19.12.1984        ఉదయం      మురళి ఓం శాంతి      అవ్యక్త్-బాప్దాదా     మధుబన్


'' సర్వ శ్రేష్ఠమైన, సహజమైన మరియు స్పష్ట మార్గము ''

ఈ రోజు బాప్దాదా విశేషంగా స్నేహీలను, సదా తోడు నిభాయించే(నిలుపుకునే) తమ సహచరులను(సాథీలను) చూస్తున్నారు. సహచరులు అనగా సదా తోడుగా(జతలో) ఉండేవారు. ప్రతి కర్మలో, సంకల్పములో తోడు నిభాయించేవారు. ప్రతి అడుగుపై అడుగు ఉంచి ముందుకు వెళ్లేవారు. ఒక్క అడుగు కూడా మన్మతము లేక పరమతము పై నడవనివారు. ఇటువంటి సహచరునితో తోడు నిభాయించేవారు సదా మార్గాన్ని సహజంగా అనుభవం చేస్తారు. ఎందుకంటే తండ్రి లేక శ్రేష్ఠ సహచరుడు ప్రతి అడుగు వేస్తూ దారిని స్పష్టంగా, సహజంగా చేసేస్తారు. మీరందరూ కేవలం అడుగు పై అడుగు వేస్తూ నడవాలి. మార్గము సరైనదా, సహజమైనదా, స్పష్టంగా ఉందా అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎక్కడైతే తండ్రి అడుగులు ఉన్నాయో అది శ్రేష్ఠమైన మార్గమే. కేవలం అడుగు వేయండి, ప్రతి అడుగులో పదమాలను తీసుకోండి. ఇది ఎంత సహజమైనది, తండ్రి సహచరునిగా(సాథీగా) అయ్యి తోడును నిభాయించేందుకు సాకార మాధ్యమం ద్వారా ప్రతి అడుగు రూపీ కర్మ చేసి చూపించేందుకు సాకార సృష్టి పై అవతరిస్తారు. సహజంగా చేసేందుకే సాకారాన్ని మాధ్యమంగా చేశారు. సాకారంలో అనుసరించడం లేక అడుగులో అడుగు వేయడం సహజం కదా! శ్రేష్ఠమైన సహచరుడు సాథీల కోసం ఇంతటి సహజమైన మార్గాన్ని తెలియజేశారు. ఎందుకంటే ఏ సాథీలను సహచరులుగా చేసుకున్నారో వారు భ్రమించి ఉన్న కారణంగా అలసిపోయి ఉన్నారు, నిర్బలంగా ఉన్నారు. కష్టమని భావించి నిరుత్సాహంగా అయిపోయారని సాథీ అయిన తండ్రికి తెలుసు. కావున సదా సహజాతి సహజంగా కేవలం అడుగులో అడుగు వేయండి. ఇటువంటి సహజమైన సాధనాన్ని తెలుపుతున్నారు. కేవలం అడుగు వేయడం మీ పని, నడిపించడం, ఆవలి తీరానికి చేర్చడం అడుగడుగులోను శక్తిని నింపడం, అలసటను తొలగించడం, ఇవన్నీ సాథీ అయిన తండ్రి పని. కేవలం మీ అడుగు వేయడం మానకండి. పక్కకు వేయకండి. కేవలం అడుగు వేయడం కష్టమేమీ కాదు కదా! అడుగు వేయడం అనగా సంకల్పము చేయడం. సాథీ ఏమి చెబితే అది, ఎలా నడిపిస్తే అలా నడవాలి. మీ ఇష్టానుసారంగా నడుచుకోరాదు. ఇష్టానుసారం నడుచుకోవడం అనగా ఆర్తనాదాలు చేయడమే కావున ఇలా అడుగులు వేయడం వస్తుంది కదా! ఇదేమైనా కష్టమా? బాధ్యత తీసుకునేవారు బాధ్యతను తీసుకుంటున్నారు, మరి వారి పై బాధ్యత పెట్టడం, వారికి అప్పగించడం రాదా? సాకార మాధ్యమాన్ని మార్గదర్శక స్వరూపంగా చేసి శ్యాంపిల్గా కూడా ఉంచారు. అయినా మార్గము పై నడవడం ఎందుకు కష్టమవుతుంది? ఇది సహజ సాధనము, ఒక్క క్షణములో అనుసరించే సాధనము. సాకార రూపములో బ్రహ్మాబాబా ఎలా చేశారో, ఏమి చేశారో అదే చేయాలి. తండ్రిని అనుసరించాలి.

బాబా సంకల్పమే నా సంకల్పంగా ఉందా అని సంకల్పాన్ని వెరిఫై(పరిశీలన) చేయండి. కాపీ చేయడం కూడా రాదా? ప్రపంచములోనివారు కాపీ కూడా చేయకుండా ఆపుతారు, కానీ ఇక్కడ చేయాల్సిందే కాపీ. కావున ఇది సహజమా లేక కష్టమా? సహజమైన, సరళమైన, స్పష్టమైన దారి లభించింది, ఇక దానిని అనుసరించండి. ఇతర మార్గాల వైపుకు ఎందుకు వెళ్తారు? ఇతర మార్గాలు అనగా వ్యర్థ సంకల్ప రూపీ మార్గాలు, బలహీన సంకల్పాల మార్గాలు, కలియుగ ఆకర్షణల భిన్న భిన్న సంకల్పాల మార్గాలు. ఈ మార్గాల ద్వారా చిక్కుల రూపీ అడవిలోకి వెళ్లిపోతారు. ఎక్కడ నుండైతే ఎంతగా బయట పడాలని ప్రయత్నిస్తున్నారో, అంతగా నలువైపులా ముళ్లు ఉన్న కారణంగా బయట పడలేకపోతున్నారు. ముళ్లు అంటే ఏవి? ఎక్కడ, ఏమవుతుంది, ఇదేమిటి - అనే ముళ్లు. ఇలా ఈ ఏమిటి, ఏమిటి అనే ప్రశ్నల రూపీ ముళ్లు గుచ్చుకుంటాయి. కొన్నిచోట్ల ఎందుకు అనే ముళ్లు గుచ్చుకుంటే మరి కొన్నిచోట్ల ఎలా అనే ముళ్లు గుచ్చుకుంటాయి. కొన్నిచోట్ల తమ బలహీన సంస్కారాల ముళ్లు గుచ్చుకుంటాయి. నలువైపులా ముళ్లే ముళ్లు కనిపిస్తూ ఉంటాయి. మళ్లీ ఓ సాథీ! ఇక వచ్చి రక్షించండి అని పిలుస్తూ ఉంటారు. కావున మరి అడుగులో అడుగు వేసి నడవకుండా ఇతర మార్గాల వైపుకు ఎందుకు వెళ్తున్నారు? అని సాథీ అయిన బాబా అడుగుతారు. స్నేహితుడు తోడు ఇచ్చేందుకు తనంతకు తానే ఆఫర్చేస్తుంటే, మరి ఆ స్నేహితుని ఎందుకు వదిలేస్తున్నారు? పక్కకు తప్పుకోవడం అనగా ఆధారమును వదులుకోవడం. అసలు ఒంటరిగా ఎందుకు అవుతున్నారు? హద్దులోని తోడు యొక్క ఆకర్షణ ఏ సంబంధముదైనా లేక సాధనముదైనా తనవైపుకు ఆకర్షిస్తూ ఉంటుంది. ఈ ఆకర్షణ కారణంగానే సాధనాన్ని లేక వినాశీ సంబంధాన్ని మీ తోడుగా చేసుకుంటారు లేక ఆధారంగా చేసుకుంటారు. అప్పుడే అవినాశీ స్నేహితుని నుండి పక్కకు తప్పుకుంటారు, దానితో ఆధారం దూరమైపోతుంది. అర్ధకల్పము ఈ హద్దులోని ఆధారాలను ఆధారంగా భావించి అవి ఆధారమో లేక ముంచివేసే ఊబియో అనుభవం చేశారు. అవి మిమ్ములను బంధించాయా (చిక్కించుకున్నాయా), పడవేశాయా లేక గమ్యానికి చేర్చాయా? బాగా అనుభవం చేశారు కదా! 63 జన్మల అనుభవీలు ఇంకా మరొక జన్మ కావాలా? ఒకసారి మోసపోయినవారు మరొకసారి మోసపోరు. కానీ పదే పదే మోసపోతూ ఉంటే వారిని భాగ్యహీనులని అంటారు. ఇప్పుడైతే స్వయంగా భాగ్యవిధాత అయిన బ్రహ్మాబాబా బ్రాహ్మణులందరి జన్మపత్రిలో శ్రేష్ఠ భాగ్యమనే పెద్ద రేఖను గీశారు కదా! భాగ్యవిధాత మీ భాగ్యాన్ని తయారుచేశారు. బాబా భాగ్యవిధాత అయిన కారణంగా బ్రాహ్మణ పిల్లలకు ప్రతి ఒక్కరికి నిండుగా ఉన్న భాగ్య భండారాన్ని వారసత్వంగా ఇచ్చారు. కావున భాగ్య భండారానికి యజమాని పిల్లలకు ఏదైనా లోపం ఉండగలదా? ఆలోచించండి.

నా భాగ్యము ఏమిటి అని ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే భాగ్యవిధాత తండ్రియే అయిపోయారు కనుక పిల్లలకు భాగ్యమనే సంపదలో లోటు ఏముంటుంది? భాగ్యమనే ఖజానాకు అధిపతులుగా అయిపోయారు కదా! ఇటువంటి భాగ్యవంతులు ఎప్పుడూ మోసపోజాలరు కావున సహజమైన మార్గము అడుగులో అడుగు వేయండి. స్వయాన్ని స్వయమే చిక్కులలో పడేసుకుంటారు సాథీ తోడును వదిలేస్తారు. కేవలం మేము సాథీకి సాథీలము(సహయోగులము) అన్న ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి, పరిశీలించుకోండి. తద్వారా స్వయముతో స్వయం సంతృప్తిగా ఉంటారు. సహజమైన మార్గము ఏమిటో అర్థం అయ్యిందా? సహజమైన దానిని కష్టంగా చేసుకోకండి. సంకల్పములో కూడా ఎప్పుడూ కష్టంగా అనుభవం చేసుకోరాదు. ఇటువంటి ధృఢసంకల్పము చేయడం వస్తుంది కదా! లేక అక్కడకు వెళ్లి మళ్లీ కష్టంగా ఉందని అంటారా? పేరు మాత్రం సహజ యోగము అని ఉంది కానీ కష్టంగా అనుభవం చేసుకుంటున్నారని బాప్దాదా గమనిస్తున్నారు. స్వయాన్ని అధికారులుగా భావించుకుంటారు కానీ మళ్లీ అధీనులుగా అవుతున్నారు. భాగ్యవిధాత పిల్లలు అయ్యి ఉండి మా భాగ్యములో ఉందో లేదో అని అనుకుంటే దానినేమనాలి? నా భాగ్యములో ఇంతే ఉందేమో అని కూడా అంటారు. కావున మిమ్ములను మీరు తెలుసుకోండి మరియు సదా స్వయాన్ని అన్ని వేళలలోనూ సహచరులుగా భావించి నడవండి.

ఇటువంటి సదా పత్రి అడుగులో అడుగు వేసే, తండిన్రి అనుసరించే, సదా పత్రి సంకల్పములో స్నేహితుని తోడును అనుభవం చేసుకునే, సదా ఒక్క సాథీ తప్ప ఇంకెవ్వరు లేరు అనే పీత్రిని నిభాయించే సదా సహయోగులకు, శేష్ఠ్ర భాగ్యవాన్విశేష ఆత్మలకు బాప్దాదాల పియ్ర స్మృతులు మరియు నమస్తే.

కుమారీలతో అవ్యక్త బాప్దాదా వ్యక్తిగత మిలనము :-

1. కుమారీలు అనగా అద్భుతము చేసేవారు. సాధారణ కుమారీలు కారు, అలౌకిక కుమారీలు. లౌకికములోని ఈ లోకములోని కుమారీలు ఏం చేస్తారు? అలౌకిక కుమారీలైన మీరు ఏం చేస్తున్నారు? రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. వారు దేహాభిమానంలో ఉంటూ ఇతరులను కూడా దేహాభిమానములోకి తోస్తూ ఉంటారు. మీరు స్వయం దేహాభిమానులుగా అయ్యి స్వయమూ ఎగురుతూ ఉంటారు, ఇతరులను కూడ ఎగిరిస్తూ ఉంటారు. మీరు ఇటువంటి కుమారీలే కదా! మీకు తండ్రి లభించాక సర్వ సంబంధాలు ఒక్క తండ్రితోనే ఉన్నాయి. ఇంతకుముందు కేవలం నామమాత్రంగా ఉండేవారు, ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్నారు. భక్తిమార్గములో కూడా సర్వ సంబంధాలు ఒక్క తండ్రితోనే అని తప్పకుండా గానం చేసేవారు. కానీ ఇప్పుడు ప్రాక్టికల్గా సర్వ సంబంధాల రసము తండ్రి ద్వారా లభిస్తుంది. మీరు ఈ విధంగా అనుభవం చేసేవారే కదా! సర్వ రసాలు ఒక్క తండ్రి నుండే లభించినప్పుడు మరి ఎటువైపుకూ సంకల్పాలు వెళ్లజాలవు. ఇటువంటి నిశ్చయ బుద్ధి విజయీ రత్నాలు సదా మహిమ చేయబడ్తారు, పూజింపబడ్తారు. కావున విజయీ రత్నాలము, స్మృతి రూపి తిలకధారులైన ఆత్మలము అన్న స్మృతి ఉంటోందా? ఇంతమంది కుమారీలు ఏ అద్భుతాన్ని చేస్తారు? సదా ప్రతి కర్మ ద్వారా తండ్రి కనిపించాలి. ఏం మాట్లాడినా ఆ మాటలలో తండ్రి కనిపించాలి. ప్రపంచంలో కూడా కొందరు చాలా బాగా మాట్లాడేవారు ఉంటారు. అప్పుడు అందరూ వీరికి నేర్పించేవారెవరు? అని అంటారు. వారి వైపుకు దృష్టి వెళ్తుంది. ఆ విధంగా మీ ప్రతి కర్మ ద్వారా తండ్రి ప్రత్యక్షత జరగాలి. అటువంటి దారణా మూర్తుల దివ్యమూర్తుల విశేషత ఇదే. అందరూ ఉపన్యసించే వారిగా అయితే అవుతారు, కానీ తమ ప్రతి కర్మ ద్వారా ఉపన్యసించేవారు కోట్లాది మందిలో కొద్దిమందే ఉంటారు. కావున అటువంటి విశేషతను చూపిస్తారు కదా! మీ చరిత్ర ద్వారా తండ్రి చిత్రాన్ని చూపిచాలి. మంచిది.

2. ఇది కుమారీల సమూహము. సైన్యము తయారవుతోంది. వారైతే(సైన్యము) లెఫ్ట్- రైట్చేస్తూ ఉంటారు. కానీ మీరు సదా రైట్- రైట్చేస్తూ ఉంటారు. ఈ సేన ఎంత శ్రేష్ఠమైనది! శాంతి ద్వారా విజయులుగా అవుతారు. శాంతి ద్వారానే స్వరాజ్యాన్ని పొందుతారు. ఎటువంటి అలజడి చేయవలసిస అవసరము ఉండదు. కావున మీరు పక్కా శక్తి సైన్యములోని శక్తులు. సైన్యాన్ని వదిలి వెళ్లేవారు కాదు, స్వప్నములో కూడా ఎవ్వరూ కదిలించలేరు. ఎప్పుడూ ఎవరి సాంగత్య దోషములోకి వచ్చేవారు కాదు. సదా తండ్రి సాంగత్యములో ఉండేవారు. ఇతరుల సాంగత్యములోకి రాజాలరు. కావున మొత్తం గ్రూపు అంతా సాహసవంతులే కదా! సాహసవంతులు ఏం చేస్తారు? మైదానములోకి వస్తారు. మీరంతా సాహసవంతులే కానీ ఇంకా మైదానంలోకి రాలేదు. సాహసవంతులు మైదానంలోకి వచ్చినప్పుడు సాహసవంతుల సాహసానికి గుర్తుగా బ్యాండు మ్రోగించడం మీరు చూసి ఉంటారు. మీరు కూడా మైదానములోకి వచ్చినప్పుడు సంతోషం కలిగించే బ్యాండు మ్రోగుతుంది. కుమారీలు సదా శ్రేష్ఠ భాగ్యవంతులు. కుమారీలకు సేవ చేసే చాలా మంచి అవకాశం లభిస్తుంది. సేవాధారులు తక్కువగా ఉన్నారు. సేవాధారులు సేవ చేసేందుకు వెళ్తే ఎంత సేవ జరుగుతుంది! కుమారీలు ఏ అద్భుతం చేస్తారో చూద్దాము. సాధారణ కార్యమునైతే అందరూ చేస్తారు కానీ మీరు విశేష కార్యాన్ని చేసి చూపించండి. కుమారీలు ఇంటికి అలంకారము. లౌకికంలో కుమారీలను ఎలా భావించినా పారలౌకిక ఇంట్లో కుమారీలు ఎంతో గొప్పవారు. కుమారీలు ఉంటే సెంటరుకు శోభ ఉంటుంది. మీరు మాతల కొరకు కూడా విశేషమైన లిఫ్ట్. మొదట మాతలు గురువులు. తండ్రి మాతలను గురువులుగా ముందుంచారు. అప్పుడే భవిష్యత్తులో మాతల పేరు ముందు ఉంటుంది. మంచిది.

టీచర్లతో :- టీచర్లు అనగా తండ్రి సమానమైనవారు. తండ్రి ఎలా ఉన్నారో అలా టీచర్లు నిమిత్త సేవాధారులు. తండ్రి కూడా నిమిత్తమైనవారే, అలాగే సేవాధారులు కూడా నిమిత్త ఆత్మలే. నిమిత్తంగా భావిస్తే స్వతహాగానే తండ్రి సమానంగా అయ్యే సంస్కారము ప్రాక్టికల్గా వస్తుంది. ఒకవేళ నిమిత్తులుగా భావించకుంటే తండ్రి సమానంగా అవ్వజాలరు. కావున ఒకటేమో నిమిత్తంగా అవ్వడం, రెండవది సదా అతీతంగా, ప్రియంగా అవ్వడం. ఇవి తండ్రి విశేషతలు. ప్రియంగా కూడా అవుతారు అతీతంగా కూడా ఉంటారు. అతీతం అయ్యి ప్రియంగా అవుతారు. కావున బాప్సమాన్అనగా అతి అతీతంగా అవ్వడం మరియు అతిప్రియంగా అవ్వడం. ఇతరులతో అతీతంగా, తండ్రితో ప్రియంగా అవ్వడం. ఈ సమానత ఉందా? తండ్రికి గల రెండు విశేషతలు ఇవే కావున తండ్రి సమానంగా సేవాధారులు కూడా ఇదే విధంగా ఉన్నారు. ఇదే విశేషతను సదా స్మృతిలో ఉంచుకుంటే సహజంగా ముందుకు వెళ్తూ ఉంటారు. శ్రమ చేయాల్సిన అవసరముండదు. ఎక్కడైతే నిమిత్తంగా ఉంటారో అక్కడ సఫలత ఉండనే ఉంది. అక్కడ నాది అన్నది రాజాలదు. ఎక్కడ నాది అనేది ఉంటుందో అక్కడ సఫలత ఉండదు. నిమిత్త భావము సఫలతకు తాళంచెవి. హద్దులోని లౌకిక నాది అనేది వదిలేస్తే ఇక నాది అన్నది ఎక్కడి నుండి వస్తుంది? నాది అని అనేందుకు బదులు బాబా బాబా అనడం వలన సదా సురక్షితంగా ఉంటారు. ఇది నా సెంటరు కాదు, బాబా సెంటరు. వీరు నా జిజ్ఞాసువులు కారు, బాబా జిజ్ఞాసువులు. నాది అనేది సమాప్తమై అంతా నీదిగా అయిపోతుంది. నీది అనడం అనగా ఎగరడం. కావున నిమిత్త శిక్షకులు అనగా ఎగిరేకళకు ఉదాహరణమూర్తులు. ఎలాగైతే మీరు ఎగిరేకళకు ఉదాహరణగా అవుతారో అలా ఇతరులు కూడా అవుతారు. మీరు వద్దనుకున్నా మీరు ఎవరి కొరకైతే నిమిత్తంగా అవుతారో వారిలో ఆ వైబ్రేషన్లు స్వతహాగా వచ్చేస్తాయి. కావున నిమిత్త శిక్షకులు, సేవాధారులు సదా అతీతంగా, సదా ప్రియంగా ఉంటారు. ఎప్పుడు ఏ పరీక్ష వచ్చినా అందులో పాస్అయ్యేవారే నిశ్చయ బుద్ధి విజయులు.

పార్టీలతో :-

1. సదా స్వయాన్ని డబల్ లైట్ ఫరిస్తాలుగా అనుభవం చేస్తున్నారా? ఫరిస్తాలు అనగా ఒక్క బాబాయే ప్రపంచంగా ఉన్నవారు. అటువంటి ఫరిస్తాలు సదా తండ్రికి ప్రియమైనవారు. ఫరిస్తాలు అనగా దేహము మరియు దేహ సంబంధాలతో ఏ ఆకర్షణ లేనివారు. నిమిత్త మాత్రంగా దేహములో ఉంటారు. దేహ సంబంధీకులతో కార్యములోకి వస్తారు కానీ అనుబంధాలు ఉండవు. ఎందుకంటే ఫరిస్తాలకు ఇంకెవ్వరితోనూ సంబంధాలు ఉండవు. ఫరిస్తాల సంబంధాలు ఒక్క తండ్రితోనే ఉంటాయి. మీరు అటువంటి ఫరిస్తాలు కదా. ఇప్పుడిప్పుడే దేహములోకి కర్మలు చేసేందుకు వస్తారు, మళ్లీ ఇప్పుడిప్పుడే దేహము నుండి అతీతంగా అయిపోతారు. ఫరిస్తాలు క్షణములో ఇక్కడ ఉంటారు, మరుక్షణములో ఇంకెక్కడో ఉంటారు. ఎందుకంటే వారు ఎగిరేవారు. కర్మ చేసేందుకు దేహము ఆధారంగా తీసుకుంటారు ఆ తర్వాత మళ్లీ పైకి వెళ్ళిపోతారు. మీరు ఈ విధంగా అనుభవం చేస్తున్నారా? ఒకవేళ ఎక్కడైనా ఆకర్షణ ఉంటే, దేహ బంధనం ఉంటే బంధనము ఉన్నవారు ఎగరలేరు. వారు క్రిందకు వచ్చేస్తారు. ఫరిస్తాలు అనగా సదా ఎగిరేకళలో ఉండేవారు. క్రిందకు - పైకి అయ్యేవారు కారు. సదా ఉన్నతమైన స్థితిలో ఉండేవారు. ఫరిస్తాల ప్రపంచంలో ఉండేవారు కావున ఫరిస్తాలు స్మృతి స్వరూపులుగా అయితే ఇక అన్ని సంబంధాలు సమాప్తమైపోతాయి. మీరు ఇటువంటి అభ్యాసులే కదా! కర్మ చేయగానే మళ్లీ కర్మ నుండి అతీతంగా అయిపోతారు. లిఫ్ట్లో ఏం చేస్తారు? ఇప్పుడిప్పుడే క్రిందకు, మళ్లీ ఇప్పుడిప్పుడే పైకి వెళ్తూ ఉంటారు. క్రిందకు వస్తారు, కర్మ చేస్తారు, మళ్లీ స్విచ్ను నొక్కి పైకి వెళ్లిపోతారు. ఇటువంటి అభ్యాసులుగా అవ్వండి. మంచిది.

2. అందరూ ఆత్మిక గులాబీలు కదా! మీరు మల్లెలా లేక గులాబీలా? ఎలాగైతే గులాబీ పుష్పము అన్ని పుష్పాల కంటే శ్రేష్ఠమైనదిగా గాయనం చేయబడ్తుందో అలా ఆత్మిక గులాబీలు అనగా శ్రేష్ఠ ఆత్మలు. ఆత్మిక గులాబీలు సదా ఆత్మీయతలో ఉండేవారు. సదా ఆత్మిక నషాలో ఉండేవారు. సదా ఆత్మిక సేవలో ఉండేవారు మీరు అటువంటి ఆత్మిక గులాబీలు. ఈనాటి సమయానుసారంగా ఆత్మీయత అవసరముంది. ఆత్మీయత లేని కారణంగానే ఈ తగాదాలు, గొడవలు అన్నీ ఉన్నాయి. కావున ఆత్మిక గులాబీలుగా అయ్యి ఆత్మీయతా సుగంధాన్ని వ్యాపంపజేసేవారిగా అవ్వండి. ఇదే బ్రహ్మాబాబా జీవిత కర్తవ్యము. సదా ఇదే కర్తవ్యములో బిజీగా ఉండండి.