18.01.1984        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


'స్మృతి దినము యొక్క మహత్యము ''

ఈ రోజు మధువన్ వాలే బాబా(తండ్రి) మధువనములో పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. ఈ రోజు అమృతవేళ నుండి స్నేహీ పిల్లల స్నేహ గీతం, సమాన పిల్లల మిలనము జరుపుకోవాలనే గీతం, సంపర్కంలో ఉండే పిల్లలు ఉల్లాసములోకి వచ్చే ఉత్సాహంతో నిండిన ధ్వని, బంధనాలలో ఉన్న పిల్లల స్నేహంతో నిండిన మధురమైన ఫిర్యాదులు.... ఇలా అనేక పిల్లల స్నేహ పుష్పాలు బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. దేశ-విదేశాలలోని పిల్లల సమర్థ సంకల్పాల శ్రేష్ఠ ప్రతిజ్ఞలన్నీ బాప్దాదా వద్దకు (సమీపానికి) చేరుకున్నాయి. బాప్దాదా పిల్లలందరి స్నేహ సంకల్పాలకు, సమర్థ సంకల్పాలకు రెస్పాన్స్ (బదులుగా) ''సదా బాప్దాదాకు స్నేహీ భవ, సదా సమర్థ సమాన్భవ, సదా ఉల్లాస (ఉమంగ) - ఉత్సాహాలతో సమీప భవ'' లగనము అనే అగ్ని ద్వారా బంధనముక్త స్వతంత్ర ఆత్మా భవ'' అని అనేక వరదానాలిస్తున్నారు. పిల్లలు బంధనముక్తులుగా అయ్యే రోజు ఇక వచ్చేసినట్లే. పిల్లల స్నేహభరిత హృదయపూర్వకమైన మాటలు కుంభకర్ణ ఆత్మలను తప్పకుండా మేల్కొల్పుతాయి. ఈ బంధనాలను కలిగించేవారే స్వయం ప్రభు స్నేహ బంధనంలో బంధింపబడిపోతారు. బాప్దాదా విశేషంగా బంధనాలలో ఉన్న పిల్లలకు శుభమైన రోజులు రానున్నాయని మనసుకు ఊరట కలిగిస్తున్నారు. ఎందుకంటే విశేషమైన ఈ రోజున విశేషమైన స్నేహ ముత్యాలు బాప్దాదా వద్దకు చేరుకుంటాయి. ఈ స్నేహ ముత్యాలే శ్రేష్ఠమైన వజ్రాలుగా చేసేస్తాయి. ఈ రోజు సమర్థమైన రోజు. ఈ రోజు సమానులైన పిల్లలకు 'తతత్వమ్' అన్న వరదానము లభించే రోజు. ఈ రోజున బాప్దాదా శక్తి సైన్యానికి సర్వశక్తులను విల్లు చేస్తారు(ఇస్తారు). విల్ పవర్ను ఇస్తారు అనగా సంకల్ప శక్తిని ఇస్తారు. ఈ రోజున తండ్రి వెన్నెముకగా అయ్యి పిల్లలను విశ్వ మైదానంలో ముందు ఉంచే రోజు. తండ్రి గుప్తంగా ఉన్నారు. పిల్లలు ప్రత్యక్షంగా ఉన్నారు. ఈ రోజు బ్రహ్మాబాబా కర్మాతీతంగా అయిన రోజు. తీవ్రగతితో విశ్వకళ్యాణము కొరకు విశ్వ పరిక్రమణ చేసే కార్యము ప్రారంభమయ్యే(మైన) రోజు. ఈ రోజు పిల్లల దర్పణం ద్వారా బాప్దాదా ప్రఖ్యాతమయ్యే రోజు. జగత్తులోని పిల్లలకు జగత్పిత పరిచయాన్ని ఇచ్చే రోజు. పిల్లలందరికి తమ స్థితిని జ్ఞాన స్తంభముగా, శక్తి స్తంభముగా అనగా స్తంభము సమానంగా అచంచలంగా, స్థిరంగా చేసుకునేందుకు ప్రేరణను ఇచ్చే రోజు. పిల్లలు ప్రతి ఒక్కరు తండ్రి స్మృతి చిహ్నమైన శాంతిస్తంభాలు. ఇక్కడైతే స్థూలమైన శాంతిస్తంభాన్ని తయారు చేశారు. కాని తండ్రి స్మృతిలో ఉండే స్మృతి స్తంభాలు చైతన్య పిల్లలైన మీరే. బాప్దాదా చైతన్య స్తంభాలైన పిల్లల పరిక్రమణ చేస్తారు(పిల్లల చుట్టూ తిరుగుతారు). ఏ విధంగా ఈ రోజున శాంతిస్తంభం వద్ద నిల్చుంటారో, అలా బాప్దాదా స్మృతిలో ఉండే స్తంభాలైన మీ అందరి ముందు నిల్చుంటారు. మీరు ఈ రోజున విశేషంగా తండ్రి గదిలోకి వెళ్తారు. అలా బాప్దాదా కూడా పిల్లల ప్రతి ఒక్కరి హృదయమనే గదిలో పిల్లలతో హృదయంలోని విషయాలను మాట్లాడ్తారు. కుటీరము దిల్వర్(ప్రియుడు) మరియు దిల్ రూబాల (ప్రేయసుల) స్మృతి చిహ్నము. ప్రేయసులైన పిల్లలతో ప్రియుడైన తండ్రి విశేషంగా మిలనము చేస్తారు. కావున బాప్దాదా కూడా ప్రేయసులైన పిల్లలందరి రకరకాల సంగీతాలను వింటూ ఉంటారు. కొందరు స్నేహ తాళంతో సంగీతాన్ని మ్రోగిస్తారు, కొందరు శక్తి తాళంతో, కొందరు ఆనందము, మరికొందరు ప్రేమ తాళంతో మ్రోగిస్తారు. రకరకాల తాళాల సంగీతాన్ని వింటూ ఉంటారు. బాప్దాదా కూడా మీ అందరితో తిరుగుతూ ఉంటారు. కావున ఈనాటి విశేష మహత్వాన్ని అర్థము చేసుకున్నారా?

ఈ రోజు కేవలం స్మృతిదినమే కాదు, స్మృతి ద్వారా సమర్థులుగా అయ్యే రోజు. ఈ రోజు వియోగము లేక వైరాగ్యము యొక్క రోజు కాదు, ఇది సేవా బాధ్యతను తీసుకున్న పట్టాభిషేకం యొక్క రోజు. ఇది సమర్థ స్మృతి అనే తిలకాన్ని దిద్దుకునే రోజు. ''ముందు పిల్లలు, వెనుక తండ్రి'' ఈ సంకల్పము సాకారమయ్యే రోజు. ఈ రోజున బ్రహ్మాబాబా విశేషంగా డబల్ విదేశీ పిల్లలను, తండ్రి సంకల్పము మరియు ఆహ్వానాన్ని సాకార రూపమునిచ్చే స్నేహీ పిల్లలను చూసి హర్షితమవుతున్నారు. ఏ విధంగా స్నేహముతో తండ్రి సన్ముఖానికి వచ్చి చేరుకున్నారో చూస్తున్నారు. బ్రహ్మాబాబా ఆహ్వానానికి ప్రతిఫల స్వరూపంగా ఇటువంటి సర్వశక్తుల రసము నిండిన శ్రేష్ఠ ఫలాలను చూసి బ్రహ్మాబాబా పిల్లలకు విశేషంగా అభినందనలు మరియు వరదానమును ఇస్తున్నారు. సదా సహజ విధి ద్వారా వృద్ధిని పొందుతూ ఉండండి. ఎలాగైతే పిల్లలు ప్రతి అడుగులోనూ 'బాబా యొక్క అద్భుతము' అన్న గీతమునే పాడ్తారో, అలా బాప్దాదా కూడా 'పిల్లల యొక్క అద్భుతము' అనే అంటారు. దూరదేశీయులుగా, దూర ధర్మాలకు చెందినవారిగా ఉండి కూడా మీరు ఎంత సమీపంగా అయిపోయారు! సమీపంగా ఆబూలో ఉండేవారు దూరమైపోయారు. సాగర తీరంలో ఉండేవారు దాహంతో ఉండిపోయారు. కాని డబల్విదేశీ పిల్లలు ఇతరుల దాహాన్ని కూడా తీర్చే జ్ఞాన గంగలుగా అయిపోయారు. ఇది పిల్లల అద్భుతం కదా! కావున ఇటువంటి అదృష్టవంతులైన పిల్లల పై బాప్దాదా సదా సంతోషంగా ఉన్నారు. మీరందరు కూడా డబల్ సంతోషంగా ఉన్నారు కదా! మంచిది.

ఇటువంటి సదా సమానంగా అయ్యే శ్రేష్ఠ సంకల్పధారులకు, సర్వ శక్తుల విల్లు ద్వారా విల్పవర్లో ఉండేవారికి, సదా ప్రియుని ప్రేయసులుగా అయ్యి రకరకాల సంగీతాలను, పాటలను వినిపించేవారికి, సదా స్తంభము సమానంగా అచంచలంగా, స్థిరంగా ఉండేవారికి, సదా సహజ విధి ద్వారా వృద్ధిని పొంది వృద్ధిని ప్రాప్తింపజేసేవారికి, సదా మధుర మిలనాన్ని జరుపుకునే దేశ - విదేశాల అన్ని రకాల వెరైటీ పిల్లలకు పుష్ప వర్ష సహితంగా బాప్దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

ఈ రోజు స్నేహీ విశేష సేవాధారులైన పిల్లలందరినీ వతనంలోకి పిలిచారు. జగదంబను కూడా పిలిచారు. దీదీని కూడా పిలిచారు, విశ్వకిశోర్ మొదలైన అనన్యులెవరైతే సేవార్థం వెళ్లారో వారందరినీ వతనంలోకి పిలిచారు. విశేష స్మృతిదినాన్ని జరుపుకునేందుకు అనన్యులైన డబల్ సేవకు నిమిత్తంగా అయిన పిల్లలందరూ సంగమ యుగంలో ఈశ్వరీయ సేవలో కూడా సహచరులుగా ఉన్నారు, అంతేకాక భవిష్య రాజ్యాన్ని ఇప్పించే సేవలో కూడా సహచరులుగా ఉన్నారు. కావున డబల్ సేవాధారులుగా అయ్యారు కదా! ఇటువంటి డబల్ సేవాధారులైన పిల్లలు విశేష రూపంగా మధువనంలోకి వచ్చేసిన సహయోగీ, స్నేహీ ఆత్మలందరికీ ప్రియస్మృతులను తెలియజేశారు. ఈ రోజు బాప్దాదా వారి వైపు నుండి ప్రియస్మృతుల సందేశాన్ని ఇస్తున్నారు. అర్థమయ్యిందా! కొందరు కొందరిని స్మృతి చేస్తారు, కొందరు కొందరిని స్మృతి చేస్తారు. తండ్రికి తోడు తోడుగా సేవార్థము అడ్వాన్స్ పురుషార్థీ పిల్లలనెవరినైతే సంకల్పంలోనైనా స్మృతి చేశారో, వారందరి స్మృతికి(రిటర్న్) బదులుగా వారంతా మీకు ప్రియస్మృతులను తెలియజేశారు. పుష్పశాంత కూడా స్నేహంతో స్మృతి చేసింది. అలా ఎంతమంది పేర్లను చెప్పాలి! అందరికి విశేష పార్టీ వతనంలో ఉంది. డబల్ విదేశీయుల కొరకు విశేషంగా దీదీ స్మృతులనిచ్చారు. ఈ రోజు దీదీని విశేషంగా చాలామంది స్మృతి చేశారు కదా! ఎందుకంటే వీరు దీదీనే చూశారు. జగదంబను మరియు విశ్వకిశోర్ భావూను(అన్నయ్యను) అయితే చూడలేదు. అందువలన దీదీ విశేషంగా గుర్తుకు వచ్చారు. తాను అంతిమ సమయంలో పూర్తి నిస్సంకల్పంగా, నిర్మోహిగా ఉన్నారు. తనకు కూడా స్మృతి అయితే వస్తుంది. కాని అది తనను ఆకర్షించే (లాగే) స్మృతి కాదు. తాను స్వతంత్ర ఆత్మ. వారి సంఘటన(సమూహం) కూడా శక్తిశాలిగా అవుతోంది. అందరూ ప్రసిద్ధమైనవారు కదా! మంచిది.

కొంతమంది విదేశీ సోదరీ-సోదరులు సేవలో వెళ్లేందుకు బాప్దాదా నుండి శెలవు తీసుకుంటున్నారు :- పిల్లలందరికి బాప్దాదా చెప్తున్నారు - మీరు వెళ్లడం లేదు. సేవ చేసి మళ్లీ తండ్రి ముందుకు పుష్పగుచ్ఛాన్ని తెచ్చేందుకు వెళ్తున్నారు. కావున ఇంటికి వెళ్లడం లేదు, సేవ చేసేందుకు వెళ్తున్నారు. అది ఇల్లు కాదు, సేవా స్థానము. ఇదే సదా గుర్తుండాలి. మీరు దయాహృదయులైన తండ్రి పిల్లలు. కనుక దు:ఖితులైన ఆత్మలకు కూడా కళ్యాణము చేయండి. సేవ లేకుండా విశ్రాంతిగా నిదురించలేరు. స్వప్నాలు కూడా సేవకు సంబంధించినవే వస్తాయి కదా! కనులు తెరవడంతోనే బాబాతో కలుస్తారు. మళ్లీ రోజంతా తండ్రి మరియు సేవ. బాప్దాదాకు ఎంత గర్వంగా ఉందో చూడండి. పిల్లలు ఏ ఒక్కరో సేవాధారులుగా లేరు, ఇంతమంది పిల్లలందరూ సేవాధారులుగా ఉన్నారు. పిల్లలు ఒక్కొక్కరు విశ్వకళ్యాణకారులు. ఇప్పుడు ఎవరు పెద్ద పుష్పగుచ్ఛాన్ని తీసుకొస్తారో చూద్దాము. కావున మీరు ఇప్పుడు వెళ్తున్నారా లేక మళ్లీ తిరిగి వస్తున్నారా? కావున ఎక్కువ స్నేహం(ప్రేమ) ఎవరిది? తండ్రిదా లేక మీదా? పిల్లల స్నేహము ఎక్కువగా ఉన్నట్లయితే పిల్లలు సురక్షితంగా ఉంటారు. మహాదానులు, వరదానులు, సంపన్న ఆత్మలు వెళ్తున్నారు. ఇప్పుడు అనేక ఆత్మలను ధనవంతులుగా తయారుచేసి అలంకరించి తండ్రి ముందుకు తీసుకు రండి. మీరు వెళ్లడం లేదు, సేవ చేసి ఒక్కటి నుండి మూడు రెట్లుగా అయ్యి వస్తారు. శరీరం ద్వారా భలే ఎంత దూరంగా వెళ్తున్నా ఆత్మ సదా తండ్రి జతలో ఉంటుంది. బాప్దాదా సహయోగి పిల్లలను సదా తోడుగా చూస్తారు. సహయోగీ పిల్లలకు సదా సహయోగము ప్రాప్తమవుతుంది. మంచిది.

డబల్ విదేశీ సోదరీ - సోదరుల ప్రశ్నలు, బాప్దాదా జవాబులు :-

ప్రశ్న :- కొంతమంది బ్రాహ్మణ ఆత్మల పై కూడా ప్రేతాత్మల(ఈవిల్సోల్స్) ప్రభావం పడ్తుంది. ఆ సమయంలో ఏం చేయాలి?

జవాబు :- దీని కొరకు సేవాకేంద్రము యొక్క వాతావరణము సదా శక్తిశాలిగా ఉండాలి. తోడుగా మీ వాతావరణము కూడా శక్తిశాలిగా ఉండాలి. అప్పుడు ఈ ఈవిల్ స్పిరిట్స్(ప్రేతాత్మలు) ఏమీ చేయలేవు. ఇవి మనసును పట్టుకుంటాయి. మానసిక శక్తి బలహీనంగా అయిన కారణంగా వీటి ప్రభావము పడ్తుంది. కావున ప్రారంభమవ్వడానికి ముందే వాటి గురించి యోగయుక్తులైన ఆత్మలు విశేష యోగ భట్టీని ఉంచుతూ వారికి శక్తినివ్వండి. యోగయుక్తమైన గ్రూపు వారెవరైతే ఉన్నారో వారు మేము ఈ విశేష కార్యాన్ని చేయాలని భావించాలి. ఎలాగైతే ఇతర ప్రోగ్రాంలు జరుగుతాయో అలాగే ఈ ప్రోగ్రామ్ను కూడా ఎంతో అటెన్షన్తో చేసినట్లైతే అప్పుడు ప్రారంభంలో ఆ ఆత్మకు బలము(శక్తి) లభించడం వలన రక్షింపబడగలదు. భలే ఆ ఆత్మ పరవశమై ఉన్న కారణంగా యోగంలో కూర్చోజాలదు. ఎందుకంటే వారి పైన ప్రేతాత్మల ప్రభావం ఉంటుంది. కావున భలే వారు కూర్చోకపోయినా మీ కార్యాన్ని నిశ్చయబుద్ధిగా అయ్యి చేస్తూ ఉండండి. అప్పుడు నెమ్మది నెమ్మదిగా దాని చంచలత శాంతిగా అయిపోతుంది. ఆ ప్రేతాత్మ ముందు మీ పైన కూడా దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. కాని ఈ కార్యం చేయవలసిందే అని మీరు భావించాలి, భయపడకండి. నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావం తొలగిపోతుంది.

ప్రశ్న :- ఒకవేళ సేవాకేంద్రానికి ఎవరైనా ఆవహించిన ఆత్మలు జ్ఞానము వినేందుకు వస్తే ఏం చేయాలి?

జవాబు :- ఒకవేళ జ్ఞానము వినడం వలన వారిలో కొద్దిగా అయినా మార్పు వచ్చిందంటే లేక ఒక సెకండు అయినా అనుభవం చేస్తే వారిని ఉల్లాసంలోకి తీసుకు రావాలి. చాలాసార్లు ఆత్మలు కొద్దిగానైనా గమ్యము లభించని కారణంగా కూడా మీ వద్దకు వస్తారు. మారేందుకు వచ్చారా లేక అలాగే పిచ్చితనంలో ఎక్కడ దారి లభించిందో అక్కడకు వచ్చేశారా అని పరిశీలించాలి. ఎందుకంటే అనేకసార్లు ఎలాంటి పిచ్చివాళ్లు ఉంటారంటే ఎక్కడ ద్వారము తెరచి ఉన్నట్లు చూసినా అక్కడికి వెళ్తారు. స్పృహలో ఉండరు. కావున అలాంటివారు కొందరు వస్తారు. కాని వారిని ముందు పరిశీలించాలి. లేకపోతే అందులోనే సమయము వ్యర్థమైపోతుంది. ఇకపోతే ఎవరైనా మంచి లక్ష్యంతో వస్తే, పరవశమై ఉన్నట్లయితే వారికి శక్తినివ్వడం మీ పని. కాని అలాంటి ఆత్మలను ఎప్పుడూ ఒంటరిగా సంభాళించరాదు. కుమారీలు ఎవ్వరూ అలాంటి ఆత్మలను ఒంటరిగా సంభాళించకండి. ఎందుకంటే కుమారిని ఒంటరిగా చూసి పిచ్చివారి పిచ్చితనం మరింత బయట పడ్తుంది. అందువలన మీరు అలాంటి ఆత్మలను యోగ్యులుగా భావిస్తే వారిని ఏ సమయంలో ఇద్దరు-ముగ్గురు లేక ఎవరైనా బాధ్యత కలిగినవారు ఉంటారో లేక ఎవరైనా వృద్ధులులాంటి వారు ఉంటారో, ఆ సమయంలో వారిని పిలిపించి కూర్చోబెట్టాలి. ఎందుకంటే ఈనాటి ప్రపంచం చాలా మురికిగా ఉంది. అంతేకాక చాలా చెడు సంకల్పాలు చేసేవారున్నారు. అందువలన కొద్దిగా అటెన్షన్ఉంచడం కూడా అవసరము. ఇందులో చాలా స్పష్టమైన బుద్ధి కావాలి. స్పష్టమైన బుద్ధి ఉన్నట్లైతే ప్రతి ఒక్కరి వైబ్రేషన్ల ద్వారా వారు ఏ లక్ష్యంతో వచ్చారో గ్రహించగలరు.

ప్రశ్న :- ఈ రోజుల్లో కొన్ని కొన్ని స్థానాలలో దొంగతనం మరియు భయం కలిగించే వాతావరణము చాలా ఉంది. వాటి నుండి ఎలా రక్షించుకోవాలి ?

జవాబు :- ఇందులో యోగశక్తి చాలా కావాలి. ఎవరైనా మిమ్ములను భయపెట్టాలనే ఆలోచనతో వచ్చారనుకోండి, ఆ సమయంలో యోగశక్తిని ఇవ్వండి. ఒకవేళ ఏదైనా కొద్దిగా మాట్లాడినా నష్టము జరుగుతుంది. కావున అలాంటి సమయంలో శాంతిశక్తిని ఇవ్వండి. ఆ సమయంలో ఒకవేళ ఏదైనా కొంచెం మాట్లాడినా వారికి అగ్నిలో నూనె వేసినట్లవుతుంంది. మీరెలా ఉండాలంటే మాకు ఏమైనా పర్వాలేదు అని ఏమీ చింతలేనట్లే ఉండండి. వారేమి చేస్తున్నా సాక్షిగా అయ్యి లోపలి నుండి శాంతిశక్తిని ఇచ్చినట్లయితే వారి చేతులు కదలవు. వీరికైతే ఏ చింతా లేదు అని అర్థము చేసుకుంటారు. లేకపోతే భయపెడ్తారు. భయపడ్డారు లేక అలజడిలోకి వచ్చారంటే వారింకా అలజడిలోకి తీసుకొస్తారు. భయం కూడా వారికి ధైర్యాన్నిస్తుంది. కావున భయపడరాదు. అలాంటి సమయంలో(సాక్షి దృష్ట) ఆసక్తి లేని పరిశీలకులుగా ఉండే స్థితిని ఉపయోగించాలి. అలాంటి సమయం కొరకు అభ్యాసం ఉండాలి.

ప్రశ్న :- బాప్దాదా ద్వారా ఆశీర్వాదాలేవైతే లభిస్తాయో వాటి తప్పుడు ప్రయోగమేమిటి ?

జవాబు :- అప్పుడప్పుడు బాప్దాదా పిల్లలను సేవాధారులు అని(సర్వీసబుల్) లేక అనన్యులని అంటారు. లేక ఏమైనా విశేషమైన టైటిల్ఇచ్చినప్పుడు, ఆ టైటిల్ను దురుపయోగం చేస్తారు. నేనైతే అలా అయిపోయాను, నేనైతే అలా ఉండనే ఉన్నానని భావిస్తారు. అలా భావించి వారు తర్వాత చేయాల్సిన పురుషార్థాన్ని వదిలేస్తారు. దీనినే దురుపయోగమని అంటారు. అనగా తప్పుడు ప్రయోగము. ఎందుకంటే బాప్దాదా ఏ వరదానమునైతే ఇస్తారో, ఆ వరదానాన్ని స్వయం పట్ల మరియు సేవ పట్ల ఉపయోగించాలి. ఇది సరియైన రీతిగా ఉపయోగించడం.

ప్రశ్న :- అంతిమ సమయంలో ఏంటీక్రైస్ట్రూపం ఉంటుంది అని బైబిల్లో చూపిస్తారు, దీని రహస్యమేమిటి?

జవాబు :- ఏంటీక్రైస్ట్అనగా ఆ ధర్మం ప్రభావాన్ని తక్కువ చేసేవారని అర్థము. ఈ రోజుల్లో చూడండి, అదే క్రిస్టియన్ ధర్మంలో క్రిస్టియన్ ధర్మము విలువను తక్కువగా అర్థం చేసుకుంటున్నారు. ఆ ధర్మం వారే తమ ధర్మాన్ని అంత శక్తిశాలిగా భావించడం లేదు. ఇతర ధర్మాలలో శక్తి ఎక్కువని అనుభవం చేస్తారు. వీరే ఏంటీక్రైస్ట్గా అయిపోయారు. ఎలాగైతే ఈ రోజుల్లో చాలామంది ఫాదరీలు బ్రహ్మచర్యానికి మహత్వమును ఇవ్వడం లేదు. వారిని గృహస్థులుగా తయారుచేసే ప్రేరణనివ్వడం ప్రారభించారు. కావున ఆ ధర్మం వారే ఏంటీక్రైస్ట్గా అయిపోయినట్లే కదా! మంచిది.