12.01.1977        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


పిల్లల నుండి యజమానులుగా అయ్యేవారికి మూడు లోకాల సాక్షాత్కా రం.

త్రికాలదర్శి శివబాబా ప్రతి ఆత్మ యొక్క మూడు కాలాలను చూస్తూ మాట్లాడుతున్నారు -

ఈరోజు బాప్ దాదా ప్రతి బిడ్డ యొక్క మూడు కాలాలను చూస్తున్నారు. భూతకాలంలో ఆది సమయం యొక్క భక్తులా లేక మధ్య సమయం వారా? భక్తి సమయం సమాప్తి అయిపోయిందా? భక్తి యొక్క ఫలితంగా జ్ఞానసాగరుడు, జ్ఞానం లభించగానే జ్ఞానీ ఆత్మలుగా అయ్యారా లేక తయారవుతున్నారా? భక్తి యొక్క సంస్కారం అంటే ఆధీనత. ఎవరికైనా ఆధీనం అవ్వటం, అడగటం, పిలవటం, స్వయాన్ని సదా సంపన్నతకు దూరంగా భావించటం. ఈ రకమైన సంస్కారాలు ఇప్పటి వరకు అంశమాత్రంగా ఉన్నాయా లేక వంశం రూపంలో కూడా ఉన్నాయా? వర్తమాన సమయంలో బాబా సమానమైన గుణాలలో, కర్తవ్యంలో మరియు సేవలో ఎంత వరకు సంపన్నం అయ్యారు? వర్తమానం ఆధారంగా భవిష్య పాలబ్దం ఎంత శ్రేష్టంగా తయారవుతుంది? ఇలా ప్రతి ఒక్కరి మూడు కాలలను చూస్తూ బాబా పిల్లల నుండి యజమానులుగా అయ్యేవారి గుణగానం చేస్తున్నారు. కానీ అక్కడక్కడ ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది. నాలో భక్తి సంస్కారం అంశరూపంలో కూడా లేదు కదా? అని స్వయాన్ని అడగండి మరియు స్వయాన్ని చూసుకోండి. ఒకవేళ అంశమాత్రంగానైనా ఎవరి స్వభావ, సంస్కారాలకు ఆధీనమవ్వటం, పేరు, గౌరవాలను అడిగేవారు, ఎలా మరియు ఏమిటి? అనే ప్రశ్నలతో అరిచేవారు, పిలిచేవారు భక్తుల వలె పైకి ఒకవిధంగా లోపల మరో విధంగా ఇలా మోసం చేసే భక్తి సంస్కారం ఉంటే ఇలా భక్తి యొక్క అంశం ఉన్నా జ్ఞానీ ఆత్మలుగా కాలేరు. ఎందుకంటే భక్తి అనేది రాత్రి, జ్ఞానం అనేది పగలు. పగలు, రాత్రి కలిసి ఉండవు.

జ్ఞానీ ఆత్మలు సదా భక్తి యొక్క ఫల స్వరూపంలో, జ్ఞాన సాగరునిలో మరియు జ్ఞానంలో ఇమిడి ఉంటారు. కోరిక అంటే ఏమిటో తెలియనివారిగా, సర్వప్రాప్తి స్వరూపులుగా ఉంటారు. ఇటువంటి జ్ఞానీ ఆత్మ యొక్క చిత్రాన్ని బుద్ధి ద్వారా తీస్తున్నారా? ఎలాగైతే మీ భవిష్య శ్రీకృష్ణుని యొక్క చిత్రం జన్మతోనే కిరీటదారునిగా, నోటిలో బంగారు చెంచా అంటే జన్మతోనే సర్వప్రాప్తి స్వరూపంగా చూపిస్తారు. ఆరోగ్యం, ధనం, సంతోషం, అన్నింటిలోను సంపన్న స్వరూపుడు. ప్రకృతి కూడా దాసీగా ఉంటుంది. ఈ అన్ని విషయాలు అంటే భవిష్యత్తులో లభించే వాటి అనుభవం ఈ సంగమయుగం నుండి అవ్వాలా లేక అది భవిష్యత్తు యొక్క మహిమేనా? ఆ సంస్కారాలను ఇక్కడ నుండి తీసుకువెళ్ళాలా లేక అక్కడ తయారు చేసుకోవాలా? త్రికాలదర్శి స్థితి ఇప్పటిదా లేక భవిష్యత్తులోనిదా? శ్రేష్ట స్థితి ఇప్పటిదా లేదా భవిష్యత్తులోనిదా? ఇప్పుడే శ్రేష్టం కదా!

సంగమయుగం యొక్క అంతిమ సంపూర్ణ స్థితి యొక్క చిత్రమే భవిష్య చిత్రంలో చూపిస్తారు. భవిష్యత్తుతో పాటు సర్వ ప్రాప్తుల యొక్క అనుభవం మొదట సంగమయుగీ బ్రాహ్మణులదే. అంతిమ స్థితిలో కిరీటం, సింహాసనం, తిలకధారిగా, సర్వ అధికారి మూర్తిగా, మాయాజీత్, ప్రకృతిజీత్ గా అవుతున్నారు. సదా సాక్షి స్థితి అనే సింహాసనాధికారులుగా, బాబా హృదయ సింహాసనాధికారులుగా, విశ్వకళ్యాణకారి అనే బాధ్యతా కిరీటధారులుగా, ఆత్మ స్వరూపం యొక్క స్మృతి తిలకధారులుగా, బాబా ద్వారా లభించిన అలౌకిక సంపద, జ్ఞానం, గుణాలు మరియు శక్తులు అనే సంపదతో సంపన్నంగా అవుతున్నారు. ఒక కిరీటధారిగా కాదు, రెండు కిరీటధారులుగా అవుతున్నారు. ఎలా అయితే రెండు సింహాసనాలు అంటే 1. సాక్షి సింహాసనం 2. బాబా హృదయ సింహాసనం అలాగే బాధ్యత అంటే సేవా కిరీటం మరియు సంపూర్ణ పవిత్రత యొక్క ప్రకాశ కిరీటం కూడా ఉంటుంది. రెండు సింహాసనాలు, రెండు కిరీటాలు మరియు సర్వప్రాప్తి సంపన్న బంగారు చెంచా ఏమిటి దాని కంటే ఉన్నతంగా వజ్రతుల్యంగా అవుతున్నారు. వజ్రం ముందు బంగారం ఏమీ కాదు. జీవితమే వజ్రంగా అవుతుంది. జ్ఞానం, గుణాలు అనే నగలతో అలంకరించుకుంటున్నారు. భవిష్యత్తులోని అలంకరణ ఈ సంగమయుగీ అలంకరణ ముందు గొప్ప విషయమేమీ కాదు. అక్కడ దాసీలు అలంకరిస్తారు. కానీ ఇక్కడ స్వయం జ్ఞానదాత అలంకరిస్తున్నారు. అక్కడ బంగారపు, వజ్రపు ఊయలలో ఊగుతారు. కానీ ఇక్కడ బాబా ఒడిలో ఊగుతున్నారు, అతీంద్రియ సుఖం అనే ఊయలలో ఊగుతున్నారు. అయితే శ్రేష్ట చిత్రం ఏది? వర్తమానానిదా లేక భవిష్యత్తుదా? సదా ఇలా మీ శ్రేష్ఠ చిత్రాన్ని ఎదురుగా ఉంచుకోండి. దీనినే జ్ఞానీ ఆత్మల చిత్రం అని అంటారు.

బాప్ దాదా అందరి యొక్క మూడు కాలాలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి ప్రత్యక్ష చిత్రం ఎంత వరకు తయారయ్యింది? అని. అందరి చిత్రం తయారైపోయిందా? చిత్రం తయారైపోతే దర్శనం చేసుకునే వారి కోసం తెర తీసేస్తారు. అలాగే చైతన్య చిత్రాలైన మీరు తయారైపోయారా, సమయం అనే పరదా తొలగించేమంటారా? సంపూర్ణమూర్తినే దర్శనం చేసుకుంటారు. కానీ ఖండిత మూర్తులను కాదు. ఏ రకమైన లోపం ఉన్నా ఖండితమూర్తులే. ఇలా మీరు దర్శనం చేయించే యోగ్యులుగా అయ్యారా? స్వయం గురించి ఆలోచిస్తున్నారా లేక సమయం గురించి ఆలోచిస్తున్నారా? స్వయం వెనుక సమయం నీడ లాంటిది. స్వయాన్నే మర్చిపోతున్నారు. అందువలన మాస్టర్ త్రికాలదర్శులుగా అయ్యి మీ మూడు కాలాలను తెలుసుకుంటూ స్వయాన్ని సంపన్నమూర్తులుగా అంటే దర్శనీయమూర్తులుగా తయారు చేసుకోండి. అర్థమైందా?

సమయాన్ని లెక్కించకండి. బాబా గుణాలు లేదా స్వయం యొక్క గుణాలను లెక్కించండి. స్మృతి దినోత్సవం అయితే ఎప్పుడు జరుపుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు స్మృతి స్వరూప దినోత్సవాన్ని జరుపుకోండి. ఈ స్మృతి దినోత్సవానికి స్మృతి చిహ్నంగానే శాంతి స్థంభం, పవిత్రతా స్థంభం, శక్తి స్థంభం తయారుచేసారు. అలాగే స్వయాన్ని అన్ని విషయాలలో స్థంభంగా తయారుచేసుకోండి, దానిని ఎవరు కదపకూడదు. కేవలం బాబా యొక్క స్నేహగీతాలు పాడటమే కాదు, స్వయం బాబా సమానంగా అవ్యక్తస్థితి స్వరూపులుగా అవ్వండి. అందరు మీ గురించి పాటలు పాడాలి. మీరు పాటలు పాడండి కానీ ఎవరి పాటలు పాడుతున్నారో వారు మీ పాటలు పాడాలి, ఆవిధంగా స్వయాన్ని తయారు చేసుకోండి.

ఈ స్మృతి దినోత్సవంలో బాబా స్నేహం యొక్క ప్రత్యక్షరూపం చూడాలనుకుంటున్నారు. స్నేహానికి గుర్తు బలి అవ్వటం. బాబా పిల్లల నుండి ఏ బలి కోరుకుంటున్నారో అది అందరికీ తెలుసు. స్వయం బలహీనతలను బలి చేసే ప్రత్యక్ష స్వరూపం చూపించాలి. ఈ బలి గురించి మనస్సుతో పాటలు పాడండి. బాబాపై స్నేహంతో అర్పణ చేసారు. బాబాపై స్నేహంలో అర్పణ చేయటంలో కష్టమైన విషయం, అసంభవ విషయం కూడా సంభవంగా మరియు సహజంగా అనుభవం అవుతుంది. కనుక ఈ స్మృతి దినోత్సవాన్ని సమర్థ దినోత్సవంగా జరుపుకోండి. స్మృతి స్వరూపులే సమర్థీ స్వరూపులు. అర్థమైందా? బాబా ఆరోజు విశేషంగా ఎవరెవరు, ఎంత శాతంలో ఏ రూపంలో ఏమేమి బలి చేసారు అని చూస్తున్నారు. కష్టంతో చేసారా లేక ప్రేమతో చేసారా అని. నియమ ప్రమాణంగా అయితే చేయకూడదు. నియమం కనుక చేయాలి అని కష్టంతో కూడా చేయకూడదు. మనస్సు యొక్క స్నేహంతో చేస్తేనే బాబా స్వీకరిస్తారు. బాబా స్వీకరించకపోతే వ్యర్థం అయిపోయినట్లే. అందువలన కొంగ భక్తులుగా అవ్వద్దు, స్వయం మోసం చేసుకోవద్దు. సత్యమైన బాబా సత్యాన్నే స్వీకరిస్తారు. మిగిలినవి అన్నీ పాప ఖాతాలో జమ అయిపోతాయి, బాబా ఖాతాలో కాదు. పాపఖాతాను సమాప్తి చేసుకుని బాబా ఖాతాలో నింపుకోండి. అడుగు అడుగులో కోటానుకోట్ల సంపాదన చేసుకుని పదమాపతిగా అవ్వండి.

ఇలా సైగ ద్వారా అర్థం చేసుకునే వారికి, సమయం గురించి కాకుండా స్వయం గురించి ఆలోచించే వారికి, బాబాపై స్నేహంతో ఒక్క సెకను యొక్క దృఢ సంకల్పంతో అర్పణ చేసేవారికి, డబుల్ కిరీటం, డబుల్ సింహాసనాధికారులకు, జ్ఞానీ ఆత్మలకు బాప్ దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే.