ప్రతి కర్మ చేస్తూ ఈ స్మృతి ఉంటుందా లేదా సోమరిగా అయ్యి కర్మ చేస్తున్నారా? స్వయాన్ని విధానాలకు రచయితగా భావించి ప్రతి కర్మ చేయాలి. అన్ని ఆచారాలు, పద్ధతులు ఎప్పటి నుండి, ఎవరి ద్వారా ప్రారంభం అయ్యాయి? అవే ఇప్పుడు మొత్తం కల్పం నడుస్తూ వస్తున్నాయి. అంటే ఈ సమయంలో బ్రాహ్మణాత్మలైన మీరు ఏవైతే విధి, విధానాలను, ఆచారాలను ప్రత్యక్ష జీవిత రూపంలో నడిచి చూపించారో అవి సదాకాలికంగా అనాది విధానంగా తయారవుతున్నాయి. కనుక ఇలా భావించి ప్రతి కర్మ చేయటం ద్వారా ఎప్పుడు మీకు సోమరితనం రాదు. ఈ విధిపూర్వక స్మృతి స్వరూపంగా అయ్యి నడవాలి. ఇంత పెద్ద బాధ్యత మీపై ఉంది అని భావించి కర్మ చేయాలి. ఈ స్మృతి ఉంటుందా? సంగమయుగం యొక్క విశేషత ఏమిటంటే ప్రతి ఒక శ్రేష్టాత్మకు బాధ్యత లభించింది. ఇది విశేషాత్మల బాధ్యత, మేము వారు చెప్పిన విధానాల ప్రకారం నడిచేవారము అని అనుకోండి. ప్రతి ఆత్మ ఏదోక విధానాన్ని తయారు చేస్తుంది. ఈ నిశ్చయం ద్వారా ప్రతి కర్మ యొక్క సంపూర్ణ సిద్ధిని పొందగలుగుతారు. స్వయాన్ని విధానాలకు రచయితగా భావించి ప్రతి కర్మ చేసినట్లయితే యదార్ధంగా, విధిపూర్వకంగా చేయగలుగుతారు. యదార్థ విధి ద్వారా సంపూర్ణసిద్ధి ప్రాప్తిస్తుంది. సిద్ధి పొందేటందుకు కేవలం ఒక విషయం బుద్దిలోకి స్పష్టంగా రావాలి. అప్పుడు సహజంగానే విధి ప్రకారం నడవగలుగుతారు. అది ఏమిటి? ఈ స్మృతి కూడా ఎందుకు విస్మృతిలోకి వచ్చేస్తుంది? నిమితమైన విషయం ఏమిటి? ఒక యుక్తి మీకు రావాలి, దాని ద్వారా సదాకాలికంగా విస్మృతి నుండి కూడా ముక్తి అవుతారు. ఆ యుక్తి ఏమిటి? ఏ విషయం విఘ్న రూపంలో ఎదురుగా వచ్చినా వచ్చినటువంటి విషయాన్ని పరివర్తన చేయాలి. ఈ యుక్తి మీకు వచ్చినట్లయితే సదాకాలికంగా విఘ్నాల నుండి ముక్తి అవుతారు. విస్మృతి కారణంగా స్మృతి, వృత్తి, దృష్టి మరియు సంపర్కం తయారవుతుంది. కనుక వీటిన్నింటిని పరివర్తన చేసుకున్నప్పుడే పరిపక్వత వస్తుంది. ఏదైనా వ్యర్దస్మృతి వచ్చినా దేహము, దేహ సంబంధాలు, దేహ పదార్థాల స్మృతి వచ్చినా అవి యదార్ధ స్మృతిని విస్మృతి రూపంలోకి తీసుకురావడానికి నిమిత్తం అవుతాయి. ఒకవేళ ఈ దేహ స్మృతిని, దేహ సంబంధాల స్మృతిని, దేహ పదార్థాల స్మృతిని పరివర్తన చేసుకోవటం వచ్చినట్లయితే మీ స్మృతి పరిపక్వంగా తయారవుతుంది కదా! అలాగే మీ వృత్తిని, దృష్టిని పరివర్తన చేసుకోవటం రావాలి, మీ సంపర్కాన్ని కూడా పరివర్తన చేసుకోవటం రావాలి. అప్పుడే సంపూర్ణతకు సమీపంగా వస్తారు. కానీ మీకు పరివర్తన చేసుకునే పద్ధతి రావటం లేదు. దేహదృష్టికి బదులు ఆత్మిక దృష్టి రూపంలో పరివర్తన చేసుకోవాలి. వ్యక్తి యొక్క సంపర్కాన్ని అవ్యక్త, అలౌకిక సంపర్కంలోకి పరివర్తన చేసుకోవాలి. సాధారణ వృత్తిని అలౌకిక వృత్తిలోకి పరివర్తన చేసుకోవాలి. దీనిలో లోపం ఉన్న కారణంగా మీరు సంపూర్ణ స్థితిని పొందలేకపోతున్నారు. ప్రకృతిని కూడా పరివర్తన చేసే శక్తి మీలో ఉంది కదా! విజ్ఞానమనేది ప్రకృతి శక్తి. ప్రకృతి యొక్క శక్తి వైజ్ఞానిక వస్తువులను ఒక్క సెకనులో పరివర్తన చేయగలుగుతుంది. వేడిని శీతలంగా, శీతలతను వేడిగా చేయగలుగుతుంది. విజ్ఞానంలో ఈ శక్తి ఉంది కదా! వేడి వాతవరణాన్ని శీతలంగా, శీతల వాతావరణాన్ని వేడిగా చేస్తుంది. ప్రకృతి యొక్క శక్తి వస్తువుని పరివర్తన చేయగలుగుతుంది. మీది పరమాత్మ శక్తి, శ్రేష్ట ఆత్మ యొక్క శక్తి, మరి మీరు మీ వృత్తిని, దృష్టిని పరివర్తన చేసుకోలేరా? మీ వృత్తిని మరియు దృష్టిని పరివర్తన చేసుకోవటం లేని కారణంగానే అది మీకు విఘ్నరూపంగా అవుతుంది. ప్రకృతి మీ రచన, మీరు మాస్టర్ రచయితలు. మరి మీ రచనలోనే ఇంత శక్తి ఉన్నప్పుడు మాస్టర్ రచయితలైన మీలో శక్తి లేదా? ఇది శ్రేష్ట ఆత్మల లక్షణమా? ఈరోజుల్లో ప్రకృతి యొక్క శక్తి ఒక సెకనులో ఏది కావాలంటే అది ప్రత్యక్ష రూపంలో చేసి చూపిస్తుంది. అందువలన ఈరోజు భ్రమించే ఆత్మలు కూడా పరమాత్మ శక్తి, ఈశ్వరీయ శక్తి, శాంతి శక్తిని కూడా ప్రత్యక్షరూపంలో, ప్రమాణం రూపంలో చూపించాలనుకుంటున్నారు. ఎవరైనా అపకారం చేసినా ఒక్క సెకనులో ఆ అపకారాన్ని ఉపకారంలోకి పరివర్తన చేసుకోండి. ఎవరైనా తమ స్వభావ, సంస్కారాలకు వశమై మీ ఎదురుగా పరీక్ష రూపంలో వచ్చినా, కానీ మీరు ఒక్క సెకనులో మీ శ్రేష్ట సంస్కారం యొక్క స్మృతితో ఆ ఆత్మ పట్ల కూడా దయాహృదయ సంస్కారాన్ని, స్వభావాన్ని ధారణ చేయండి. ఎవరైనా దేహధారి దృష్టితో ఎదురుగా వచ్చినా మీరు ఒక్క సెకనులో వారిని ఆత్మిక దృష్టిలోకి పరివర్తన చేయండి. ఎవరైనా పడేయాలి అనే ఆలోచనతో వచ్చినా, తమ సాంగత్యదోషంలోకి తీసుకు వెళ్ళాలి అనే దృష్టితో వచ్చినా, మీరు మీ శ్రేష్ట సాంగత్యం ఆధారంగా వారిని సాంగత్యదోషం నుండి తొలగించి శ్రేష్ఠ సాంగత్యంలోకి వచ్చే వారిగా తయారుచేయండి. ఇలా పరివర్తన చేసుకునే యుక్తి మీకు వచ్చినటైతే ఎప్పుడు మీరు విఘ్నాలతో ఓడిపోరు. ఇలా సర్వుల సంపర్కంలోకి రావటం ద్వారా మీ యొక్క ఈ సూక్ష్మ శ్రేష్ట సేవకు అందరు బలిహారం అయిపోతారు. ఎలా అయితే బాబా ఆత్మలను పరివర్తన చేస్తున్నారో బాబాకు ధన్యవాదాలు అని చెప్తూ బాబాకు బలిహారం అయిపోతున్నారో, అలాగే మీ సంపర్కంలోకి వచ్చే ఆత్మలు కూడా మీకు ధన్యవాదాలు చెప్పాలి. దానికి సహజయుక్తి ఇదే. ఏ విషయమైనా, ఏ దృశ్యమైనా, ఏ వస్తువైనా పరివర్తన చేసుకోవలసిందే. ఈ డ్రామాయే పరివర్తనాశాలి. మీరు ప్రజలకు వినాశనం అవ్వవలసిందే, ముక్తిధామానికి అందరు వెళ్ళవలసిందే. కానీ వినాశనానికి ముందే జ్ఞాన, యోగాల ఆధారంగా వికర్మలను వినాశనం చేసుకుంటే శిక్షల నుండి రక్షించబడతారు అని చెప్తారు కదా! అందరు ఇంటికి వెళ్ళవలసిందే, కానీ ఎవరు చేసుకుంటే వారు పొందుతారు. అలాగే ప్రతి విషయంలో పరివర్తన తీసుకురావాలి. ఈ సమయంలో ఏ విషయం మీ ఎదురుగా విఘ్నరూపంగా వచ్చినా ఒక్క సెకనులో ఆ విషయాన్ని పరివర్తన చేసుకోవాలి. ఆ పురుషార్థానికి ఫలంగా మీకు ప్రాప్తి లభిస్తుంది. పరివర్తన అవ్వవలసిందే, కానీ మంచి రూపంలో, శ్రేష్ట రూపంలో పరివర్తన చేసుకోవటం ద్వారా శ్రేష్ట ప్రాప్తి లభిస్తుంది. సమయం ఆధారంగా ఆ విషయం పరివర్తన అవుతుంది, కానీ అలా పరివర్తన అయితే మీకు ఏ ప్రాప్తి రాదు. విఘ్నం వస్తుంది. అది సమయానుసారం వెళ్ళిపోతుంది, కానీ మీరు సమయాని కంటే ముందు మీరు దానిని పరివర్తన చేసుకుంటే మీకు మార్కులు వస్తాయి. ప్రాప్తి లభిస్తుంది. ఏది వస్తుందో అది వెళ్ళిపోతుంది అని ఆలోచించకండి. ఈ ఆత్మ యొక్క కర్మల ఖాతా ఎలా ఉంటే అలా పూర్తి అవుతుంది అని ఆలోచించకండి. సమయమే నేర్పిస్తుంది అని ఆలోచించకండి. నేను చేస్తాను, నేను పొందుతాను అని అనుకోండి. ఎందుకంటే సమయం పరివర్తన చేస్తే మీరు ఏమీ పొందలేరు. అది సమయం యొక్క విశేషత అవుతుంది, కానీ మీ విశేషత అవ్వదు. సమయానికి పరివర్తన అయిన విషయానికి మహిమ ఉండదు. సమయం కంటే ముందు ఏ కార్యమైతే మీరు చేస్తారో దానిని అద్భుతం అని అంటారు, దానికి మహిమ జరుగుతుంది. సీజన్ అనుసరించి ఫలం దొరికితే అంత విలువ ఉండదు. సీజన్ లేకుండా ఫలం దొరికితే దానికి చాలా విలువ ఉంటుంది. అలాగే సమయం సంపూర్ణం చేస్తుంది అని అనకండి. మీరు సంపూర్ణంగా అయ్యి సమయాన్ని సమీపంగా తీసుకురావాలి. సమయం మీ రచన, మీరు మాస్టర్ రచయితలు. రచయితలైన మీరు రచన ఆధారంగా నడవకూడదు. రచయితలైన మీరు రచనకు ఆధీనం కాకూడదు. ఇటువంటి పరివర్తనా శక్తిని ధారణ చేయండి. ఈ రోజుల్లో చిన్న మిషనరీ ప్రతి వస్తువుని ఎలా పరివర్తన చేస్తుంది? పూర్తిగా పనికిరాని వస్తువుని కూడా పనికి వచ్చేదిగా చేస్తుంది, పాతదానిని క్రొత్తదిగా చేస్తుంది. మరి మీ యొక్క సర్వ శ్రేష్ట శక్తి యొక్క సూక్ష్మ మిషనరీ మీ వృత్తిని, దృష్టిని లేదా ఇతరుల యొక్క వృత్తిని, దృష్టిని పరివర్తన చేయలేదా? ఇది జరిగింది, ఇది జరిగింది అని ఇలాంటి మాటలు నోటి నుండి రానివ్వకండి. సాకులు చెప్పద్దు. మిమ్మల్ని మీరు రక్షించుకునేటందుకు రకరకాల సాకులు చెప్తున్నారు. సంగమయుగంలో బ్రాహ్మణాత్మలు అన్నింటికంటే ఎక్కువ ఈ సాకుల యొక్క ఆట ఆడుతున్నారు. దీనిని కూడా పరివర్తన చేసుకోవాలి, సర్వసంస్కారాలను మార్చుకోవాలి. ఇదే లక్ష్యం బ్రాహ్మణ జీవితానికి ఆధారం. ఇతరులు మారితే నేను మారతాను అని అనుకోకూడదు. మనం మారి ఇతరులను మార్చాలి అనుకోవాలి. ఇందులో స్వయాన్ని ముందు పెట్టుకోవాలి. ఇతరులు మారితే నేను మారతాను అని అనుకోకండి. మీరు మారితే ఇతరులు స్వతహాగానే మారిపోతారు. మీరు మార్చేవారు, విశ్వాన్ని పరివర్తన చేసేవారు. అంతే కానీ ఏ విషయంలో స్వయం పరివర్తన అయ్యేవారు కాదు. కనుక ఈ లక్ష్యాన్ని సదా స్మృతిలో ఉంచుకుంటూ స్వయాన్ని పరిపక్వంగా చేసుకోండి. ఇప్పుడు సమయం సమీపత యొక్క గంటలు మ్రోగనున్నాయి. మీరు విశేషంగా బాబా యొక్క పరిచయాన్ని ప్రత్యక్ష ఋజువు రూపంలో చూపించే పురుషార్థం చేయండి. మీరు ఏదైతే బాబా నుండి పాలన పొందారో ఆ ఫలాన్ని చూపించండి. వ్యక్త, సాకార రూపం ద్వారా మీకు ఏదైతే శిక్షణ లభించిందో పాలన లభించిందో, దానిని ప్రత్యక్షం చేయండి. అలాగే ఇప్పుడు అవ్యక్త రూపం ద్వారా చాలా శిక్షణ, పాలన లభిస్తుంది. కనుక ఇప్పుడు ఎటువంటి సమయం? ఇప్పటి వరకు పాలన తీసుకున్నారు, కానీ ఇప్పుడు ఆ పాలన యొక్క ఫలం చూపించాలి. ఇప్పుడు డ్రామాలో ఈ పాత్ర చూపించాలి. ఎలా అయితే సత్యయుగంలో తల్లి,తండ్రి పాలన చేసి, రాజ్యభాగ్యానికి అధికారిగా చేసి రాజ్యభాగ్య సింహాసనాధికారిగా తయారుచేసి పిల్లలకు రాజ్యభాగ్య తిలకాన్ని పెట్టి అంటే బాధ్యతా తిలకాన్నిపెట్టి స్వయం సాక్షి అయ్యి చూస్తారు. వారు వెంట ఉంటున్నప్పటికి తమ పదవిని పిల్లలకు ఇచ్చి సాక్షి అయిపోతారు. మరి సత్యయుగంలో ఈ విధానం ఎక్కడి నుండి ప్రారంభం అయ్యింది? ఇప్పుడు కూడా బాప్ దాదా ఈ విశ్వసేవ అనే బాధ్యతా తిలకాన్ని పిల్లలకు ఇచ్చి స్వయం సాక్షిఅయ్యి చూస్తున్నారు కదా! బాబా సాక్షియే కదా! మన వెంట ఉన్నప్పటికి కూడా సాక్షియే. ఇప్పుడు ఈ సంవత్సరం సాక్షి అయ్యే సంవత్సరం. ఈ అవ్యక్త రూపం యొక్క పాలన వ్యక్తం ద్వారా కూడా ఎంత వరకు జరుగుతుంది? అందువలన ఈ క్రొత్త సంవత్సరంలో అవ్యక్త స్థితిలో స్థితులయ్యేటువంటి, ఇతరులను స్థితులు చేసటువంటి, అనుభవం చేయించేటువంటి వ్యాయామం నేర్పిస్తున్నాను. అవ్యక్తంగా అయ్యి అవ్యక్త బాబాతో అవ్యక్త కలయిక జరుపుకోవాలి. ఏ పాత్ర అయినా సదా ఒకవిధంగా నడవదు, మారుతుంది. ముందుకి తీసుకువెళ్ళడానికి పాత్ర మారుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు బాప్ దాదా విశేషంగా వ్యక్తం ద్వారా అవ్యక్త సంభాషణ చేసుకునేటువంటి సహజ వరదనాన్ని ఇస్తున్నారు. ఈ క్రొత్త సంవత్సరం కంటే ముందు మొదటి నెలలో విశేష వరదానమేమిటంటే డ్రామా ప్లాన్ అనుసారంగా అవ్యక్తస్థితితో బాబాతో మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేసేటువంటి పురుషార్ధం చేయండి. ఆ పురుషార్థీ ఆత్మలకు, ఆ పురుషార్థంలో నిమగ్నమైన ఆత్మలకు, సత్యమైన మనస్సుతో బాబా సహజమైన వరదానాన్ని ఇస్తున్నారు, ఎవరైతే ఇలాంటి అనుభూతిని పెంచుకుంటారో ఆ ఆత్మలకు అవ్యక్త అనుభూతి ప్రాప్తిస్తుంది అని. ఎందుకంటే ఇప్పుడు వ్యక్తం ద్వారా అవ్యక్త కలయిక కూడా సమాప్తి అయిపోయే రోజులు వస్తున్నాయి. అప్పుడేమి చేస్తారు? కలయిక జరుపుకుంటారా? అల్పకాలిక కలయికకు బదులు అవ్యక్తంగా బాబాను కలుసుకునేటువంటి సదాకాలిక అనుభవీలుగా కావాలి. అప్పుడు బాబా మీకు సమీపంగా ఉన్నట్లు, సన్ముఖంగా కలుసుకుంటున్నట్లు అనుభవం అవుతుంది. ఈ క్రొత్త సంవత్సరంలో ప్రతి ఒక్కరు ఏదోక అలౌకిక అనుభవం చేసుకోవాలి. కనుక విఘ్నవినాశకులు అయ్యి సంలగ్నతలో నిమగ్నమై ఉండాలి. సంలగ్నత ద్వారా విఘ్నం యొక్క రూపం కూడా మారిపోతుంది. విఘ్నం విఘ్నంగా అనుభవం అవ్వదు. విఘ్నం విచిత్ర అనుభవీ మూర్తిగా అయ్యేటందుకు నిమిత్తంగా కనిపిస్తుంది. విఘ్నం ఒక ఆటలా అనిపిస్తుంది. ఏ విషయమైనా, పెద్ద విషయమైనా చిన్నదిగా అనిపిస్తుంది. ఎలా అనే మాట ఇలా అనే మాటలోకి మారిపోతుంది. తెలియదు అనే మాట అన్నీ తెలుసు అనే జ్ఞాన స్వరూప రూపంలోకి మారిపోతుంది. కనుక ఈ సంవత్సరం విశేషంగా పురుషార్థంలో తీవ్రత తీసుకువచ్చే సంవత్సరంగా భావించాలి. స్వయాన్ని పరివర్తన చేసుకుని విశ్వాన్ని పరివర్తన చేసే విశేష సంవత్సరంగా జరుపుకోవాలి.

ఇలా విధానాలను, విధి మరియు విధాతను తెలుసుకునే తీవ్ర పురుషార్ధి ఆత్మలకు, పరివర్తన చేసుకునే పరిపక్వ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్కృతులు మరియు నమస్తే.