07.01.1977        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


విశ్వకళ్యా ణకారిగా ఏవిధంగా అవ్వాలి?

విశ్వకళ్యాణకారి శివబాబా తన పిల్లలను కూడా తన సమానంగా విశ్వకళ్యాణకారి స్థితిలో స్థితులు అయ్యే విధి చెప్తూ మాట్లాడుతున్నారు -

అందరు మాటలకు అతీతంగా శాంతి స్వరూప స్థితిలో స్థితులయ్యే అనుభవం ఎక్కువ సమయం చేసుకుంటున్నారా? మాటలలోకి వచ్చే అనుభవం ఎక్కువ సమయం చేసుకుంటున్నారా లేక మాటలకు అతీతంగా ఉండేటువంటి అనుభవం ఎక్కువ సమయం చేసుకుంటున్నారా? ఎంతెంత అంతిమ స్థితి అంటే కర్మాతీత స్థితి సమీపంగా వస్తుంటుందో అంతంత మాటలకు అతీతంగా శాంతి స్వరూప స్థితి అధికంగా ప్రియమనిపిస్తుంది. ఈ స్థితిలో సదా అతీంద్రియ సుఖం యొక్క అనుభూతి అవుతుంది. ఈ అతీంద్రియ సుఖమయ స్థితి ద్వారా అనేకాత్మలను సహజంగానే ఆహ్వానం చేయగలము. ఈ శక్తివంతమైన స్థితినే విశ్వకళ్యాణకారీ స్థితి అంటారు. ఎలాగైతే ఈ రోజుల్లో విజ్ఞాన సాధనాల ద్వారా అన్ని వస్తువులు సమీపంగా అనుభవం అవుతున్నాయో మరియు దూరంగా ఉన్న వారి మాట కూడా టెలిఫోన్ ద్వారా సమీపంగా వినిపిస్తుంది. దూరదర్శన్ ద్వారా దూర దృశ్యాలు సమీపంగా కనిపిస్తున్నాయి. అలాగే శాంతి స్థితి ద్వారా ఎంత దూరంలో ఉన్న ఆత్మకైనా కానీ సందేశాన్ని అందివ్వగలుగుతున్నారా? అప్పుడు వారు ఎవరో ఎదురుగా వచ్చి సందేశం ఇచ్చినట్లు అనుభవం చేసుకుంటారు. దూరంగా ఉంటూ కూడా శ్రేష్టాత్మలైన మీ యొక్క దర్శనం, ప్రభువు యొక్క చరిత్ర దృశ్యాలు అన్నీ ఎదురుగా చూస్తున్నట్లు అనుభవం చేసుకుంటారు. సంకల్పాల ద్వారా కనిపిస్తాయి అంటే మాటలకు అతీతంగా సంకల్ప సిద్ధి యొక్క పాత్ర అభినయిస్తారు. కానీ ఈ సిద్ధి పొందాలంటే విధి ఎక్కువలో ఎక్కువ శాంతి స్వరూప స్థితిలో స్థితులవ్వాలి. అందువలనే శాంతి అనేది బంగారం వంటిది అని అంటారు. దీనినే బంగారు యుగపు స్థితి అంటారు.

ఈ స్థితిలో ఉండటం వలన తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం పొందగలరు. సమయం, శక్తి, స్థూల ధనం అన్నింటిలో తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితం పొందేవారిగా అవుతారు. దీని కోసం ఒకే మాట సదా జ్ఞాపకం ఉంచుకోండి. అది ఏమిటి? సమానత. ప్రతి కర్మలో, సంకల్పంలో, మాటలో, సంబంధ సంపర్కాలలో సమానంగా ఉండాలి. అప్పుడు మాట, కర్మ, సంకల్పం, సంబంధ సంపర్కాలు అన్నీ సాధారణంగా కాకుండా అలౌకికంగా కనిపిస్తాయి అంటే అద్భుతంగా కనిపిస్తాయి. ప్రతి ఒక్కరి నోటినుండి, మనస్సు నుండి వీరు అద్భుతమైనవారు అనే మాట వస్తుంది. సమయప్రమాణంగా స్వ పురుషార్థం యొక్క వేగం మరియు విశ్వ సేవ యొక్క వేగం తీవ్రగతితో ఉండాలి. అప్పుడే విశ్వకళ్యాణకారిగా కాగలరు.

విశ్వంలో ఎక్కువ ఆత్మలు బాబాని మరియు తమ ఇష్ట దేవతల యొక్క ప్రత్యక్షతను ఎక్కువగా ఆహ్వానిస్తున్నారు. ఇష్ట దేవుళ్ళను తక్కువగా ఆహ్వానిస్తున్నారు. దీనికి కారణం ఏమిటి? వారు తమ హద్దు స్వభావ, సంస్కారాల యొక్క ప్రవృత్తిలో ఎక్కువ సమయం ఉపయోగిస్తున్నారు. ఎలాగైతే అజ్ఞాని ఆత్మలకు జ్ఞానం వినడానికి ఖాళీ ఉండటం లేదో అలాగే చాలామంది బ్రాహ్మణులకు ఈ శక్తివంతమైన స్థితిలో ఉండటానికి ఖాళీ ఉండటం లేదు. అందువలన ఇప్పుడు జ్వాలారూపంగా అయ్యే అవసరం ఉంది.

బాప్ దాదా ప్రతి ఒక్కరి ప్రవృత్తిని చూసి నవ్వుకుంటున్నారు. ఎంత ఎక్కువగా బిజీ అయిపోయారు? అని. చాలా బిజీగా ఉంటున్నారు కదా? మన వాస్తవిక స్థితిలో మనం ఉంటే సిద్ధి పొందుతాము మరియు తేలికగా ఉంటాం. విజ్ఞాన సాధనాలు భూమిపై ఉండి అంతరిక్షంలోకి వెళ్ళిన యంత్రాన్ని అదుపు చేయగలుగుతున్నాయి, ఎలా కావాలంటే అలా, ఎక్కడ కావాలంటే అక్కడ మలచగలుగుతున్నాయి. మరి మీరు శాంతి, శక్తి స్వరూపులు. ఈ సాకార సృష్టిలో శ్రేష్ట సంకల్పం యొక్క ఆధారంతో ఏ సేవ కావాలంటే ఆ సేవ ఏ ఆత్మకు సేవ చేయాలంటే ఆ ఆత్మకి చేయలేకపోతున్నారా? మీమీ ప్రవృత్తుల నుండి అతీతంగా ఉండండి.

ఏవైతే ఖజానాలు వినిపించారో వాటిని స్వయం పట్ల కాకుండా విశ్వకళ్యాణం పట్ల ఉపయోగించండి. ఇప్పుడు ఏమి చేయాలో అర్థమైందా? మాట ద్వారా సేవ, స్థూల సాధనాల ద్వారా సేవ మరియు ధ్వనికి అతీతంగా అయ్యి సూక్ష్మ సాధనాలైన సంకల్పాల శ్రేష్టత, సంకల్ప శక్తి ద్వారా సేవ యొక్క సమానతను ప్రత్యక్షరూపంలో చూపించాలి. అప్పుడే వినాశనం యొక్క నగాడా మ్రోగుతుంది. అర్ధమైందా?

ప్లాన్స్ (పద్ధతులు) చాలా తయారు చేస్తున్నారు. బాప్ దాదా కూడా ప్లాన్ చెప్తున్నారు. సమానత సరిగా లేని కారణంగా ఎక్కువ శ్రమ చేయాల్సివస్తుంది. విశేష కార్యం చేసిన తర్వాత విశేషమైన విశ్రాంతి కూడా తీసుకుంటారు కదా! అంతిమ ప్లాన్ లో అలసిపోని స్థితిని అనుభవం చేసుకుంటారు.

ఈవిధంగా సర్వశక్తులను విశ్వకళ్యాణం పట్ల కార్యంలో ఉపయోగించే వారికి, సంకల్ప సిద్ధి స్వరూపులకు, స్వయం యొక్క ప్రవృతి నుండి స్వతంత్రులుగా సదా శాంతి మరియు శక్తి స్వరూపంలో స్థితులయ్యే వారికి, సర్వ శ్రేష్ట ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.